- రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించిన ముఖ్యమంత్రి
- షిప్ బిల్డింగ్, ఎలక్ట్రానిక్స్, పర్యాటక రంగాలపై అమిత్ కళ్యాణి ఆసక్తి
విశాఖ (చైతన్య రథం): సుదీర్ఘ తీరప్రాంతమున్న ఆంధ్రప్రదేశ్‌లో నౌకా నిర్మాణంతోపాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖ చేరుకున్న సీఎంతో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణి భేటీ అయ్యారు. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్‌తో పాటు అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిపై ఆసక్తిగా ఉన్నామని అమిత్ కల్యాణి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వెల్లడిరచారు. ఏపీలో నౌకా నిర్మాణంతోపాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో అడ్వాన్స్డ్ ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని అమిత్ కల్యాణి సీఎంకు వివరించారు. తిరుపతి సమీపంలో అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ సెన్సార్ల్ ఉత్పత్తిని చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే పర్యాటక రంగంలోనూ కొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు అమిత్ కల్యాణి సీఎంకు స్పష్టం చేశారు. గండికోటవద్ద రివర్ క్రూయిజ్ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వాణిజ్య నౌకలతోపాటు డిఫెన్సు నౌకల నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని…
ప్రస్తుతం ఈ రంగంలో భారత్‌లో తయారీ అతి తక్కువగా ఉందని.. దీనిని దేశంలోని కంపెనీలు వినియోగించుకోవాల్సి ఉందన్నారు. భారత్ ఫోర్జ్ సంస్థ చేపట్టే ప్రాజెక్టులు, పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు హామీనిచ్చారు. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా గండికోట, పాపికొండలు, అరకు వ్యాలీలాంటి ప్రాంతాలు అనుకూలమన్నారు. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకూ విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాన్నీ ప్రోత్సహిస్తున్నామని.. వచ్చే రెండేళ్లలో పెద్దఎత్తున హోటల్ రూమ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. అరకు కాఫీలాంటి ఉత్పత్తులను కూడా గ్లోబల్ బ్రాండ్లుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్‌కు తెలిపారు. హైదరాబాద్- అమరావతి- చెన్నై- బెంగుళూరు నగరాలను కలుపుతూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా రానున్నట్టు సీఎం వివరించారు. సమావేశం అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కల్యాణిని శాలువాతో సీఎం సత్కరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఈడీబీకి చెందిన అధికారులు, భారత్ ఫోర్జ్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.















