- నాలుగోసారి ముఖ్యమంత్రిగా నేడే ప్రమాణ స్వీకారం
- కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద సర్వం సిద్ధం
- హాజరుకానున్న మోదీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, సినీ దిగ్గజాలు రజనీకాంత్, చిరంజీవి
- కట్టుదిట్టమైన భద్రత, పకడ్బందీగా ఏర్పాట్లు
అమరావతి: ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద బుధవారం ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. దీనికోసం 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతో వేదిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో కూటమి ఘన విజయానికి ప్రతీకగా ఈ కార్యక్రమం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యనాయకులు, జనసేనాని పవన్ కల్యాణ్, రాష్ట్రంలో గెలిచిన 164 మంది కూటమి ఎమ్మెల్యేలు, 21 మంది లోక్‌సభ సభ్యులు హాజరుకానున్నారు. మెగాస్టార్ చిరంజీవి, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, పలువురు సినీ ప్రముఖులు కూడా తరలివస్తున్నారు. వీరందరికీ ప్రొటోకాల్ పరంగా ఎక్కడా ఇబ్బందులు ఎదురవకుండా, భద్రతాపరమైన లోపాల్లేకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభావేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రముఖులతోపాటుగా దాదాపు లక్ష మందికిపైగా ప్రజలు వస్తారని అంచనా వేసిన నేపథ్యంలో 80 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా మిగిలిన వారు కూడా ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికి దాదాపు 8 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటిని రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సభా వేదిక, ప్రాంగణంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లోనూ నిఘా కెమెరాలను అమర్చారు. సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఆధ్వర్యంలో డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, కార్యక్రమ రాష్ట్ర సమన్వయ అధికారి, రాష్ట్ర రవాణా, రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, రాష్ట్ర ఉన్నతాధికారులు వీర పాండ్యన్, రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ ఎస్‌ఎస్ శ్రీధర్, పోలీస్ అధికారులు, వివిధ జిల్లాల నుండి విధుల నిర్వహణకై విచ్చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు.
ఐదేళ్లుగా అన్ని విధాలుగా అణిచివేతకు గురై.. ఈ క్షణం కోసమే ఎదురు చూస్తున్న తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు ఈ అపురూప వేడుకను తిలకించాలని వేలాదిగా కేసరపల్లి వైపు కదం తొక్కుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను… అనే మాటలు వినేందుకు కష్టనష్టాలకు ఓర్చి, నెత్తురు చిందించిన వేలాదిమంది కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలివస్తున్నారు. అటు ప్రధాని సహా పలువురు వీవీఐపీలు, ఇటు లక్షలాదిగా తరలివస్తున్న జనాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో సుమారు 30వరకు పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు.
విజయవాడ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు. పాసులు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. నగరంలో వీఐపీలు బసచేసే హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని విజయవాడ పోలీసు కమిషనర్ పీహెచ్ రామకృష్ణ తెలిపారు. అతిథులు సహా సభకు వచ్చినవారెవరూ ఎలాంటి ఇబ్బంది పడకుండా, అంతా సవ్యంగా సాగేలా రూపొందించిన ప్రణాళికను అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. భారీ వేదిక నిర్మాణంతోపాటు వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా జర్మన్ హ్యాంగర్లతో భారీ షెడ్లు ఏర్పాటు చేశారు.
ఇన్‌ఛార్జులదే బాధ్యత!
పన్నెండు ఎకరాల స్థలంలో ఏర్పాటవుతున్న సభా ప్రాంగణంలో ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్యాలరీలకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, న్యాయమూర్తులు, అఖిల భారత సర్వీసుల అధికారులు, ప్రత్యేక అతిథులు, ఆహ్వానితులు, మీడియా ప్రతినిధుల కోసం వీటిని కేటాయించారు. ఒక్కో గ్యాలరీకి ఒక జిల్లాస్థాయి అధికారిని నియమించారు. మంచినీరు, అల్పాహారం, ఇతర సౌకర్యాలను కల్పించాల్సిన బాధ్యత వీరిదే. వీవీఐపీలకు పాసుల ప్రకారం సీటింగ్ కేటాయించాల్సి ఉంటుంది. ఆయా సీట్లలో వారిని కూర్చోబెట్టే బాధ్యతను గ్యాలరీ ఇన్ఛార్జికే అప్పగించారు. ఇందుకోసం వివిధ జిల్లాల నుంచి సంయుక్త కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలను కేటాయించారు. కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్ గీతాంజలిశర్మ సమన్వయం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. సభా వేదికపై కూర్చొనే అతిథుల కోసం ప్రొటోకాల్ ప్రకారం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించారు.
భారీగా రానున్న జనం
ప్రమాణస్వీకార మహోత్సవానికి వచ్చే జనం కోసం చుట్టుపక్కల జిల్లాల్లో నియోజకవర్గానికి 4 బస్సుల చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, తూర్పుగోదావరి తదితర జిల్లాల నుంచి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అంచనా. చాలావరకు కార్యకర్తలు సొంతంగా వాహనాలను సమకూర్చుకుని రావొచ్చని చెబుతున్నారు. సభకు లక్షలాదిగా జనం వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) చెప్పారు. ప్రధానమంత్రి రాకతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది కాబట్టి కార్యకర్తలు ఉదయం 10 గంటలకల్లా సభా ప్రాంగణంలోకి రావాలని సూచిస్తున్నారు.
ఈ కార్యక్రమం కోసం కోల్‌కతా`చెన్నై జాతీయ రహదారిపై బుధవారం పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నారు. విజయవాడ నగరంలో కూడా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రధాన సభ వేదిక వద్దకు రాకపోకలు సాగించేందుకు, గవర్నర్ కాన్వాయికి ఎలాంటి అడ్డంకులు లేకుండా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతో పాటు వివిధ ప్రయాణ మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మందులు, అంబులెన్స్ సిద్ధంగా ఉంచారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ లింక్ ద్వారా అన్ని జిల్లాలలో ప్రజలు వీక్షించేందుకు వీలుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు.