- న్యాయపరమైన చిక్కులు లేకుండా డీఎస్సీ నోటిఫికేషన్
- గత ప్రభుత్వంలో టీచర్లపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేస్తాం
- ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదు
- శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
అమరావతి (చైతన్యరథం): వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తిచేసి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శాసనసభలో శుక్రవారం డీఎస్సీ నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారన్నారు. న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా టీచర్ పోస్టులు భర్తీచేయాలన్నదే తమ లక్ష్యం అని తెలిపారు. 1994నుంచి కేసుల వివరాలు తెప్పించాం, పకడ్బందీగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డీఎస్సీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపునకు సంబంధించిన ఫైలు సీఎం వద్ద ఉంది, అక్కడ నుంచి ఫైలు వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తాం. 1994కి ముందు జిల్లాపరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది.
ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే 15 డీఎస్సీలు నిర్వహించాం, 2.20 లక్షల పోస్టులు నోటిఫై చేసి, 1.80 లక్షల పోస్టులు భర్తీచేసింది టీడీపీ ప్రభుత్వాలే. ఇదొక చరిత్ర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ ద్వారా భర్తీచేసిన టీచర్ పోస్టులు సున్నా. నిరుద్యోగులను మభ్యపెట్టడానికి ఎన్నికలకు రెండునెలల ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన హడావుడిగా 6,100 పోస్టులతో వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. నిరుద్యోగులను మభ్యపెట్టడానికే ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా నోటిఫికేషన్ ఇచ్చారు. జీఓ 117 తెచ్చి స్కూళ్ల విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు, టీచర్లను ఇబ్బందులకు గురిచేసింది. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను గత ప్రభుత్వం పనిగట్టుకొని వేధించింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ విధానాన్ని తెచ్చే క్రమంలో టీచర్లను భాగస్వాములను చేస్తాం.
గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాల్సి ఉంది. జీఓ 117పై ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ మాట్లాడుతున్నారు, వాస్తవాలను తెలుసుకుంటున్నాం. జీఓ 117కి ప్రత్యామ్నాయం తెస్తాం. ఉపాధ్యాయులపై వేధింపులు ఉండకూడదు. గతంలో తమ సమస్యలపై ఉపాధ్యాయులు ధర్నాలు చేసినపుడు దొంగకేసులు పెట్టారు. డీజీపీతో మాట్లాడి ఆ కేసులన్నీ ఎత్తేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ తెస్తాం. రాబోయే ఐదేళ్లలో దేశానికే తలమానికంగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ విధానం తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.