- 2024 ఎన్నికల్లో వైసీపీ ఆల్ ఔట్
- ప్రజా వ్యతిరేక సునామీలో కొట్టుకుపోవడం ఖాయం
- తల్లిని, చెల్లిని తరిమేసినవాడు మహిళా పక్షపాతా?
- ఓటమి భయంతో అవాకులు, చెవాకులు
- మండిపడ్డ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
అమరావతి: ఓటమి భయంతో జగన్‌రెడ్డి అవాకులు, చెవాకులు పేలుతున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రా…కదలిరా సభలకు వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక సునామీలో తాను కొట్టుకుపోవడం ఖాయమనే భయం జగన్ రెడ్డిలో కొట్టొచ్చినట్టు కనపడుతోందన్నారు. మారీచుడు యజ్ఞాన్ని భగ్నం చేసినట్టు రాష్ట్ర అభివృద్ధిని, ప్రజాసంక్షేమాన్ని ధ్వంసం చేసిన జగన్‌కు ఓటు అనే ఆయుధంతో ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని స్పష్టం చేశారు. యుద్ధానికి ముందే ఓటమి ఒప్పుకున్న పిరికిపంద జగన్ రెడ్డి మాపై విమర్శలు చేయడమా అని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మాపై నిందలా..
దెందులూరు సభలో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలేనన్నారు. 57 నెలల విధ్వంసకర పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మాపై నిందలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదుల మీద జగన్ పాలన చేస్తున్నాడు. జగన్ అర్జునుడు కాదు.. భస్మాసురుడు. మూడు రాజధానుల పేరుతో ప్రజారాజధాని అమరావతిని చంపేశాడు. తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ మహిళా పక్షపాతా అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.
మరోసారి నమ్మేందుకు జనం సిద్ధంగా లేరు..
తాడేపల్లి ప్యాలెస్ గేటు ముందు శాపనార్థాలు పెడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ ఓటమికి సజీవ సాక్ష్యాలన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలను కలిసేందుకు కూడా ఇష్టపడని నువ్వు పెత్తందారుడు కాక మరేమిటని ప్రశ్నించారు. ఏది సంక్షేమం జగన్ రెడ్డీ.. ధరలు, పన్నులు, చార్జీల బాదుడుతో ప్రజల నడ్డి విరిచేయడమా? 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి జాబ్ లెస్ క్యాలెండర్‌తో యువత భవితను ప్రశ్నార్థకం చేయడమా అని నిలదీశారు. పన్నులు, ఛార్జీల పెంపుతో ప్రతి కుటుంబపై రూ.8 లక్షల భారం వేశారన్నారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ అదే నిజమని ఇన్నాళ్లూ నమ్మించిన జగన్ రెడ్డిని మరోసారి నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఆల్ ఔట్ అవ్వడం ఖాయమని ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు