- రాష్ట్ర పునర్నిర్మాణానికి పునరంకితం
- దెబ్బతిన్న నిర్మాణరంగాన్ని నిలబెడతాం
- అందుకోసమే ఉచిత ఇసుక పాలసీ
- రియల్ ఎస్టేట్ బాగున్నచోటే సంపద సృష్టి
- నిర్మాణరంగాన్ని గత ప్రభుత్వం కూల్చేసింది
- టీడీఆర్ బాండ్ల దోషుల్ని వదిలేది లేదు..
- నరెడ్కో ప్రాపర్టీ షోలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
గుంటూరు (చైతన్య రథం): ‘బిల్డ్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నాం. ఐదేళ్ల విధ్వంస పాలనలో పడకేసిన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నాం. అందుకే నరెడ్కో ప్రాపర్టీ షో ప్రారంభ కార్యక్రమానికి వచ్చా. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి మళ్లీ ఊపు రావాలని కోరుకుంటున్నాను. నిర్మాణం రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చేవారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కారిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నిర్వహించిన నరెడ్కో ప్రాపర్టీ షోను సీఎం ప్రారంభించారు. అనంతరం బిల్డర్లను ఉద్దేశించి మాట్లాడారు.
ఎటు చూసినా విధ్వంసం… అంధకారమే కనబడిరది
‘7 నెలల క్రితం వరకూ నిర్వీర్యమైన రాష్ట్రాన్ని చూశాం. అన్ని వ్యవస్థలు పతనమయ్యాయి. నిర్మాణరంగమైతే గత ఐదేళ్లు అడ్రస్ లేకుండాపోయింది. అందుకే ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తే అన్ని రంగాల్లో రాష్ట్రాభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చాం. ప్రజలు మమ్మల్ని నమ్మి 93శాతం స్ట్రైక్ రేట్, 53శాతం ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించాం. గత ఐదేళ్లు ఎటు చూసినా అంధకారం… విధ్వసమే కనబడిరది. ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. మొన్ననే రాష్ట్ర చరిత్రలో లేనివిధంగా ప్రధాని మోదీ రూ.2.08 లక్షల కోట్ల అభివృద్ధి పనులు, పెట్టుబడులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు చేశారు. బ్రాండ్ ఏపీ ఇమేజ్‌తో ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
వ్యవసాయం, పర్యాటకం ఊపందుకోవాలి
‘రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి. వ్యవసాయం లాభసాటి కావాలి. పర్యాటకం ఊపందుకోవాలి. సంపద పెరగాలి.. అప్పుడే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో 40 లక్షల కుటుంబాలు నిర్మాణరంగంపై ఆధారపడ్డాయి. గత ఐదేళ్లు ఇసుక లభించక భవన నిర్మాణ రంగం కార్మికులకు సరైన ఉపాధి ఉండేది కాదు. మా ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానానికి శ్రీకారం చుట్టాం. ఇసుక కొరత లేకుండా చేశాం. ఎవరైనా ఇసుక లభ్యం కాకపోతే.. గట్టిగా అడిగే హక్కు ఈ ప్రభుత్వం ఇచ్చింది. నరెడ్కో సంస్థ అంచలంచెలుగా ఎదిగింది. రియల్ ఎస్టేట్ రంగం వాటా జీడీపీలో 7.3 శాతం ఉంది. 2047కు 20 శాతం పెరిగి, 5.8 ట్రిలియన్ డ్రాలర్లు ఆర్జిస్తుంది. అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. నాగరిక సమాజంలో నిర్మాణమనేది నిత్యం జరుగుతూనే ఉంటుంది. అమరావతి అభివృద్ధి జరిగివుంటే ఈ ప్రాంతం మరింత నిలదొక్కుకుని ఉండేది. కానీ ఐదేళ్లు నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని నిలదొక్కకోకుండా చేశారు.
కూల్చివేతలతో భయబ్రాంతులకు గురి చేయడంతో నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతింది. నిర్మాణ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిచ్చాం. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా భూసమస్యలు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రికార్డులు తారుమారు చేసి భూకబ్జాలకు పాల్పడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఇష్టానుసారంగా చేయాలని చూశారు. అందుకే అధికారంలోకి వచ్చాక రద్దు చేసి, యాంటీ ల్యాడ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం’ అని చంద్రబాబు రాష్ట్ర పరిస్థితిని బిల్డర్లకు వివరించారు.
