- వైసీపీ రాజకీయ వైఖరిపై చంద్రబాబు నిప్పులు
- ఏపీ నిరుద్యోనికి జగన్ విధానాలే కారణం
- రాష్ట్రంలో వైసీపీ గంజాయి మొక్కలు పీకేద్దాం
- నదుల అనుసంధానంతో కృష్ణా డెల్టాకు మహర్దశ
- సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా?
- ప్రగతిని కాంక్షిస్తూ ప్రజలు ఓటేయాలి
- పామర్రు ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు
పామర్రు (చైతన్య రథం): ప్రజలు కోరుకున్నది అభివృద్ధి. సంక్షేమం. సుపరిపాలన. కాని `జగన్ రాజకీయ వైఖరి బూతులు, దాడులేనని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎవరెక్కువ బూతులు తిడితే వాడికి మంత్రిపదవి, ఎవరెక్కువ దాడులు చేయిస్తే వారికి పదోన్నతలు కల్పించే దారుణ పరిస్థితిలో వైసీపీ ఉందని ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో అభివృద్ధి గురించి ఏనాడైనా ఆలోచించారా? అని నిలదీశారు. ప్రజాగళం పేరిట నిర్వహిస్తోన్న ఎన్నికల సభల్లో భాగంగా ఆదివారం కృష్ణాజిల్లా పామర్రులో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. పెద్దఎత్తున హాజరైన జనాన్ని ఉద్దేశించి బాబు మాట్లాడుతూ `రాజధాని అమరావతి ప్రణాళిక అమలైవుంటే పామర్రు నుంచి ఔటర్‌రింగురోడ్డు 15 కిలోమీటర్ల దూరం వెళ్లి నూజివీడు, మచిలీపట్నం రోడ్డుగుండా హనుమాన్‌జంక్షన్ వద్ద కలిసేదన్నారు. ఆ ఒక్క రోడ్డుతో భూముల ధరలుపెరిగి గ్రామాలు, ప్రజల దశ దిశ మారిపోయేవన్నారు. కాని గంజాయి బ్యాచ్ అమరావతితో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేనివాళ్లు మూడు రాజధానులు కడతానంటూ ఆంధ్ర రాష్ట్రంతో ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం అమలు చేయడం అంటే.. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి ఆ సొమ్మును ప్రజలకు అందచేయడమని, అది తెలుగుదేశం పార్టీ చేసిందని, చేస్తుందని అన్నారు.
‘హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా. పెట్టుబడులు తెచ్చా. పరిశ్రమలు ఏర్పాటు చేశా. ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించా. ఇక్కడి యువత ఇంకా ఉద్యోగాల కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. కానీ, నేను మరోసారి అధికారంలోకి వచ్చివుంటే హైదరాబాద్ కంటే ధీటైన రాజధానిని నిర్మించుకునేవాళ్లం. ఇక్కడే లక్షలాది ఉద్యోగాలు వచ్చేవి’
నీళ్లుంటేనే నాగరికత అభివృద్ధి చెందుతుంది
‘29 వేలమంది రైతులు 35 వేల ఎకరాల భూములిచ్చారు. అమరావతి పూర్తిచేస్తే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరేది. ఆ సొమ్ముతో అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేసే అవకాశముంటుంది. జగన్‌రెడ్డి రాగానే ప్రజావేదికను కూల్చేసి విధ్వంస పాలన ప్రారంభించాడు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. ఐదేళ్లలో రైతులు ఎవరైనా సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. నీళ్లున్నందువల్లే కృష్ణా, గోదావరి డెల్టాలు బాగుపడ్డాయి. నీళ్లుంటేనే నాగరికత, అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ తర్వాత ఎగువన అనేక ప్రాజెక్టులు కట్టుకొచ్చారు. ఇప్పుడు ఖరీఫ్ వేసే పరిస్థితి లేదు. అదే సమయంలో విభజనతో పోలవరం పనులు మనకు ఇచ్చారు. కానీ, పోలవరం కంటే ముందు పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లిచ్చాం. అందువల్ల సీజన్ మిస్‌కాకుండా పంటలు పండిరచుకునే అవకాశం వచ్చింది. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రెండు పంటలకు నీళ్లిచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని తేల్చేశాడు. కానీ తెలుగుదేశం అధికారంలో ఉండి ఉంటే.. ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది. నీళ్లు పారాల్సిన కాల్వల్లో రైతు కన్నీరు పారుతోంది. మళ్లీ హామీ ఇస్తున్నా. పోలవరం పూర్తయితే కృష్ణా డెల్టా సస్యశ్యామలం అవుతుంది. రేపు జరిగే ఎన్నికల్లో మన ప్రగతి కోసం ఓటు వేయాల్సిందిగా కోరుతున్నా’ అని చంద్రబాబు పిలుపినిచ్చారు.
