- అవసరమైన చోట్ల 7రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లు
- సీఈలు, ఎస్‌ఈలు నిరంతరం పర్యవేక్షించాలి
- అన్ని అత్యవసర పనులూ నాణ్యతతో చేయాలి
- ఇరిగేషన్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి నిమ్మల ఆదేశం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర వ్యాప్తంగా కాలువల్లో పూడిక తీత, గుర్రపుడెక్క, తూటికాడ తొలగింపు, షట్టర్లు, గేట్ల మరమ్మత్తులు, గ్రీజు పెట్టడం వంటి నిర్వహణ పనుల కోసం ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ 344 కోట్ల రూపాయలు విడుదల చేశారని,ఈ పనులను స్వీయ పర్యవేక్షణ చేస్తూ, మే చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. సోమవారం విజయవాడలోని జలవనరుల క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్‌ఈలతో మంత్రి నిమ్మల టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గుర్రపుడెక్క, తూటికాడ వంటి వాటి తొలగింపుకోసం, మందుల పిచికారీకి డ్రోన్లు సైతం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట్ల 7 రోజుల వ్యవధితో షార్ట్ టెండర్లు పిలవడానికి ప్రభుత్వం అనుమతిచ్చిందన్నారు. నిర్వహణ, మరమ్మత్తు పనులను చేపట్టి ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభానికి ముందుగానే నీటిపారుదల వ్యవస్దలను సాధారణ స్థితికి తీసుకురావడం ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు.
గేట్లు, షట్టర్లు, వంటి మెకానికల్ పనులను తప్పనిసరిగా అసిస్టెంట్ ఇంజనీర్ పరిశీలించి, సక్రమంగా పనిచేసే స్థితిలో ఉన్నాయనే ధ్రువీకరణ పత్రాన్ని చీఫ్ ఇంజనీర్‌కు ఇవ్వాలని ఆదేశించారు. సాగు నీటి సంఘాల ఆధ్వర్యంలో, వారి పరిధిలోని పనులను, మే నెలాఖరుకు పూర్తిచేయాలి. ఇలా పనులను సకాలంలో పూర్తిచేయడానికి చీఫ్ ఇంజనీర్లు, సూపరిండెంట్ ఇంజనీర్లు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలన్నారు. ఎట్టి పరిస్దితుల్లోనూ అన్ని పనులూ, సీజన్ మొదలయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారులకు మంత్రి నిమ్మల తేల్చి చెప్పారు. గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి, అన్ని అత్యవసర పనులు, నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, కడా కమిషనర్ రాంసుందర్ రెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.