- ఇంట్లో నాన్న, పనిలో బాస్ అని పిలుచుకునే అదృష్టవంతుడిని
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి (చైతన్య రథం): చంద్రబాబు ముఖ్యమంత్రిగా 30 ఏళ్ల క్రితం చేపట్టిన బాధ్యతలు ఒక మైలురాయికంటే ఎక్కువని మంత్రి నారా లోకేశ్ అన్నారు. హైటెక్ సిటీనుంచి క్వాంటం వరకూ సీఎంగా ఆయన ప్రయాణం ఒక సజీవ వారసత్వమని కొనియాడారు. బయోటెక్ ఆకాంక్షల నుంచి డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థల వరకు ఈ పురోగతే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణం చేసి మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న నాన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.. ‘‘ఇంట్లో ‘నాన్న’, పనిలో ‘బాస్’ అని పిలుచుకునే అదృష్టం నాకు లభించింది. పాలనకు సాంకేతికతను జోడిరచి పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన వరకూ ప్రయాణం సాగింది. సంక్షోభాలను సైతం అవకాశాలుగా మలుచుకుంటూ ముందుకు సాగారు. హైటెక్ సిటీ, జినోమ్ వ్యాలీ కొత్త సాంకేతిక గుర్తింపును శక్తిమంతం చేశారు. అమరావతి నిర్మాణం వరకు ఆయన నాయకత్వం ఎన్నో ఆవిష్కరణలకు మైలురాయి, వేగం, జవాబుదారీతనం, మౌలిక సదుపాయాల నిర్మాణం, డేటా ఆధారిత సేవలు, పౌరులు, సంస్థలను శక్తిమంతం చేసే వేదికలతో సరికొత్త ఒరవడి సృష్టించారు. చంద్రబాబు పదవీకాలం సామాజిక న్యాయం, బలహీనుల సాధికారతలో గణనీయమైన పెరుగుదలకు నాంది పలికింది. నదీజలాల సద్వినియోగం కరవు ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను మార్చేసింది. హంద్రీ-నీవాలాంటి కీలకమైన లిఫ్ట్ లింకేజీల ద్వారా కృష్ణా జలాలను రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు అంతటా లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేశారు. గ్రామ చెరువులను స్థిరీకరించి వ్యవసాయాన్ని బలోపేతం చేశారు’’ అని నారా లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.