తెలుగుదేశం పార్టీకి ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికలు నూతన ఉత్తేజాన్ని ఇచ్చాయి. 2024 ఎన్నికలలో ప్రజాభిప్రాయానికి ఈ ఎన్నికలు ప్రామాణికంగా నిలిచాయి. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే టిడిపి ఓటుబ్యాంకు దాదాపు 15 శాతం వరకు పెరగటం, అదే సమయంలో అధికార పార్టీ ఓటింగ్ శాతం 10 నుంచి 18 శాతం వరకు పడిపోవటం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్య పరుస్తోంది. కేవలం నాలుగేళ్ల కాలంలో అధికార పార్టీ ఓటింగ్ శాతం ఇంత దారుణంగా పడిపోయిన సంఘటనలు ఇంతకు ముందెన్నడూ లేవు. భారీగా దొంగ ఓట్లు చేర్పించడం, అధికార దుర్వినియోగం, అక్రమాలు, దౌర్జన్యాలు, తారాస్థాయిలో ప్రలోభాలు వంటి చర్యలకు అధికార వైసీపీ పాల్పడింది. అయినప్పటికీ దాని పతనాన్ని అడ్డుకొలేక పోయింది. దాదాపు అన్నివర్గాల ప్రజలలో ప్రబలుతున్న అసంతృప్తి, అసహనం తో పాటు ఉద్యోగ వర్గాలు, యువత ఆలోచనా సరళిలో మార్పు ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.
ఈ ఎన్నికలు కేవలం ప్రభుత్వ వ్యతిరేకతనే కాదు, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలత ను ప్రస్ఫుటం చేశాయని చెప్పవచ్చు. ఈ రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్ ను చంద్రబాబు మాత్రమే కాపాడగలరన్న నమ్మకం అన్నివర్గాల ప్రజలలో రోజురోజుకు అధికమవుతోంది. ప్రధానంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జరుపుతున్న యువగళం పాదయాత్ర క్షేత్ర స్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతున్నది. నారా లోకేష్ పట్ల కేవలం యువతలో నే కాకుండా అన్నివర్గాల లో భరోసా పెరుగుతున్నది. కేవలం 50 రోజులైనా నిండక ముందే యువగళం పాదయాత్ర ఒక ప్రభంజనం లా మారింది. ముందుముందు యువగళం రాష్ట్రవ్యాప్తంగా సునామీ సృష్టించే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పార్టీ అధినేత చంద్రబాబు సైతం నవయువకునిలా పార్టీ శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు. పార్టీ ప్రతిష్టను పెంచటంతో పాటు అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టడం లో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికీ తోడు టిడిపి శ్రేణుల్లో గతంలో ఇంతకు ముందెన్నడూ లేనంత పట్టుదల కానవస్తుంది. ప్రాణాలకు తెగించి క్షేత్రస్థాయిలో పోరాడుతున్న తెగువ శ్రేణుల్లో కన్పిస్తోంది. ఇందుకు చంద్రబాబు రగిల్చిన స్ఫూర్తి, లోకేష్ చూపుతున్న పోరాట తత్వం ప్రధాన కారణమని చెప్పక తప్పదు. రానున్న ఎన్నికల వరకు ఇదే స్ఫూర్తి కొనసాగితే టిడిపి అప్రతిహత విజయాన్ని నమోదు చేస్తుందనటం లో సందేహం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రధానంగా మూడు అంశాలను ప్రస్ఫుటం చేస్తున్నాయి. టిడిపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుండటం, వైసీపీ పట్ల ప్రబలుతున్న వ్యతిరేకత, అక్రమాలు, దౌర్జన్యాలు, ప్రలోభాలు ఎల్లవేళలా చెల్లుబాటు కాకపోవటం. నిన్న మొన్నటి వరకు టిడిపి శ్రేణుల్లోనూ అక్కడక్కడా వైసీపీ దౌర్జన్యాలు పట్ల భయాందోళనలు తొంగిచూసేవి. సమయం వచ్చే వరకు వేచి చూడాలని, అప్పటివరకు గుంభనంగా వుండాలన్న ధోరణి కనిపించేది. ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తామని వాలంటీర్ ల బెదిరింపులు సైతం అందుకు ఒక కారణంగా భావించవచ్చు. అయితే ప్రభుత్వ పథకాల లో డొల్లతనం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం కాసాగాయి. అవి కేవలం ప్రచారార్భాటమే నన్న సత్యాన్ని గ్రహించసాగారు. దీంతో వారు బాహాటంగానే గళం వినిపించసాగారు. వైసీపీ అధినేత సొంత ప్రాంతమైన పశ్చిమ రాయలసీమ ప్రాంతంలోనూ ఆ పార్టీకి చేదు ఫలితం రావటం అందుకు నిదర్శనం. ఈ ఫలితాల పట్ల అధికార పార్టీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికి, లోలోన వారిని భయం పట్టి పీడిస్తోంది. దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు సైతం ఇప్పుడు దారులు మూసుకుపోయాయి అని వైసీపీ నాయకులు లోలోన మధనపడుతున్నట్టు సమాచారం.