అమరావతి (చైతన్య రథం): ఏపీలో గత ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. విజయవాడలో బుడమేరు వాగుకు వచ్చిన వరదలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. బుడమేరు డైవర్షన్ కెనాల్ పూర్తిచేయడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మంత్రి నిమ్మల ఆరోపించారు. గత ఐదేళ్లలో బుడమేరు డైవర్షన్ కెనాల్ పనుల పూర్తికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. ఒకేసారి 15 వేల క్యూసెక్కుల నీరు రావడంతో గండ్లుపడి వరదలు సంభవించాయని వివరించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే బుడమేరుకు వరదలొచ్చాయని, భవిష్యత్తులో వరదలు రాకుండా ‘ఆపరేషన్ బుడమేరు’ చేపట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నిమ్మల వివరించారు.
ఇక గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో పురపాలక శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలనుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఘాట్ల నిర్మాణాన్ని జలవనరుల శాఖ తీసుకుంటుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ప్రతిరోజూ గోదావరి హారతి నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి వెల్లడిరచారు. అయితే గత ఐదేళ్లలో గోదావరి హారతిని నిలిపివేశారన్న మంత్రి.. ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై కూడా వైకాపా ప్రభుత్వం దాడి చేసిందని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.