- ఇది కేవలం రాజధాని నగరమే కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్
- రూ.49 వేల కోట్ల పనులతో పునరుజ్జీవం
- మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి.. తిరిగి మోదీ చేతుల మీదుగానే ప్రారంభిస్తాం
- నా రాజధాని ఇదీ.. అని అనుకునేలా నిర్మాణం
- రాజధాని రైతుల ఉద్యమం అపూర్వం
- మోదీ మొహంలో బాధ కనిపించింది
- ఆహ్లాదంగా ఉండే ఆయన గంభీరంగా కనిపించారు
- పహల్గాం ఉగ్రదాడిని సభలో ప్రస్తావించిన చంద్రబాబు
‘‘అమరావతి కేవలం ఒక రాజధాని నగరమే కాదు. అది ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపం.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. వెలగపూడిలో శుక్రవారం జరిగిన అమరావతి పనుల పునఃప్రారంభ సభలో చంద్రబాబు మాట్లాడారు. అమరావతి పనులు పునఃప్రారంభించుకుంటున్న ఈ రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజుగా గుర్తుండిపోతుందని సీఎం వ్యాఖ్యానించారు.
‘2014లో రాజధాని లేని పరిస్థితుల్లో పాలన ప్రారంభించుకున్నాం. 29వేల పైచిలుకు మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇచ్చారు. వారి త్యాగాలు ప్రపంచానికి ఆదర్శం. కానీ వారి త్యాగాలను గత వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేసింది. అవహేళన చేసింది. రాజధాని రైతులు ఎన్నో బాధలు పడ్డారు.. అవమానాలు ఎదుర్కొన్నారు.. లాఠీ దెబ్బలు తిన్నారు.. జైలుకుపోయారు. కానీ వెనకడుగు వేయలేదు. ఇలాంటి ఉద్యమాన్ని నా జీవితంలో చూడలేదు.. ఇకపై చూస్తానని కూడా అనుకోవడం లేదు.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులు చేసిన న్యాయపోరాటం ఫలితంగా న్యాయస్థానాలు అమరావతిని బతికించాయన్నారు. చంద్రబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే..
అమరావతి పునఃప్రారంభ సభలో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ‘‘గతంలో ఎప్పుడు మోదీని కలిసినా ఆహ్లాదంగా ఉండేవారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మోదీని కలిసినప్పుడు ఆయన మొహంలో బాధ చూశాను. అమరావతి పనుల పునఃప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి వెళ్లినప్పుడు ఆయన చాలా గంభీరంగా కనిపించారు. ఉగ్రదాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న ఆవేదన మోదీలో కనిపించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజల తరఫున చెబుతున్నాను. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రధాని మోదీ తీసుకునే ప్రతి చర్యకూ మద్దతుగా ఉంటాం. విశాఖలో వచ్చే నెల 21వ తేదీన పదో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రధాని తాను వస్తానని అన్నారు. ఆయన రాక మనకు స్ఫూర్తినిస్తుంది.’’ అంటూ చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు.
అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం
‘‘అమరావతినే కాదు రాష్ట్రంలోని 26 జిల్లాలనూ అభివృద్ధి చేస్తాం. 2027 నాటికి కేంద్రం సహకారంతో పోలవరాన్ని పూర్తిచేస్తాం. నదుల అనుసంధానం చేస్తాం. విశాఖను నాలెడ్జ్, ఫైనాన్షియల్ కేపిటల్‌గా చేస్తాం. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖకు వచ్చాయి. భోగాపురం విమానాశ్రయం పూర్తిచేయడంతోపాటు విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని బలోపేతం చేస్తాం. ఇప్పటికే కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థికసాయం చేసింది. విశాఖకు రైల్వే జోన్ కేటాయించింది. వెనకబడిన రాయలసీమను హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. ఢిఫెన్స్ ఇండస్ట్రీలు రానున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తాం. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది. తిరుపతిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.
హెల్త్, ఎడ్యుకేషన్ హబ్‌గా అమరావతి
‘‘విధ్వంస పాలన ముగిసి 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ప్రజలు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంది. ప్రజల ఆశీస్సులతో నాలుగోసారి సీఎం అయ్యాను. కానీ ఆర్థికపరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఎలా బయటకు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు కేంద్రం, వ్యక్తిగతంగా మోదీ ముందుకొచ్చి ఆపన్నహస్తం అందించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. కేంద్రం సహకారంతో 10 నెలల్లో అమరావతిని గాడినపెట్టాం. ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. ఈ రోజు వర్షం వస్తుందని అనుకున్నాం. మోదీ రావడంతో వర్షం కూడా వెనక్కి తగ్గింది. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో వాతావరణం అనుకూలించక ఏ ఒక్క కార్యక్రమం కూడా రద్దు అయిన దాఖలా లేదని మోదీ చెప్పారు. మంచి సంకల్పం ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ప్రపంచస్థాయి సంస్థల ఏర్పాటుతో అమరావతి హెల్త్, ఎడ్యుకేషన్ హబ్‌గా ఉండబోతోంది.’’
జపాన్ మియావాకీ ఆదర్శం..
‘‘రాజధానిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రతి పౌరుడూ ‘నా రాజధాని అమరావతి’ అని గర్వంగా చెప్పుకొనేలా నిర్మిస్తాం. రాజధానిలో 30 శాతం పచ్చదనం ఉండేలా ప్రణాళికలు రూపొందించాం. నవ నగరాలు.. భూగర్భంలోనే విద్యుత్ ఇతరత్రా పైపులు వెళ్లేలా డిజైన్ చేశాం. ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు.. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని ప్రధాన నగరాలను అమరావతికి అనుసంధానం చేస్తాం. 5లక్షల మంది విద్యార్థులు అమరావతిలో చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధాని మోదీ ఇదే కోరారు. రాజధానిలో మంచి విద్యాసంస్థలను ఏర్పాటు చేసి భావి తరాలను తీర్చిదిద్దండని సూచన చేశారు. దాన్ని ఆచరణలో పెడుతున్నాం. ఇప్పటికే చాలా విద్యాసంస్థలు వచ్చాయి. త్వరలో బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ బిజినెస్ స్కూల్, గ్లోబల్ లీడర్‌షిప్ సెంటర్, రతన్‌టాటా ఇన్నొవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. జపాన్ మియావాకీని ఆదర్శంగా తీసుకుని రాజధానిని పచ్చదనంతో ఆహ్లాదంగా తీర్చిదిద్దుతాం. ఈ రోజు రూ.49వేల కోట్ల విలువైన 74 పనులను ప్రారంభించుకోవడంతోపాటు మరో రూ. 8వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నాం. ఇది రాజధానికి పునరుజ్జీవం. ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని చేతుల మీదుగానే మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ పనులు ప్రారంభోత్సవాలు చేయిద్దాం.’’
టెక్నాలజీ అంటేనే మోదీ
దేశానికి సరైన సమయంలో లభించిన సరైన నాయకుడు మోదీ. మోదీ అధికారంలోకి వచ్చిన 2014లో ప్రపంచ ఆర్థికవ్యవస్థలో మన దేశానిది 10వ స్థానం. 11 ఏళ్లలో మోదీ 5వ స్థానంలోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది జపాన్‌ను అధిగమించి 4వ స్థానానికి వస్తామని, 2027 నాటికి జర్మనీని అధిగమించి 3వ స్థానానికి వస్తామని ఐఎంఎఫ్ గణాంకాలు చెబుతున్నాయి. ఇటీవల కేంద్ర కేబినెట్‌లో మోదీ కులగణన అనే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇది దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఎంతో దోహదపడుతుంది. టెక్నాలజీ అంటే మోదీ. ఆయన జన్‌ధన్ ఖాతాలు, యూపీఐ ద్వారా నగదు రహిత లావాదేవీలు వంటి ఎన్నో వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. ఇటీవలే జాతీయ క్వాంటమ్ మిషన్‌ను ప్రారంభించారు. ఆయన స్ఫూర్తితో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం. అందులో భాగంగా ఈ రోజే టీసీఎస్, ఐబీఎం వంటి సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నాం. ఏఐను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నాం.