- మహిళా సంఘాలకు సుస్థిరాదాయమే లక్ష్యం
- సెర్ప్, మెప్మా విభాగాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు బ్రాండిరగ్ చేయాలని సెర్ప్ విభాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు తయారు చేస్తున్న 23 వేల పైచిలుకు వివిధ రకాల ఉత్పత్తులకు దేశీయంగా, అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసేందుకు వీలుగా ఈ బ్రాండ్ ఉపకరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై ముఖ్యమంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వ్యవస్థీకృతంగా ఈ ఉత్పత్తులను విక్రయించేందుకు వినూత్నంగా, విభిన్నంగా బ్రాండిరగ్ చేయాలని స్పష్టం చేశారు. అరకు కాఫీ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో బ్రాండ్ రూపొందిస్తే ఉత్పత్తులకు మరింత విలువ పెరుగుతుందని సూచించారు. ఈ వ్యవస్థీకృత విధానం వల్ల మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాలు, మైక్రో ఎంట్రప్రెన్యూర్స్‌కు ఆర్థిక సుస్థిరత వచ్చేలా ఉత్పత్తుల బ్రాండిరగ్, మార్కెటింగ్ జరగాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో పశుసంవర్థకంతో పాటు సేవల రంగంలోనూ మహిళ సంఘాలు రాణించాలని సీఎం ఆకాంక్షంచారు. ఈ సమీక్షకు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహా ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.















