అమరావతి (చైతన్యరథం): భారత్, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) కుదరడంపై విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. చరిత్ర కాలం నుండి కొనసాగుతున్న రెండు దేశాల సంబంధాల్లో ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా భారత్ నుండి యూకేకి ఎగుమతయ్యే 99 శాతం వస్తువులు, సరుకులకు పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుందన్నారు. ఇది వాణిజ్య విలువలో దాదాపు 100 శాతం వరకు ఉంటుంది. దీనివల్ల భారత్, యూకే మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. ఈ ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగం గణనీయమైన ప్రయోజనాలను పొందుతుంది. మన ఆక్వా ఉత్పత్తులకు యూకే మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. ఈ చారిత్రక ఒప్పందం కుదిరేందుకు కారణమైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్ గోయల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మంత్రి లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.