- మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి రెండోవిడత భూ సమీకరణపై నిర్ణయం
- ప్రస్తుతం జరుగుతున్న ప్రభుత్వ భవనాల పనులు వచ్చే మార్చికి పూర్తి
- రైతులతో పాటు కాంట్రాక్టర్లను కూడా ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వం
- అమరావతి నిర్మాణ పనుల పరిశీలన తర్వాత మీడియాతో మంత్రి నారాయణ
అమరావతి (చైతన్యరథం): రాజధాని అమరావతిలో రెండో దశ భూ సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుని, వచ్చే మంత్రివర్గ సమావేశం ముందు పెడతామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం అమరావతి రైతులతో పాటు కాంట్రాక్టర్లను కూడా అనేక ఇబ్బందులకు గురిచేసిందన్నారు. అమరావతి నిర్మాణం మూడేళ్లలో కచ్చితంగా పూర్తిచేసి తీరతామని మంత్రి మరోసారి స్పష్టం చేసారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తామన్నారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను సీఆర్డీఏ ఇంజినీర్లతో కలిసి మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల బంగ్లాలతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయా నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సంస్థల ప్రతినిధులను వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. మొత్తం కార్మికులు ఎంతమంది పనిచేస్తున్నారు…నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న సామాగ్రి, మెషినరీ గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నేలపాడులోని ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్ల వద్ద మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు.
అమరావతిలో భవనాలు, ట్రంక్ రోడ్లు, సీవరేజి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఎల్పీఎస్ లే అవుట్‌ల్లో పనులకు కూడా టెండర్లు పూర్తయ్యాయి. 2014-19 మధ్యలోనే అధికారుల కోసం 4000 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించాం. అయితే గత ప్రభుత్వం అన్ని పనులను నిలిపివేసింది. తిరిగి పాత టెండర్లు రద్దు చేసి, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఆలస్యమైంది. ప్రస్తుతం రాజధానిలో అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కొన్నిచోట్ల మాత్రం వర్షాల కారణంగా కొంచెం ఇబ్బందులున్నాయన్నారు.
వీటిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు 12 టవర్లలో 288 ఫ్లాట్లు, ఆలిండియా సర్వీస్ అధికారులకు 6 టవర్లలో మొత్తం 144 ఫ్లాట్లు నిర్మిస్తున్నామన్నారు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం 25 బంగళాలు, సెక్రటరీల కోసం 90 బంగళాలు, మంత్రుల కోసం 35 బంగళాలు, జడ్జిల కోసం 36 బంగళాలు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసం మొత్తం 21 టవర్లలో 1968 ఫ్లాట్లు నిర్మిస్తున్నాం. ఇక గెజిటెడ్ ఆఫీసర్స్‌లో టైప్ -1 అధికారులకు 4 టవర్లలో 384 ఫ్లాట్లు, టైప్ – 2 అధికారులకు 4 టవర్లలో 336 ఫ్లాట్లు, గ్రూప్- డి ఉద్యోగులకు మొత్తం 6 టవర్లలో 720 ఫ్లాట్లు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక అమరావతిలోని హ్యాపీనెస్ట్‌లో మొత్తం 6 టవర్లలో 1200 ఫ్లాట్లు నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ మొత్తం భవనాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అధికారుల క్వార్టర్లు ఈ ఏడాది డిసెంబర్ లోగా పూర్తిచేస్తామని, ఇతర నిర్మాణాలను వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. మరోవైపు ఐకానిక్ భవనాల నిర్మాణాలపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు, డిజన్లు రూపొందించిన నార్మన్ ఫోస్టర్స్ సంస్థ ప్రతినిధుల మధ్య తుది చర్చలు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఐకానిక్ భవనాల నిర్మాణం కూడా ప్రారంభిస్తామన్నారు.
డిసెంబర్ నాటికి..
అమరావతిలో ఇప్పటివరకూ మొత్తం 72 సంస్థలకు భూకేటాయింపులు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఆయా సంస్థల ప్రతినిధులతో స్వయంగా సీఎం చంద్రబాబు సమావేశం ఏర్పాటుచేసి అగ్రిమెంట్‌లు చేసుకున్నట్లు తెలిపారు. ఆయా సంస్థల్లో ఎక్కువ భాగం ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభిస్తాయన్నారు. ఆయా సంస్థలు నిర్దేశిత కాలానుగుణంగా నిర్మాణాలు పూర్తిచేస్తాయన్నారు..
కేబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తాం
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్‌పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారా అని గత మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారని, అందుకే కేబినెట్ సబ్ కమిటీలో చర్చిస్తామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాన్ని వచ్చే కేబినెట్ సమావేశంలో పెట్టి భూసమీకరణపై నిర్ఱయం తీసుకుంటామన్నారు.