తిరుమల (చైతన్య రథం): తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో తితిదే పాలకమండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు తితిదే అధికారిక ప్రకటన విడుదల చేసింది.
తితిదే బోర్డు సభ్యులు: జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే), ఎంఎస్ రాజు (మడకశిర ఎమ్మెల్యే), పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి), నర్శిరెడ్డి, సాంబశివరావు (జాస్తి శివ), శ్రీసదాశివరావు నన్నపనేని, కృష్ణమూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్ గౌడ్, జంగా కృష్ణమూర్తి, దర్శన్. ఆర్.ఎన్, జస్టిస్ హెచ్‌ఎల్ దత్, శాంతారామ్, పి.రామ్మూర్తి, జానకీ దేవి తమ్మిశెట్టి, బూంగునూరు మహేందర్ రెడ్డి, అనుగోలు రంగశ్రీ, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, నరేశ్ కుమార్, డా అదిత్ దేశాయ్, శ్రీసౌరబ్ హెచ్ బోరా. ఇదిలావుంటే, టీటీడీ బోర్డులో ముగ్గురు ఎమ్మెల్యేలకు, తెలంగాణకు చెందిన ఐదుగురికి, కర్ణాటకకు చెందిన ముగ్గురికి, తమిళనాడుకు చెందిన ఇద్దరికి, గుజరాత్, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి చోటు లభించింది.
ఇదిలావుంటే, మీడియా రంగంలో తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన బిఆర్ నాయుడు స్వయంకృషి, పట్టుదల, ఆధ్యాత్మిక నిబద్దతకూ ప్రతీక. వ్యాపారవేత్తగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ స్పృహకలిగిన వ్యక్తిగా బీఆర్ నాయుడు సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. టీటీడీ బోర్డు చైర్మన్‌గా అవకాశాన్నిచ్చి అభినందనలు తెలిపారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం దిగువ పూనేపల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన బిఆర్ నాయుడు పట్టుదల స్వయంకృషితో ఎదిగారు. సాంకేతిక విద్యను అభ్యసించి హైదరాబాద్ బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగం నిర్వహించారు. బిహెచ్‌ఇఎల్ సంస్థలో లిటరరీ సెక్రటరీగా, సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. ఉద్యోగుల తరఫున సాహిత్య సాంస్కృతిక అంశాలపై ప్రత్యేక పక్ష పత్రికనూ నడిపారు. బిహెచ్‌ఇఎల్‌లో పనిచేస్తున్న సమయంలోనే ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో.. పార్టీ కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. స్వతహాగా వెంకటేశ్వరస్వామి భక్తుడైన బీఆర్ నాయుడు ముందునుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే విధంగా హిందు ధర్మ ప్రచార నిమిత్తం ‘‘హిందూ ధర్మం’’ పేరుతో 2018లో ఆధ్యాత్మిక ఛానల్ స్థాపించారు.
తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాల నుంచి జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివిధ క్షేత్రాల మహత్యాలు ప్రత్యేకంగా ప్రసారం చేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను హిందూధర్మం ద్వారా యావత్ తెలుగు ప్రజలకు చేరువచేసే ప్రయత్నం బీఆర్ నాయుడు చేస్తున్నారు. దేవస్థాన ధార్మిక కార్యకలాపాలు, ఆగమ శాస్త్రాల ప్రాధాన్యత, హిందూ ధర్మ పరిరక్షణ, భక్తుల మనోభావాలు స్థానికుల అవసరాలు అన్నీ తెలిసిన వ్యక్తిగా టిటిడి బోర్డు ఛైర్మన్‌గా పూర్తి చిత్తశుద్ధితో బాధ్యత నిర్వహిస్తానని బిఆర్ నాయుడు అన్నారు. తన పదవీకాలంలో పూర్తి పారదర్శకత, ధార్మిక చిత్తశుద్ధితో వెంకటేశ్వర స్వామి సేవ చేసేందుకు కంకణబద్దుడై ఉన్నట్టు బిఆర్ నాయుడు ప్రకటించారు.