- విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు
- వైసీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన అక్రమ కేసు
- సత్యమే గెలిచిందన్న మంత్రి రామానాయుడు
విజయవాడ (చైతన్యరథం): జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడిపై అక్రమ కేసులను ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన నిమ్మల రామానాయుడుపై పోలీసులు అక్రమంగా పెట్టిన కేసును కొట్టి వేస్తూ విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి అనిత గురువారం తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…..2019 ఆగస్టులో వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్భంధించిన ఆశా వర్కర్లకు న్యాయపరంగా అండగా నిలిచిన అప్పటి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ శ్రేణులపై నాడు అక్రమ కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి రామానాయుడుతో పాటు, కొందరు పార్టీ శ్రేణులు గత ఆరేళ్లుగా విజయవాడ ప్రత్యేక కోర్టుకు హాజరవుతున్నారు. పలు వాయిదాల అనంతరం ఈ కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి గురువారం తీర్పు చెప్పారు.
ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ సత్యం, న్యాయమే గెలిచిందన్నారు. ఆనాడు పోలీసులు అన్యాయంగా కేసులు నమోదు చేశారన్నారు. తొలిసారి 2014లో, రెండోసారి 2019లో ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో తనపై ఒక్క ఎఫ్‌ఐఆర్, కేసు కూడా లేవని ఎన్నికల అఫిడివిట్ దాఖలు చేశానన్నారు. మూడోసారి 2024లో మాత్రం తనపై 25 కేసులు నమోదైనట్లుగా అఫిడవిట్ దాఖలు చేయాల్సి వచ్చిందన్నారు. జగన్ ఐదేళ్ల పాలన కక్షలు, కేసులు, వేధింపులతో సాగిందనడానికి తనపౖౖె నమోదైన 25 అక్రమ కేసులే నిదర్శనం అన్నారు. సత్యమేవ జయతే అనే సూత్రాన్ని నమ్ముకుని పనిచేస్తున్న పార్టీ తమదని, చివరకు సత్యమే గెలుస్తుందని మరోసారి రుజువైందని మంత్రి రామానాయుడు చెప్పారు.