‘జగన్ ఏలుబడిలో ఏ ఒక్క రైతైనా సంతోషంగా ఉన్నాడా? మళ్లీ రైతును రాజు చేసే బాధ్యత తీసుకుంటున్నా. ప్రతి రైతుకు అన్నదాతతో రూ.20 వేలు ఇస్తా. రైతు కూలీలు, కౌలు రైతులకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి ఆదుకునే బాధ్యత తీసుకుంటా. నా సంకల్పం నెరవేరడానికి ప్రతి ఒక్కరూ సహకరించండి’
ఉద్యోగం కావాలా.. గంజాయి కావాలా?
సమైక్య రాష్ట్రంలో నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టినట్టే, విభజిత రాష్ట్రంలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేశానని బాబు గుర్తు చేశారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్కరికైనా ఉద్యోగమొచ్చిందా? జాబ్ క్యాలెండర్, డీఎస్సీ ఇచ్చారా? జగన్‌రెడ్డి పాలనలో ఉద్యోగాలొచ్చే పరిస్థితి ఉందా? పిల్లలకు ఉద్యోగం కావాలని కోరుకుంటారా? లేక గంజాయికి అలవాటుపడాలని కోరుకుంటారా? అభివృద్ధి చేసేశానని సైకో జగన్ చెబుతున్నాడు. కానీ, పిల్లల భవిష్యత్తుకు జగన్ పాలనలో గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు.
‘జాబు రావాలంటే బాబు రావాల్సిందే. నేను అధికారంలోకి రాగానే ప్రతి యువకుడికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తా. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది. అదే సమయంలో ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించుకునే మార్గాలు చూపిస్తా’.
ప్రజల కోసం పని చేసే నాయకుడిని ఎన్నుకోండి
ఈ నియోజకవర్గంలో సైకిల్ గుర్తుపై ఒక ఓటు, గ్లాసు గుర్తుపై మరో బటన్ నొక్కండి. వర్లకుమార్‌రాజా, వల్లభనేని బాలశౌరిలను గెలిపించండి. సమాజంపట్ల బాధ్యతగల నాయకుడు, వైసీపీలో అరాచకాలు చూసి ఇమడలేకపోయాడు. చివరికి ఎంపీ సీటు ఇస్తామన్నా మాకొద్దంటూ బయటకొచ్చారు. అలాంటి బాధ్యత కలిగిన నాయకుడిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చిన వర్ల కుమార్‌రాజా గత ఎన్నికల్లో ఓడిపోయాడు. కానీ, పార్టీ జెండాను ఎప్పుడూ వదల్లేదు. నమ్ముకున్న వ్యక్తిని గెలిపించే వరకు వదిలిపెట్టబోను. ఇలాంటి నాయకులను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని చంద్రబాబు అన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా సీటు జనసేనకు కేటాయిస్తే.. పార్టీ మాటకు కట్టుబడి ఉంటానని చెప్పిన నాయకుడు కొనకళ్ల నారాయణ. ఇది తెలుగుదేశం పార్టీ పట్టుకునే నాయకుడికి ఉండే గర్వం. దేవినేని ఉమ పార్టీ ప్రారంభం నుండి పార్టీలోనే ఉన్నాడు. సీటు ఇవ్వలేకపోతే.. మారు మాట మాట్లాడలేదు. సీటు కాదు.. పార్టీ ముఖ్యం అన్న నాయకులు వీళ్లు. వీళ్లని గుండెల్లో పెట్టుకునే బాధ్యత నాది. కొలుసు పార్థసారధి వైసీపీలో ఇమడలేకపోయాడు. అక్కడ ఉంటే.. జాతికి ద్రోహం చేసినట్లేనని బయటకొచ్చి నూజివీడు నుంచి బరిలో దిగుతున్నాడు.