టీడీఆర్ బాండ్ల దోషుల్ని వదిలిపెట్టం
‘టీడీఆర్ బాండ్లలో డబ్బులు తీసుకుంది ఒకరు… నష్టపోయింది ఇంకొకరు. దీన్నికూడా గత పాలకులు అక్రమాలకు వాడుకున్నారు. అవినీతికి పాల్పడ్డవారిని వదలిపెట్టం. అమాయకుల్ని కాపాడతాం. 7 నెలల్లో రాష్ట్రంలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి పనులు ప్రారంభిస్తున్నాం. తద్వారా 4 లక్షలమంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతి పనులను రూ.50 వేల కోట్లతో ప్రారంభిస్తాం. ఇది స్వయం ఆధారిత ప్రాజెక్టు. రియల్ ఎస్టేట్ ఎక్కడ బాగుంటుందో అక్కడ సంపద సృష్టి జరుగుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కన్నా పెద్దగా అమరావతి చుట్టూ 183 కి.మీమేర రింగ్ రోడ్డుకు ప్లాన్ సిద్ధం చేశాం. అది పూర్తయితే గుంటూరు- అమరావతి పట్టణాలు కలిసిపోతాయి. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాం. రాష్ట్రంలో పెద్దఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చుతాం’ అని చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు.
అవకాశాలు అందుకోవడంలో ‘గుంటూరు’ ముందు..
‘ఐటీని అందిపుచ్చుకుని విదేశాలకు వెళ్లిన వారిలో గుంటూరువాసులు ఎక్కువ. అందరికంటే ముందుండి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇతర దేశాల్లో మాదిరి రాష్ట్రంలోనూ స్వచ్ఛమైన వాతావరణాన్ని సృష్టిస్తాం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను గతంలో గుంటూరులో ఏర్పాటు చేశాం. అది బ్రహ్మాండంగా పని చేస్తోంది. ఇక ప్రతి నెలా 3వ శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అభివృద్ధి, సుపరిపాలన ప్రభుత్వం చేస్తుంది. వాటిని మీరు ముందుకు తీసుకెళ్లాలి. నిర్మాణరంగంలో మన రాష్ట్రాన్ని మించిన పాలసీ ఉండదు. వీలైనన్ని నిబంధనలు సరళతరం చేశాం. రాబోయే రెండు నెల్లలో డ్యాష్ బోర్డు తెస్తాం. మీరు తెచ్చిన వినతులను త్వరలోనే పరిష్కరిస్తాం. నిర్ణీత సమయానికే అనుమతులిస్తాం. ఆలస్యమైతే అధికారులపై చర్యలు తీసుకుంటాం. మీరు కూడా ఎక్కడా చట్టవ్యతిరేక పనులకు పాల్పడకుండా ఉండాలి. ఇప్పటిదాకా నిదానించిన నిర్మాణరంగాన్ని నిలబెడుతున్నాం.. ఇంకా మీరే నడవాలి… పరుగెత్తాలి. గతాన్ని మర్చిపోండి. నిర్మాణరంగంలోనూ నూతన ఆవిష్కరణలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకుంటే రూ.500 సంపాదించేవాళ్లు రూ.1,500 సంపాదించవచ్చు’ అని చంద్రబాబు సూచించారు.
దేశంలో అమరావతిలాంటి కొత్తనగరం రాదు
‘దేశంలో అమరావతిలాంటి నగరం మరొకటి రాదు. కొత్త నగరాన్ని బెస్ట్ మోడల్ సిటీగా నిర్మిస్తాం. ఒక్క అమరావతినే కాదు విశాఖ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతిలాంటి పట్టణాలను అభివృద్ధి చేస్తాం. భవిష్యత్తులో పట్టణాభివృద్ధి జరిగి మన నగరాలు కూడా అగ్రస్థానంలో ఉండాలి. అనధికారిక నిర్మాణాలు చేపట్టవద్దు. ఇసుకను ఉచితంగా ఇస్తాం. ఎక్కడా ఇసుక అక్రమ రవాణాను అనుమతించం. దీనిపై ఇప్పటికే కలెక్టర్ల, ఎస్పీలకు ఆదేశాలిచ్చాం. అధికారులు తప్పు చేసినా క్షమించను’ అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.