194 కుటుంబాలకు అండగా నిలిచిన భువనమ్మ
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ఆగిన 203 గుండెలు
గతేడాది అక్టోబర్ 25న చంద్రగిరిలో ప్రారంభమైన నిజం గెలవాలి
ఇప్పటికి 8,478 కి.మీ, మొత్తం ప్రయాణం 9,080 కి.మీ
ప్రతి కార్యకర్త కుటుంబాన్ని నేరుగా కలిసి, వారిని ఓదార్చుతున్న భువనమ్మ
13న తిరువూరులో ముగియనున్న నిజం గెలవాలి
అమరావతి(చైతన్యరథం): నీతి..నిజాయితీల కలబోత, విజనరీ, భావితరాల భవిష్యత్తు రూపకర్త, ఐటీ రంగానికి ఐకాన్, అగ్రదేశాధినేతల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి, పేద-బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, సంక్షేమం-అభివృద్ధితో కూడిన డబుల్ ఇంజిన్ సర్కార్‌ను నడిపిన దార్శనికుడు, నిస్వార్థ సేవకుడు…నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రాన్ని పీక్కుతింటున్న తోడేళ్లు తమకు అడుగడుగునా అడ్డొస్తున్నాడనే అక్కసుతో…అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అధికారులను జేబులో పెట్టుకుని, చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి, సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్టు చేసి జైలులో పెట్టడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని నిలువెత్తు నిజాయితీని గత ఏడాది సెప్టెంబర్ 9న చెరసాలలో అక్రమంగా బంధించాయి. నేటికీ సాక్ష్యాధారాల కోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నాయి. నిజాయితీని బంధించడమేంటనే బాధ, ఆక్రోశం, ఆవేదనను తట్టుకోలేని 203 మంది కార్యకర్తల గుండెలు ఆ నాయకుడి కోసం ఆగిపోయాయి. రాష్ట్ర భవిష్యత్తును తీర్చి దిద్దే నాయకుడు ఓ వైపు చెరసాలలో బందీ కావడం….ఆ నాయకుడికి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక తమ కుటుంబాలకు అన్యాయం జేస్తూ 203 మంది కార్యకర్తల ఆకస్మిక మరణం. అటు చెరసాలలో భర్తను..ఇటు ఆ భర్తకోసం తల్లడిల్లి మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను చూసి భువనమ్మ చలించిపోయింది. కార్యకర్తల కుటుంబాలను తన కుటుంబంగా భావించి…ఆ కుటుంబ సభ్యులను నేరుగా కలిసి, వారి కష్టాల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించింది. నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపైకి ఎత్తుకుని ఓ వైపు నిజాన్ని గెలిపించాలి…మరోవైపు పార్టీ బిడ్డల కుటుంబాలకు ఓదార్పునివ్వాలి అనేది తన ప్రథమ కర్తవ్యంగా భావించింది. 2023 అక్టోబర్ 25న చేపట్టిన భువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమం యావత్ రాష్ట్రాన్ని ఆలోచింపజేస్తోంది. ఈ నిజం గెలవాలి కార్యక్రమం ఈనెల 13న పూర్తికానుంది. నిజం గెలవాలి పూర్తి వివరాలు…..’’
చంద్రబాబు అక్రమ అరెస్టుతో యావత్ భారతదేశం ఉలిక్కిపడిరది. ఆయన గురించి తెలిసిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు షాక్‌కు గురై ఆశ్చర్యంలో కొట్టుమిట్టాడుతున్న సమయం అది. వైసీపీ పాలనలో రాష్ట్రం నాలుగు తరాలు వెనక్కి పోయిందనే బాధలో ఉన్న రాష్ట్ర ప్రజలు, రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకే పట్టం కట్టాలని రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్న కాలం. విషయాన్ని పసిగట్టిన బులుగురంగు తోడేళ్లు చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించాలని తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో నిర్ణయించుకున్నాయి. