- మొంథా తుపానుతో రాష్ట్రానికి రూ.6,384 కోట్ల నష్టం
- ముందస్తు ప్రణాళికతో ప్రాణ నష్టం జరగకుండా కాపాడాం
- గత పాలకులు విపత్తు నిధినీ ఖాళీ చేశారు
- తుపాను నష్టాల అంచనాకు వచ్చిన కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు
- నష్ట నివారణపై సీఎం ముందస్తు చర్యలకు ప్రశంస
- ఆర్టీజీఎస్ వ్యవస్థ సేవలను కొనియాడిన కేంద్ర బృందం
అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌కు మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టంపై త్వరితగతిన నివేదిక ఇచ్చి ఉదారంగా ఆదుకునేలా సిఫార్సు చేయాలని కేంద్ర బృందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. తుపాను కారణంగా ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు, పంటలు, ఆక్వా, చేనేతరంగాలు దెబ్బతిన్నాయని.. అన్ని రంగాల్లో మొత్తంగా రూ.6384 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు కేంద్ర బృందానికి సీఎం వివరించారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో తుపాను నష్టంపై అంచనాకు వచ్చిన కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలోని కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైంది. క్షేత్రస్థాయిలో జరిపిన పరిశీలనల్ని సీఎం దృష్టికి తీసుకువచ్చింది. రెండు బృందాలుగా వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి తుపాను నష్టాన్ని అంచనా వేశామని వివరించింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించనట్టు తెలిపింది. మొంథా తుపాను, భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టంపై రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంథా తుపాను కారణంగా ప్రభావితమయ్యాయని ప్రభుత్వం నివేదికలో పేర్కొంది.
దాదాపు 10 లక్షలమంది తుపానుతోపాటు భారీ వర్షాలకు ప్రభావితమయ్యారని వెల్లడిరచింది. రాష్ట్రవ్యాప్తంగా 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం పేర్కొంది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు 4,566 ఇళ్లు దెబ్బతిన్నట్టు వివరించింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని.. 3.27 లక్షలమంది రైతులు నష్టపోయారని కేంద్ర బృందానికి నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేతరంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడిరచింది.
4,794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేల కూలినట్టు తెలిపింది. అలాగే 2,318 విద్యుత్ ట్రాన్సఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మొంథా తుపానువల్ల నష్టపోయిన ప్రజల్ని ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షలమందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని ప్రభుత్వం వెల్లడిరచింది. మొత్తం 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున తక్షణ ఆర్ధిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి వివరించింది. రాష్ట్రంలో రహదారులు, విద్యుత్‌లాంటి మౌలిక సదుపాయాలను తక్షణం పునరుద్ధరించేందుకు తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వం కేంద్ర బృందానికి నివేదించింది.
త్వరితగతిన సాయం వచ్చేలా చూడండి
రాష్ట్రంలో జరిగిన తుపాను నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించినందున.. త్వరితగతిన నివేదిక ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం కేంద్ర బృందాన్ని కోరారు. ఏపీనుంచి రెండు రోజుల్లో తుది అంచనాలను కూడా పంపుతామని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర బృందం.. త్వరితగతిన కేంద్రానికి సిఫార్సులు చేస్తామని వెల్లడిరచింది. ఆర్టీజీఎస్ నుంచి ముందస్తు హెచ్చరికలు పంపి సరైన సమయంలో విలువైన ప్రాణాల్ని కాపాడగలిగారని కేంద్ర బృందం ముఖ్యమంత్రిని కొనియాడిరది. రెస్క్యూ బృందాలను, వనరుల్ని ముందుగానే పంపి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించారని అభిప్రాయపడిరది. గర్భిణుల్ని కూడా ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్యసేవలు సత్వరం అందేలా చూసిన విషయాన్ని కూడా గుర్తించామని కేంద్ర బృందం సీఎంకి తెలిపింది. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చి పంటలు నీట మునిగినట్టు క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించామన్నారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలు సవరించేలా సిఫార్సు చేయాలని సీఎం కోరారు. పత్తి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ఓవైపు రాష్ట్ర విభజన, మరోవైపు గత పాలకుల విధ్వంస పాలన ఏపీని తీవ్రంగా నష్టపరిచిందని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి తెలిపారు. రాష్ట్ర విపత్తు నిధుల్ని కూడా దారి మళ్లించారని, కేంద్ర ప్రాయోజిత పథకాలను కూడా నిలిపివేశారని.. ఈ అంశాన్ని కేంద్రానికి కూడా నివేదించామని సీఎం అన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఏర్పడిన లోటుపాట్లను సవరించుకునే ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు.
సముద్ర కోత నివారణ పనులకు నిధులివ్వండి
తూర్పు కోస్తాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడూ తుపాన్ల కారణంగా నష్టం జరుగుతూనే ఉందని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి వివరించారు. సూళ్లూరుపేట నుంచి ఇచ్చాపురం వరకూ ఉన్న ప్రాంతాలు తుపాన్ల కారణంగా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని వివరించారు. తుపాన్ల గమనాన్ని గమనించేలా సాంకేతికత వినియోగిస్తున్నా దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ఆస్కారం లేదని.. ఫలితంగా ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. అవేర్‌తోపాటు ఇతర సాంకేతిక వ్యవస్థల ద్వారా వరద నియంత్రణను చేయగలుగుతున్నామని సీఎం పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా ముందస్తుగానే హెచ్చరికలు పంపి ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి వివరించారు. గాలుల వేగాన్ని గుర్తించి ముందస్తుగానే విద్యుత్ సరఫరా నిలిపివేసి నష్టాన్ని కూడా తగ్గించినట్టు తెలిపారు. సముద్రపు నీరు, నదులు, వాగులనుంచి వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా పంటలు, రహదారులు పెద్దఎత్తున దెబ్బతిన్నాయన్నారు. తీరప్రాంతాల్లోని సముద్ర కోత నివారణకు వేర్వేరుచోట్ల పనులు చేపట్టేందుకు నిధులు కేటాయించేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరారు. కోస్టల్ సీ ఎరోజన్ మిటిగేషన్ ప్రాజెక్టులో భాగంగా కాకినాడ సమీపంలోని ఉప్పాడ వద్ద సముద్రపు కోత నివారణ కోసం చేపట్టే పనులకు రూ.323 కోట్లు, విశాఖ సమీపంలో రూ.203 కోట్లు, శ్రీకాకుళం సమీపంలో రూ.98 కోట్లు నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పిడుగుల హెచ్చరికల వ్యవస్థ, లైటనింగ్ అరెస్టర్ల ఏర్పాటుకు రూ.11.77 కోట్లు, అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాల నివారణ వ్యవస్థల ఏర్పాటుకు రూ.18.48 కోట్లు కేటాయించేలా చూడాలని కోరారు. సమావేశానికి సీఎస్ కె విజయానంద్, రెవెన్యూ, వ్యవసాయ, జలవనరుల, ఆర్థిక శాఖ, ఆర్టీజీఎస్ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.













