- జగన్ చేసిన అప్పులు, పెట్టిన బకాయిలు తీర్చడానికే నేడు అప్పులు
- లూటీ కోసం నాడు జగన్ అప్పులు
- కూటమి పాలనలో అభివృద్ధి కోసం నేడు అప్పులు
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పష్టీకరణ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర అప్పులపై వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అసత్యాలు వల్లె వేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, పెట్టిన బకాయిలు తీర్చడానికే తమ ప్రభుత్వం అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసేందుకు జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తే.. అభివృద్ధి, రెట్టింపు సంక్షేమం కోసం నేడు కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తోందని పల్లా తెలిపారు.
జగన్ ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటికే రూ.లక్ష కోట్ల వరకు వడ్డీ, అసలు వాయిదాలు చెల్లించాల్సి వచ్చింది. అలాగే గత ప్రభుత్వం రూ.1.40 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి పోయింది. ఈ బకాయిల్లో కూటమి ప్రభుత్వం రూ.40 వేల కోట్లకు పైగా తీర్చింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మరో రూ.10 వేల కోట్లు మ్యాచింగ్ నిధులు చెల్లించకుండా ఎగనామం పెట్టిపోయారు. ఈ మ్యాచింగ్ నిధుల్ని చెల్లించి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం రూ.32 వేల కోట్లు బకాయిలు పెట్టి పోగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.12 వేల కోట్లు చెల్లించింది.
సంక్షేమంపై రెట్టింపు ఖర్చు
అంతేగాక సంక్షేమంపై జగన్ కంటే కూటమి ప్రభుత్వం రెట్టింపు ఖర్చు చేస్తోంది. ఇప్పటికే రూ.50 వేల కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం ఖర్చు చేసింది. తల్లికి వందనం జగన్ ఒక బిడ్డకే ఇవ్వగా కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అందరికీ ఇస్త్తోంది. అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు ఖర్చు చేశాం. అమరావతి, పోలవరం-నదుల అనుసంధానంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం. 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదల చేతికి తాళాలు అందించాం. వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల గృహ ప్రవేశాలు జరగనున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్ల నిర్వహణకు అధిక మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నాం. దీపం-2 పథకం ద్వారా మహిళలకు ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాం. దీని కోసం రూ.2,700 కోట్లు వరకు ఖర్చు చేశాం. ఇలా అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని పల్లా వివరించారు.
నాడు అప్పులు తప్ప అభివృద్ధి శూన్యం
జగన్ పాలనలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేసినా.. అభివృద్ధి శూన్యం. సెంటు పట్టా పేరుతో రూ.7 వేల కోట్ల మేర అవినీతి చేశారు. మద్యం షాపులు కుదువబెట్టి రూ.25 వేల కోట్లు అప్పు చేసి అందులో రూ.3,500 కోట్లు దోచేశారు. ఇలా జగన్ అవినీతి కోసం అప్పులు చేయగా, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం అప్పులు చేస్తోంది. జగన్ చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి, పెట్టి పోయిన బకాయిలు తీర్చడానికే అధిక శాతం అప్పులు చేయాల్సి వచ్చింది. నేడు రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేక, జగన్ చేసిన అప్పుల్ని కప్పి పెట్టుకోవడానికే నేటి అప్పులపై నిత్యం జగన్ ముఠా అసత్యాలు ప్రచారం చేస్తోంది. వైసీపీ అబద్ధాలు నమ్మేటంత అమాయకులు కాదు తెలుగు ప్రజలు. ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని పల్లా ఉద్ఘాటించారు.