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా, అసంబద్ధమైన వాదనలతో, కోర్టులకు అబద్ధపు సాక్ష్యాలు, ఆధారాలు చూపించి, న్యాయమూర్తులను ఏమార్చి నిజాన్ని 2023 సెప్టెంబర్ 9న రాజమండ్రి జైల్లో నిర్బంధించారు. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేని పార్టీ కార్యకర్తలు 203 మంది ప్రాణాలొదిలారు. ఓ వైపు కటకటాల్లో నిర్బంధించబడిన నిజాన్ని గెలిపించడం…మరోవైపు పుట్టెడు దుఃఖంలో మునిగిన పార్టీ బిడ్డల కుటుంబాలను ఓదార్చడం ఈ రెండు కార్యక్రమాలను ఏకకాలంలో నిర్వహిచడానికి నిజం గెలవాలి అనే కార్యక్రమాన్ని చేపట్టాలని భువనమ్మ సంకల్పించారు. 2023 అక్టోబర్ 25న చిత్తూరుజిల్లాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో చంద్రగిరి నియోజకవర్గంలో భువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ సభ్యులను పోగొట్టుకుని, ఎలాంటి ఆధారం లేక, దిక్కుతోచని పరిస్థితుల్లో మౌనంగా రోదిస్తున్న పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మీకు నేనున్నానంటూ భువనమ్మ వారి ఇళ్లకు నేరుగా వెళ్లారు. వారి కన్నీరు తుడిచి, అధైర్యపడుతున్నవారికి ధైర్యాన్నిచ్చి, కుటుంబ పెద్దలను కోల్పోయి నిరాధారమైన కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతనిచ్చి భరోసానిచ్చారు. మీ కష్టాల్లో, కన్నీటిలో పాలుపంచుకుంటానని హామీఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన భువనమ్మ నిజం గెలవాలి కార్యక్రమం రోజురోజుకీ ఓ ప్రభంజనంలా మారింది. మహిళలు, యువకులు పెద్దఎత్తున భువనమ్మకు బ్రహ్మరథం పట్టారు. తనకు సంఫీుభావం తెలిపేందుకు వందలు, వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, స్థానికులనుద్దేశించి భువనమ్మ మాట్లాడి రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ దోపిడీ విధానాలు, దుర్మార్గాలపై భువనమ్మ తనదైన శైలిలో రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, భావితరాల భవిష్యత్తుపై వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న దుర్మార్గపు విధానాలు, చేస్తున్న అరాచకాలను ప్రజల్లో ఎండగడుతున్నారు. తోటి తెలుగురాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం…అభివృద్ధిలో ముందు వరుసలో నిలబడాల్సిన మన రాష్ట్రం గంజాయి, డ్రగ్స్ మత్తులో మునిగిపోవడం పట్ల భువనమ్మ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజల్లో అవిశ్రాంతంగా అవగాహన కల్పిస్తున్నారు. మహిళల మాంగల్యాలు కల్తీ మద్యానికి బలికావడాన్ని భువనమ్మ తీవ్రంగా ఆక్షేపిస్తూ..మహిళలను చైతన్యవంతులను చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలపై దాడులు, అకృత్యాలు పెరిగిపోవడం మహిళల ఉనికికే ప్రమాదమనే విషయంపై మహిళల్లో అవగాహన పెంచుతున్నారు. రాష్ట్రం బాగుండాలంటే, మహిళలు సురక్షితంగా ఉండాలంటే, యువత భవిష్యత్తు బాగుండాలంటే, రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా ఉండాలంటే అరాచకపాలన అంతమే ఏకైక తారకమంత్రమని ప్రజలకు వివరిస్తున్నారు. దుర్మార్గపు పాలనను ఈ రాష్ట్రంలో అంతం చేయడానికి రాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును ఆయుధంగా మలచుకోవాలని, ప్రజలు ఓటును సక్రమంగా వినియోగించుకోవడం వల్లనే తమ హక్కులను సాధించుకోగలరని భువనమ్మ ప్రతి మీటింగ్ ప్రాంతంలో వివరిస్తున్నారు. రాష్ట్రంలో ఓటు కలిగిన ప్రతి పౌరుడు తమ బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తప్పకుండా రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని, ఎవరూ బద్దకించకూడదని, వచ్చే ఎన్నికలు చాలా కీలకమని రాష్ట్ర ప్రజలకు గట్టిగా చెబుతున్నారు.
