- రాష్ట్రానికి రుణాలు రాకుండా అడ్డుకునే యత్నం
- తప్పుడు మెయిల్స్ పంపినవారిపై చర్యలు
- సీఎం చంద్రబాబు పాలనలో అభివృద్ధి పథంలో రాష్ట్రం
అనంతపురం (చైతన్యరథం): వైసీపీ నేతలు రౌడీయిజంతో బెదిరించాలని చూస్తే సహించేది లేదని రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కణేకల్‌లో శుక్రవారం సుపారిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పయ్యావుల మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రోడ్డు మీదకు వస్తే ఆయన కారు కింద తలకాయలు కానీ.. మామిడికాయలు కానీ పగలాల్సిందే అంటూ దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ట్రాక్టర్లు లాక్కొచ్చి బలవంతంగా మామిడికాయలు కింద పారబోశారని… చివరికి డ్రోన్ కెమెరాలో దొరికి పోయారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేస్తున్న పోలీసు వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం వైసీపీ నేతల ఆహంకారానికి నిదర్శనమన్నారు.
రుణాలను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుటిల యత్నాలు చేస్తున్నారని మంత్రి పయ్యావుల విమర్శించారు. తప్పుడు మెయిల్స్ పంపించి పెట్టుబడిదారులను అడ్డుకునే యత్నం చేస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి మేలు జరుగుతుంటే అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు మెయిల్స్ పెట్టి లేఖలు రాసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే.. భారీగా పెట్టుబడులు రప్పిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో దారుణంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నారన్నారు.
బుగ్గన బుర్రకథలు ఆపాలి
మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెటకారం తగ్గించుకుంటే మంచిదని హితవు పలికారు. పార్టీలో అస్తిత్వం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇప్పటికైనా బుర్రకథలు ఆపాలన్నారు. దోమల మీద యుద్ధం, గాల్లో యుద్ధం మీరు చేశారని… అందుకే ప్రజలు కాల్చివాత పెట్టారని ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిట్ దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఐఐటీ ప్రొఫెషనల్స్, ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని పెట్టెలకు పెట్టెలు డబ్బులు తరలించారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో వెల్లడవుతున్న వాస్తవాలు దేశం మొత్తం నివ్వెరపోయే ఉన్నాయన్నారు.
కాగా.. సుపారిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి పయ్యావులతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గడిచిన సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు మంత్రి, ఎమ్మెల్యే తెలియజేశారు.