కుప్పం (చైతన్యరథం): కుప్ప పర్యటనలో రెండో రోజు గురువారం గుత్తార్లపల్లిలో జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న చౌడేశ్వరమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేకా పూజలు నిర్వహించారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు తరలింపుపై సీఎం చంద్రబాబుకు ఈ సందర్భంగా కుప్పం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. “మా మాటగా చెప్పు భువనమ్మ”.. అనే ప్లకార్డులతో భువనేశ్వరికి కుప్పం మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కృష్ణమ్మకు చీర, సారె అందించడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. కుప్పంలో ఇలా శ్రీశైలం నుంచి వచ్చిన కృష్ణా జలాలను చూడడం తన జన్మలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో మహిళలు తరలి వచ్చారు.