9,080 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం – భువనమ్మ కఠోర దీక్షకు నిదర్శనం
ఇంటి బాధ్యతలను చక్కదిద్దుకోవడం, కుటుంబ సభ్యుల యోగక్షేమాలు చూసుకోవడం, హెరిటేజ్ కంపెనీ బాధ్యతలు, ఎన్టీఆర్ ట్రస్టు, మోడల్ స్కూల్ నిర్వహణ బాధ్యతలను చూసుకుంటున్న భువనమ్మ తీసుకున్న ఓ సాహసోపేతమైన నిర్ణయం..నిజం గెలవాలి కార్యక్రమం. ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడనటువంటి దిక్కుమాలిన రోడ్లను సైతం భువనమ్మ దాటుకుంటూ పార్టీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలిచారు. 13 విడతల కార్యక్రమంలో 8,478 కిలోమీటర్లు భువనమ్మ రోడ్డు మార్గంలో ప్రయాణం(హైదరాబాద్ నుండి ఏపీకి వచ్చిన దూరాన్ని మినహాయించి) చేశారు. హైదరాబాద్ నుండి ఏపీకి ప్రయాణించిన దూరాన్ని కూడా లెక్కిస్తే దాదాపు 15వేల కిలోమీటర్లు తిరిగినట్లే. ఈ వారం జరగనున్న మలివిడత కార్యక్రమంలో భువనమ్మ మరో 602 కిలోమీటర్లు ప్రయాణించబోతున్నారు. వీటితో కలిపి మొత్తం నిజం గెలవాలి కార్యక్రమంలో భువనమ్మ రోడ్డు మార్గం ద్వారా 9,080 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లు అవుతుంది. అర్ధరాత్రి 12గంటలు, ఒక్కోసారి ఒంటిగంట అయినప్పటికీ భువనమ్మ ఎక్కడా అలిసిపోకుండా ఓర్పుగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారు. కొన్నిసార్లు కారులో ప్రయాణిస్తున్న సమయంలోనే భోజనం చేస్తూ, ప్రయాణాన్ని ఎక్కడా ఆపకుండా భువనమ్మ తన అకుంఠిత దీక్షను చాటుకున్నారు..యావత్ నిజం గెలవాలి టీమ్‌కు ఆదర్శంగా నిలుస్తూ కార్యకర్తల కుటుంబాల వద్దకు చేరుకున్నారు. మీకు మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. పార్టీ బిడ్డలు మా బిడ్డలు..మీరు కష్టాల్లో ఉంటే నేను చూస్తూ ఉండలేను..మీకు పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఒకచోటుకు తీసుకొచ్చి, వారికి తృణమో, ఫణమో చేతిలో పెట్టే అవకాశం ఉన్నా…..భువనమ్మ ఆ అవకాశాన్ని తోసిపుచ్చి…స్వయంగా తానే కార్యకర్తల ఇళ్లకు వచ్చి కార్యకర్తల పట్ల పార్టీ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో నిరూపించారు. తెలుగుదేశంపార్టీ…కార్యకర్తల పార్టీ అనే సందేశాన్ని యావత్ రాష్ట్రానికి చాటిచెప్పారు.
రోడ్లు ఎలా ఉన్నా..
వైసీపీ పాలనలో రాష్ట్రంలో రోడ్లు కనిపించని పరిస్థితి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గుంతలు, రాళ్లు పైకి తేలిన రోడ్లు, రోడ్డు మీదకు వస్తే తిరిగి ప్రాణాలతో ఇళ్లకు వెళతామో లేదో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి రోడ్లపై భువనమ్మ సాహసోపేతమైన ప్రయాణం చేయడం చెప్పుకోదగిన అంశం. ఒళ్లు ఎన్నివిధాలుగా కుదుపులకు గురైనా…పార్టీ బిడ్డలను కలుసుకోవడమే ప్రధానమంటూ భువనమ్మ కంకణం కట్టుకున్నారు. ఎంతటి కష్టతరమైన ప్రయాణాలనైనా లెక్కచేయకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని, పార్టీ బిడ్డలను కలిసి, వారిని ఓదార్చడంలో భువనమ్మ తనదైన ముద్ర వేశారనడంలో అతిశయోక్తి లేదు.
పార్టీ బిడ్డల కుటుంబాలకు రూ.3లక్షల ఆర్థికసాయం
చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక ప్రాణాలొదిలిన 203మంది కార్యకర్తల కుటుంబాలకు భువనమ్మ ఆర్థిక సాయాన్ని అందిస్తూ వారికి బాసటగా నిలిచారు. ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల ఆర్థికసాయాన్ని వివిధ రూపాల్లో అందించారు. కార్యక్రమం ప్రారంభంలో కార్యకర్తల కుటుంబాలకు చెక్కుల ద్వారా ఆర్థికసాయాన్ని అందించారు. ఎన్నికల కోడ్ సమీపిస్తున్న తరుణంలో…మిగిలిన కార్యకర్తల కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ఆర్థికసాయాన్ని ముందుగానే భువనమ్మ జమచేశారు. ఆర్థికసాయాన్ని ఇచ్చేశాం కదా..అని భువనమ్మ చేతులు దులిపేసుకోలేదు. ఎందుకంటే భువనమ్మ తన బిడ్డల కుటుంబాలను నేరుగా కలిసి ఓదార్చాలి..వారికి మేమున్నామనే నమ్మకాన్ని కలిగించాలని దృఢమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఎన్ని అవరోధాలు, అడ్డంకులు, రోడ్లు అనుకూలించకపోయినా, ఎన్ని ముఖ్యమైన పనులు అడ్డొచ్చినా వాటినన్నింటినీ సాధ్యమైనంత వరకు పక్కన పెట్టి పార్టీ బిడ్డల కుటుంబాలను భువనమ్మ దగ్గరకు వెళ్లి ఓదారుస్తున్నారు.
కార్యకర్తల పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్టులో ఉచిత విద్య
చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన పార్టీ కార్యకర్తల బిడ్డలకు భువనమ్మ విద్యను వరంగా ఇస్తున్నారు. కార్యకర్తల కుటుంబాలను పరామర్శించే సమయంలో మరణించిన కార్యకర్తకు ఎంతమంది పిల్లలు? వారు ఏం చేస్తున్నారు? చదివే పిల్లలు ఉంటే ఏం చదువుతున్నారు? ఏం చదివారు? కుటుంబ సభ్యులు ఏం పనులు చేస్తున్నారు? జీవనాధారం ఏంటి? ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చదువుకునే విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఉచిత విద్య అందిస్తూ..వారికి ఊతమందిస్తున్నారు. వారు ప్రయోజకులు అయ్యి..ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా తీర్చిదిద్దుతామని భువనమ్మ భరోసా ఇస్తున్నారు. ఇలా భువనమ్మ ఇప్పటి వరకు దాదాపు 50మంది విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్టులో ఉచిత విద్యను అందించే బాధ్యతను తీసుకున్నారు.
వివిధ వర్గాలతో ప్రత్యేక కార్యక్రమాలు…ప్రధాన సమస్యలపై చర్చ
నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మమేకమయ్యారు. ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విషయంలో కీలకబాధ్యత చేపట్టారు. ఇప్పటి వరకు జరిగిన 13 విడతల నిజం గెలవాలి కార్యక్రమంలో 9 ప్రత్యేక కార్యక్రమాల్లో భువనమ్మ పాల్గొన్నారు.
1. దర్శి నియోజకవర్గంలో సీనియర్ సిటిజన్స్ తో ముఖాముఖి.
2. తాడికొండ నియోజకవర్గంలో మహిళా పాడిరైతులతో ముఖాముఖి.
3. ధర్మవరం నియోజకవర్గంలో చేనేత మహిళలతో ముఖాముఖి.
4. కుప్పం నియోజకవర్గంలో మహిళలతో ముఖాముఖి.
5. పాడేరు నియోజకవర్గంలో గిరిజనులతో ముఖాముఖి.
6. పత్తికొండ నియోజకవర్గంలో మొదటిసారి ఓటు వేయబోతున్న యువతతో ముఖాముఖి.
7. గూడూరు నియోజకవర్గంలో రోజువారి కూలి మహిళలతో ముఖాముఖి.
8. మచిలీపట్నం నియోజకవర్గంలో గంగపుత్రుల కుటుంబాలతో ముఖాముఖి.
9. నంద్యాల నియోజకవర్గంలో ముస్లిం మహిళలతో ముఖాముఖి.
ఎన్టీఆర్ జిల్లాలో నిజం గెలవాలి ముగింపు…
2023 అక్టోబర్ 25న చిత్తూరుజిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైన నిజం గెలవాలి కార్యక్రమం..ఈనెల 13న ఉమ్మడి కృష్ణాజిల్లా..నేటి ఎన్టీఆర్ జిల్లాలో పూర్తికానుంది. ఇప్పటి వరకు 13 విడతల్లో నిజం గెలవాలి కార్యక్రమం జరిగింది. 13విడతల్లో 44రోజులు భువనమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ 44రోజుల్లో 25పార్లమెంటు నియోజకవర్గాలు, 92 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఇప్పటి వరకు 194మంది కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ పరామర్శించారు. ఈ వారం కార్యక్రమంలో మరో రెండు నియోజకవర్గాల్లో భువనమ్మ పర్యటించడంతో మొత్తం పర్యటించిన అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 94కు చేరనుంది. అదేవిధంగా మలివిడత కార్యక్రమంలో మరో 9మంది కార్యకర్తల కుటుంబాలను భువనమ్మ పరామర్శించబోతున్నారు. వీటితో కలిపి మొత్తం 203మంది కార్యకర్తల కుటుంబాల పరామర్శ పూర్తికానుంది.
భువనమ్మకు బ్రహ్మరథం పడుతున్న మహిళలు…
నిజం గెలవాలి కార్యక్రమం చేస్తున్న భువనమ్మకు యావత్ రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భువనమ్మ పరామర్శించబోతున్న కార్యకర్త కుటుంబం వద్ద ఆమెను కలిసి, సంఫీుభావం తెలిపేందుకు మహిళలు పెద్దఎత్తున చేరుకుంటున్నారు. అమ్మా…మీకు మేమున్నాం..అధైర్యపడొద్దని చెబుతున్నారు. భువనమ్మకు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. అర్థరాత్రి సమయాల్లో సైతం భువనమ్మ రాకకోసం మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎదుచూస్తూ రోడ్లపై నిలబడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాల్లో భువనమ్మకు వినూత్న రీతిలో స్వాగతం పలుకుతున్నారు. మహిళలు తనపై చూపుతున్న అభిమానానికి భువనమ్మ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు.