- ఆ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు
- భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో మంత్రి సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా ఉద్ఘాటన
- గాజువాకలో ఘనంగా రాష్ట్రస్థాయి జయంతి వేడుకలు
- భగీరథుని విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి, పల్లా
గాజువాక (చైతన్యరథం): భగీరథుని ఆశయాలే ఆదర్శంగా కూటమి ప్రభుత్వం అడుగులు వస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్ సవిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఆదివారం విశాఖపట్నం జిల్లా గాజువాకలోని దుర్గనగర్ (71వ వార్డు)లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావుతో కలిసి భగీరథ మహర్షి విగ్రహాన్ని మంత్రి సవిత ఆవిష్కరించారు. భగీరథుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జరిగిన సభలో మంత్రి సవిత మాట్లాడుతూ ఇక్ష్వాకు వంశీయుడైన భగీరథ మహర్షి కఠోర తపస్సుతో గంగను భూమిపైకి తీసుకువచ్చిన మహనీయుడని కొనియాడారు. సగర కులస్థుడిగా జన్మించి, సమాజం కోసం భగీరథ మహర్షి చేసిన సేవలు ప్రతి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిబద్ధంగా పని చేస్తోందన్నారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ భగీరథ మహర్షి జయంతిని రాష్ట్రస్థాయిలో నిర్వహించుకోవడం గాజువాక ప్రజలకు గర్వకారణం అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మొదటిసారిగా అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బీసీ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. బీసీలకు అభివృద్ధి, గౌరవం రెండిరటినీ అందించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
‘‘సగర’’గా గుర్తింపునకు పల్లా కృషి
సగరులు, ఉప్పర్లు వర్గాలకు ‘‘సగర’’గా అధికారిక గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌ను ప్రభుత్వ స్థాయికి తీసుకెళ్లిన పల్లా శ్రీనివాసరావు.. బీసీ శాఖ మంత్రిని ప్రత్యేకంగా కలుసుకుని జీవోలో మార్పు సాధించారు. దీని ద్వారా దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వర్గాలకు న్యాయం జరిగిందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం మేయర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, బీసీ కార్పొరేషన్ కార్యదర్శి ఎస్. సత్యనారాయణ, మేనేజింగ్ డైరెక్టర్ డా. మల్లికార్జున రావు, కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొన్నారు.