- ప్రజలిచ్చిన అధికారం సేవ కోసమే.. పెత్తనం కోసం కాదు
- నేను, పవన్ సామాన్యుల్లో ఒకరిలానే ఉంటాం
- పరదాలు కట్టడం, షాపులు మూసేయడం, చెట్లు నరికేయడం ఉండదు
- ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఉద్ఘాటన
విజయవాడ(చైతన్యరథం): ఏపీకి రాజధానిగా అమరావతే ఉంటుంది.. విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ కనెక్షన్ లో మంగళవారం జరిగిన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థికవ్యవస్థకు చోదకశక్తిగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. మూడు పార్టీలకు విశాఖపట్నం ముఖ్యమైన నగరం అన్నారు. 2014లో బీజేపీ తరఫున ఎంపీగా విశాఖలో హరిబాబు భారీ మోజారిటీతో గెలిచారు. తర్వాత 2019లో విశాఖపట్నంలోని 4 అసెంబ్లీ సీట్లు టీడీపీ గెలిచింది. ఇప్పుడు విశాఖ పార్లమెంట్ పరిధిలో లోక్‌సభ సహా, మొత్తం అసెంబ్లీ స్థానాలు క్లీన్ స్వీప్ చేశాం. విశాఖను రాజధానిగా చేస్తామని, ప్రమాణ స్వీకారం అక్కడే చేస్తానని జగన్ చెప్పినా ప్రజలు ఇక నువ్వు రావొద్దని తీర్పు ఇచ్చారు. న్యాయ రాజధాని కర్నూలు అంటూ మోసం చేశారు. రాయలసీమలోనూ ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ప్రజలు మనకు ఊహించని మెజార్టీని ఇచ్చారు. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టడం లాంటివి ఇక ఉండవు. ముఖ్యమంత్రి కూడా మామూలు మనిషే. నేను సీఎంగా ఉన్నా, నా మిత్రుడు పవన్ కళ్యాణ్ ఏ పదవిలో ఉన్నా సామాన్యుల్లా ప్రజల్లో ఒకరిగానే ఉంటాం. ఈ హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. మేము బయటకు వచ్చినప్పుడు ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదన్నది మా విధానమని చంద్రబాబు స్పష్టం చేశారు.
స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళదాం
గత ప్రభుత్వం దాడులు చేసి బాధితులపైనే కేసులు పెట్టింది. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి మన ప్రభుత్వంలో భంగం కలగదు. స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళతాం. కేంద్రంలో రాష్ట్రానికి సముచిత గౌరవం దక్కింది. కేంద్రంలో ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసర వర్మకు మంత్రి పదవులు వచ్చాయి. సాధారణ వ్యక్తులకు కూడా బీజేపీ ఎంపీ టికెట్లు ఇచ్చింది. టీడీపీ-జనసేన కూడా అదే పంథాలో ఉన్నాయి. పదేళ్ల్ల మోదీ పాలన దేశ ప్రతిష్టను పెంచింది. ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది. గతంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి వచ్చింది. ఎన్డీయే 3.0 ప్రభుత్వంలో ప్రపంచంలోనే 3వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోంది. 2047 నాటికి వికసిత్ భారత్ మోదీ కల…మనందరి కల వికసిత్ ఏపీ అనే లక్ష్యంతో ముందుకు వెళ్దాం. పేదరికం లేని దేశం, రాష్ట్రంగా మారాలి. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ కల. తనకు తెలిసిన ఒకే ఒక్క ఇజం హ్యూమనిజం అని ఎన్టీఆర్ చాటి చెప్పారు. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు అని ముందుకెళ్లిన ఎన్టీఆర్ కలలను సాకారం చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ముందుకు నడిపించండి…తప్పు చేస్తే ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి
ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా..మీరు ఓట్లు వేశారు..మమ్మల్ని గెలించారు. ఓటు వేశాక మీ బాధ్యత తీరిపోయిందనుకోకుండా నిత్యం మమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడపాలి. మొన్నటి ఎన్నికల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ జనంతో నిండి ఉండి అర్ధరాత్రి 2 గంటల వరకు క్యూలో ఉండి ఓట్లు వేశారు. నన్ను నడిపించండి…తప్పు చేస్తే ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. కలిసి ముందుకు సాగి రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. ప్రపచంలో 2047 నాటికి మన దేశం మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగుజాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలనేది నా కల. సంపాదనలో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారు. నిర్దిష్టమైన సమయంలోనే ఏపీని నెంబర్ 1 గా చేసుకుందాం. నన్ను జైల్లో పెట్టినప్పుడు బయటకు రావడానికి 53 రోజులు పట్టింది…అక్కడ ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంది. నా కోసం నిలబడ్డ కార్యకర్తలు, నాయకులను జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని చంద్రబాబు నాయుడు అన్నారు.
అమిత్ షా రాక
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో విజయవాడ చేరుకున్నారు. ఢల్లీి నుంచి గన్నవరం విమానాశ్రయంలో దిగిన అమిత్ షా నేరుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబుతో చర్చల అనంతరం రాత్రి 11.30 సమయంలో నోవాటెల్ హోటల్‌కు వెళ్లి అక్కడ బస చేశారు.