- మూడేళ్లలో పూర్తిచేస్తాం
- మీడియాతో మంత్రి నారాయణ
రాజమహేంద్రవరం (చైతన్యరథం): రాజధాని అమరావతి నిర్మాణపనులకు కాంట్రాక్ట్ సంస్థలను ఎంపిక చేస్తున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. తొలుత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 12 నుంచి 15వ తేదీ లోపు అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో టెండర్లను తెరిచి కాంట్రాక్ట్ సంస్థలను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎల్‌ఓఏ)లు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2014 – 19 మధ్య ఖరారు చేసిన డిజైన్‌ల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకెళ్ళేందుకు ఏడున్నర నెలలు సమయం పట్టిందన్నారు. అందుకే రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం అయ్యాయని తెలిపారు. రైతులకు ఇచ్చే భూమి కాకుండా అమరావతిలో 4 వేల ఎకరాల భూమి ప్రభుత్వానికి మిగులుతుంది. రాజధానిలో మౌలిక వసతుల కల్పన పూర్తయితే భూముల ధరలు పెరుగుతాయి. భూములు అమ్మి మాత్రమే రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రజల పన్నుల ఆదాయం నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఖర్చు పెట్టేది లేదు. బడ్జెట్ లో కేటాయించిన రూ.6 వేల కోట్లు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన ఆదాయం కాదు. రాజధాని పనులు ప్రారంభం అవుతుంటే కొంతమంది నాయకులకు ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రూ.10 లక్షల కోట్లు అప్పు పెట్టి వెళ్తే రాజధాని ఎలా కడతారని గత పాలకులు అనుకున్నారు. వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఖచ్చితంగా మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
అసెంబ్లీ ముగిశాక పుష్కరాలపై సమావేశం
మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయం వాటికే చెందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారన్నారు. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. టీడీఆర్ బాండ్ల రూపంలో వెయ్య కోట్ల మేర అవకతవకలు జరిగాయన్నారు.
గోదావరి పుష్కరాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్థానిక మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, సమగ్ర నివేదిక రూపొందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని మంత్రి నారాయణ తెలిపారు. టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో, రుడా పరిధిలో భవనాలు, లే అవుట్‌ల అనుమతులు త్వరితగతిన జారీ చేస్తామని తెలిపారు. 5 అంతస్తుల, 15 మీటర్ల ఎత్తులో నిర్మించే భవనాల ప్లాన్‌కు స్వీయ ధృవీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీల ఆర్థిక పరిపుష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అడుగులు వేయడం, ఆ దిశలోనే క్షేత్రస్థాయిలో సమీక్షించడం శుభ పరిణామం అన్నారు. గతంలో ఏ మంత్రి ఈ విధంగా సమీక్ష చేసిన దాఖలాలు లేవన్నారు. 2027లో వచ్చే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, ఇతర అధికారులు హాజరయ్యారు.
వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు
కొత్తగా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి రాజమహేంద్రవరం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌లతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల నుండి చెత్తను ఆ ప్లాంట్‌కు తరలించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. శనివారం అనపర్తి నియోజక వర్గంలో పర్యటించిన మంత్రి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా మున్సిపాలిటీల నుంచి వచ్చే చెత్త నుంచి ఆదాయం సమకూర్చే క్రమంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులొ భాగంగా ప్లాంట్ ఏర్పాటు కోసం అనువైన ప్రాంతాన్ని గుర్తించేందుకు అనపర్తి నియోజకవర్గంలోని బలభద్రపురం, కాపవరం గ్రామాల్లో స్థలాలను పరిశీలించినట్లు తెలియచేశారు. ప్లాంట్ ఏర్పాటు చేసే క్రమంలో చుట్టుపక్కల మున్సిపాలిటీలకు అనుకూలంగా ఉండేలా స్థలాన్ని అన్వేషిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు స్వచ్ఛ ఆంధ్ర సాధన దిశగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసే ప్లాంట్‌లో 20 మున్సిపాలిటీల నుంచి ససేకరించిన వ్యర్థాల నుంచి సంపద సృష్టి, విద్యుత్ ఉత్పత్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.