‘మనకు నాయకులు కావాలి. జగన్ రెడ్డికి డబ్బులు కావాలి. గంజాయి బ్యాచ్ కావాలి. బ్లేడ్ బ్యాచ్ కావాలి. గొడ్డలి పట్టుకుని తిరిగేవారు కావాలి. నాకు ప్రజల గుండెల్లో ఉండే నాయకులు కావాలి. మీ ఓటు ఎవరికి? భవిష్యత్తుకు గ్యారెంటీ ఇచ్చే పార్టీకా.. భవిష్యత్తును అంధకారంలో నెట్టే పార్టీకా? అభివృద్ధికా, విధ్వంసానికా? సంక్షేమానికా, సంక్షోభానికా? విజ్ఞతతో ఆలోచించండి’.
దళితుల్ని చంపినవారికి జగన్ సన్మానాలు
దళితుల అభ్యున్నతికి తాను పెట్టిన 27 సంక్షేమ పథకాలు జగన్ రద్దు చేశాడని చంద్రబాబు గుర్తు చేశారు. భూమి కొనుగోలు పథకం, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కులాంతర వివాహాలకు ప్రోత్సాహకాలు, మెడికల్ సీట్లలో రిజర్వేషన్లు, స్వయం ఉపాధి పథకాలను రద్దు చేశాడు. దళితులను దగా చేశాడు. తూర్పుగోదావరిలో అనంతబాబు అనే వైసీపీ ఎమ్మెల్సీ దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు. విశాఖపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగినందుకు వేధించి వేధించి చంపేశారు. 188 మంది దళితుల్ని చంపేశారు. వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారు. దళిత వ్యతిరేకులను తరిమికొట్టాలన్నారు. దళితులకు తెలుగుదేశం అండగా నిలుస్తుందని, దళిత సంక్షేమానికి పథకాలు పునరుద్ధరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఆడబిడ్డల్ని అక్కునే చేర్చుకునే బాధ్యత నాది
45 సంవత్సరాలుగా నేను రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు కష్టబడ్డానని చంద్రబాబు చెబుతూ ‘‘నాకు ఓ చెల్లెమ్మ పంపించింది. కృష్ణుడు లేనిదే భారతం, భాగవతం లేదు. చంద్రబాబు లేనిదే ఏపీకి అభివృద్ధి లేదు. బిడ్డకు తల్లి అవసరమెంతో రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అవసరం అంతే.’నని. ఆ చెల్లెమ్మ స్ఫూర్తిని మనసారా అభినందిస్తున్నా. అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాలని బాబు అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది సూపర్ సిక్స్ పథకాలేనని చంద్రబాబు అన్నారు.
‘ఆడబిడ్డ నిధితో ప్రతి ప్రతి నెలా రూ.1500 చొప్పున ఇస్తా. తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి బిడ్డకూ రూ.15 వేలు. ఎంతమంది పిల్లలున్నా అందరికీ వర్తింపు. ప్రతి రైతుకు ఏటా రూ.20 ఇస్తా. యువతకు నిరుద్యోగ భృతిగా రూ.3000. వృద్ధులకు ప్రతి నెలా 1న రూ.4000 పెన్షన్. ఈ నెల నుండే మీ పెన్షన్లు మొదలైనట్టు. ఇప్పుడు ఎవరైనా తీసుకోకపోతే.. జులైలో అన్నీ కలిపి ఒకేసారి ఇస్తా. ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు. దివ్యాంగులకు నెలకు రూ.6000 పెన్షన్. మీ జీవితాల్లో వెలుగు నింపుతా’
అభివృద్ధి దిశగా
పేదలను నడిపిస్తా
పామర్రు సమస్యలన్నీ పరిష్కరిస్తా
వైసీపీని తరిమికొట్టండి: చంద్రబాబు
పామర్రు (చైతన్యరథం): ఇది ప్రజాగళం. ప్రజలగళం. దీక్ష పట్టుదల ఉంటే సామాన్యుడూ అద్వితీయ శక్తిగా మారుతారనడానికి ఎన్టీఆర్ నిదర్శనం. ఆయన ఆదర్శంగా పామర్రులో ప్రమాణం చేస్తున్నా. పేదరికంలేని రాష్ట్రాన్ని చూడాలనేది నా ఆశయం. పేదల్ని ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి పథంలో నడిపే బాధ్యత తీసుకుంటాను. ఈ గడ్డపై ఎంతో మంది సాహితీ, సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, సినీ రంగాలకు చెందిన హేమాహేమీలు పుట్టారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్ర రాజేశ్వరరావు, కెఎల రావు, మండలి వెంకట కృష్ణారావు లాంటి ఉద్ధండులు పుట్టిన గడ్డ ఇది. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పుట్టిన ప్రదేశం.గంటశాల, మల్లాది రామకృష్ణ శాస్త్రి, వేటూరి సుందరరామ్మూర్తి, నార్ల వెంకటేశ్వరరావు, అక్కినేని లాంటి ఎంతో మంది పుట్టిన గడ్డ ఇది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యన్నారాయణ పుట్టిందీ ఇక్కడే. అలాంటి తులసి మొక్కలు పుట్టిన గడ్డపై కొన్ని గంజాయి మొక్కలు పెరుగుతున్నాయి. పవిత్రమైన మట్టిని మలినం చేస్తున్నాయని, వాటిని ఏరిపారేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
‘పామర్రులో కైలే అనిల్ మినీలోటస్ పాండ్ కట్టాడు. చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కానీ దోపిడీలో మాత్రం నెంబర్‌వన్. పమిడిముక్కల మండలం వీరంకిలాకులు వద్ద గ్రావెల్ మాఫియా డాన్ ఈ కైలే. సెంటు పట్టా పథకంలో రూ.16 కోట్లు మెక్కాడు. ఇళ్ల స్థలాల పంపిణీకి డబ్బులు దండుకున్నాడు. ఇసుక నుండి తైలం పిండాడు. ఎమ్మెల్యే అవినీతి.. ముఖ్యమంత్రి దోపిడీ చూశాక ఇలాంటి ప్రజా నాయకులను తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడి ఎన్నికలు కైలే వర్సెస్ వర్ల, గుర్తు పెట్టుకోండి అన్నారు. డొంక రోడ్ల నిర్మాణం, సాగునీటి కాల్వల ఆధునికీకరణ ఎంతో అవసరమని బాబు అన్నారు. గతంలో నేనే భారత్ ఎలక్ట్రానిక్స్ తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాను. ఇలాంటి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాను. ప్రతి ఒక్కరికీ రెండు సెంట్ల భూమి కేటాయించి ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాను. ఇప్పటికే స్థలాలు కేటాయించిన స్థలాల్లో ఇళ్లు కట్టిస్తాను. లంక గ్రామాలకు రోడ్లు, వంతెనలు కావాలన్నారు. వాటిని పూర్తి చేసి అన్ని లంక గ్రామాలకూ రవాణా సదుపాయాలు కల్పించి తీరుతాను. మీలో చైతన్యం కల్పించడమే బాధ్యతగా వచ్చాను. ఇంటికొకరు తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు పట్టుకుని ఇంటింటికీ వెళ్లి ప్రజా నాయకుల్ని గెలిపించుకోవాలి. జగన్ రెడ్డిని, వైసీపీని చిత్తుగా ఓడిరచాలి. మన భవిష్యత్తుకు తెలుగుదేశం పార్టీ గ్యారెంటీ కల్పిస్తుంది. రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అని చంద్రబాబు వరాలు కురిపించారు.