- దుర్మార్గ రాజకీయాలకు తెగబడుతున్న వైనం
- రాజకీయాలను కలుషితం చేస్తున్న వైసీపీ
- ఘోర ఓటమే.. జగన్ ఫ్రస్ట్రేషన్‌కు కారణం
- పాపాల భయమే జగన్‌ను వెంటాడుతోంది..
- స్థాయిమరచి ప్రవర్తించడం సహేతుకం కాదు
- విధ్వంస రాజకీయాలను ప్రజలు ఇక ఒప్పరు
- వ్యక్తిగత దూషణలతో స్థాయిని దిగజార్చుకుంటున్నారు
- సీఎం సమర్థతను సహించలేకపోతున్న జగన్
- సంక్షేమం అమలులో కూటమికి పోటీ లేదు..
- జగన్ యాక్సిడెంటల్ సీఎంగానే ఉండిపోతారు..
- సమాచార మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటన
- నీచ రాజకీయాలపట్ల ప్రజలు అప్రమత్తం కావాలని పిలుపు
మంగళగిరి (చైతన్య రథం): కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ఓర్వలేక.. జగన్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోయి ఉచ్చనీచాలు విస్మరించి ప్రవర్తిస్తున్నాడని సమాచార, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థాయిని విస్మరించి జగన్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు దిగజారడాన్ని మంత్రి తప్పుబట్టారు. ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పాల్పడుతున్న దిగజారుడు రాజకీయాలు, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరు, విధ్వంసాన్ని ప్రోత్సహిస్తున్న తీరు చూస్తుంటే.. రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా బాధ కులుగుతుందని అన్నారు. ‘నేనూ సుమారు మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా తండ్రి సైతం ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశారు. రాజకీయాలను చాలా దగ్గరగా చూస్తూ ఎదిగిన వ్యక్తిని. కానీ, జగన్‌రెడ్డి అనుసరిస్తున్న విధ్వంసకర రాజకీయం, వైసీపీ దౌర్భాగ్య విధానాలు, ఆ పార్టీ నేతల అనుచిత వైఖరులు.. ఇలాంటి రాజకీయ వాతావరణం రాష్ట్రంలో ఏనాడూ చూడలేదని మంత్రి కొలుసు ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర రాజకీయాలలో `విపక్ష పార్టీలు ప్రభుత్వాలను ఘాటుగా విమర్శించినా.. వ్యక్తిగత దూషణలకు పాల్పడిన సందర్భాలు లేవు. కించపరిచే విధంగా, అప్రజాస్వామికంగా మాట్లాడిన తీరూ ఎక్కడా చూడలేదు. అధికారపక్షాన్ని కించిపర్చడం కోసం అరాచక శక్తులని ప్రోత్సహించిన రాజకీయాలూ ఎప్పుడూ లేవు. హూందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాసమస్యలే ప్రాధాన్యంగా పోరాటాలు చేసేవారు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్, ఆ పార్టీ నేత జగన్‌రెడ్డి తీరు చూస్తుంటే.. ఆందోళన కలుగుతోందని అన్నారు. గెలుపోటములు సర్వసాధారణమంటనే.. గెలిచినా ఓడినా నైతికతను విస్మరించడం రాజకీయ లక్షణం కాదన్నారు. బహుశా వైనాట్ 175నుంచి 11స్థానాలకి పడిపోయిన వైనంతో.. ఫ్రస్ట్రేషన్‌లో అనైతిక రాజకీయాలకు తెగబడుతున్నట్టు కనిపిస్తోందని మంత్రి కొలుసు ఎద్దేవా చేశారు. ‘సీఎం హోదాను వెలగబెట్టిన వ్యక్తి.. క్రిందిస్థాయి నాయకులకు ఆదర్శంగా ఉండాలి. స్థాయిని విస్మరించి అనైతిక రాజకీయాలకు దిగజారడం సహించరానిది. జగన్ పరామర్శ పర్యటనలు.. ఆయన ఉపన్యాసాలు.. పత్రికా ప్రకటనలు చూస్తుంటే `జగన్‌లో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది తప్ప రాష్ట్ర ప్రగతిపట్ల బాధ్యత లేశమాత్రం కనిపించడం లేదని దుయ్యబట్టారు. మాటలపై నియంత్రణ కోల్పోయి వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని గమనిస్తే.. జగన్‌రెడ్డిలో అభద్రతాభావం, భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయని కొలుసు పేర్కొన్నారు. ‘నేను ముగ్గురు ముఖ్యమంత్రుల (వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి) దగ్గర పని చేశాను. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను. జూనియర్లుగావున్న నాలాంటి మంత్రులు ఎవరైనా పొరబాటున అప్రజాస్వామికంగా మాట్లాడినా.. మర్యాదపూర్వక భాషను విస్మరించినా.. మందలింపే ఉండేది. ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడాలి.
ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతరులకు ఆదర్శవంతంగా ఉడాలని సూచించేవారు. అంతేగాని వ్యక్తిగత దూషణలు, దాడులు చేయమని ఏనాడూ ప్రోత్సహించలేదు. నేడు మా నాయకుడు చంద్రబాబు కక్షా రాజకీయాల జోలికి పోవద్దని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి.. నియోజకవర్గ, రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టమనే చెప్తారు, చెప్తున్నారు. రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధిలోకి తీసుకువెళ్ళాలి, ప్రజలకి ఇంకా ఎలా ఉపయోగపడాలనే దానిపైనే దృష్టి పెట్టమని చెప్తున్నారు. ఇలాంటి మంచి రాజకీయ వాతావరణాన్ని జగన్ రెడ్డి కలుషితం చేస్తున్నారు’ అని కొలుసు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థి జీవితంపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ.. మర్యాదలేని అనుచిత వ్యాఖ్యలకు జగన్‌రెడ్డి దిగజారారంటే.. ఆయన మానసిక స్థితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి కొలుసు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కక్షపూరిత రాజకీయాలకే పూనుకుంటే.. రెండు దశాబ్దాలపాటు అధికార పీఠంపైవున్న చంద్రబాబు ముందు జగన్ ప్రస్తావించిన ప్రత్యర్థులు ఇప్పుడిలా ఉండేవారా? అని మంత్రి కొలుసు నిలదీశారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా అధికారపీఠంపైవున్న చంద్రబాబు ఏనాడూ కక్షపూరిత రాజకీయాలవైపు వెళ్లలేదని మంత్రి ప్రస్తావించారు. 2019 -2024 మధ్య జగన్ సాగించిన అరాచక పాలన, విధ్వంసం, అవినీతి, దోపిడి, అప్రజాస్వామిక పద్ధతులు అన్నీ వెంటాడి.. ఆయనను తీవ్ర భయానికి లోనుచేస్తున్నాయని మంత్రి కొలుసు పేర్కొన్నారు. వైసీపీ నేతలు అరెస్టుల బారిన పడుతున్నారంటే.. చేసిన పాపాల కారణమే తప్ప కక్షకాదనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అరాచకాలు, దోపిడీలు, కుంభకోణాల పాపం దగ్గర పడేసరికి.. వాటినుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి వైసీపీ నీచ రాజకీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని మంత్రి కొలుసు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘గంజాయికి బానిసై సమాజంలో అరాచకాలు సృష్టిస్తూ ఆడపిల్లల్ని హింసిస్తున్న వారిమీద పోలీసులు చర్యలు తీసుకుంటే జగన్ వెళ్లి పరామర్శిస్తున్నాడు.
ఎమ్మెల్యేగావున్న సోదరిపట్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వ్యక్తిని మందలించాల్సిపోయి.. పరామర్శల పేరిట ఇంటికెళ్లి ప్రోత్సహిస్తున్నాడు. మహిళలపట్ల జగన్‌కు ఉన్న గౌరవం ఏపాటిదో ప్రజలకు అర్థమైంది. ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యమైన భాష మాట్లాడితే తప్పులేదు. కానీ అనైతికంగా, దిగజారుడు భాష మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదు. పనికిమాలిన భాషను ప్రయోగిస్తున్న వైసీపీలు సమాజానికి క్షమాపణ చెప్పాలి. పరామర్శలు ఎలా ఉంటాయో ప్రజలకు తెలీంది కాదు. కానీ పరామర్శల పేరిట జగన్ ప్రవర్తిస్తున్న తీరు బల ప్రదర్శనకు, భయాన్ని కప్పిపుచ్చుకోవటానికే అని అర్థమవుతుంది. అలాంటి చర్యలను చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు’’ అని మంత్రి కొలుసు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
ఇది కాదా సంక్షేమం?
సంక్షేమం గురించి గంటలు మాట్లాడడం వేరు. సంక్షేమం చేసి చూపించడం వేరు. నేడు కూటమి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమం కొత్త చరిత్రను రాస్తోంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వనిస్థాయి సంక్షేమాన్ని నేడు ప్రజలు అందుకుంటున్నారు. జగన్‌లో ప్రస్టేషన్‌కు ఇదే కారణం కావొచ్చు. ప్రజల్లో అన్ని వర్గాల్లో పాజిటివ్ వస్తే తన పరిస్థితి ఏంటన్న భయంతోనే జగన్ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. జగన్‌ది డైవర్షన్ పాలిటిక్స్.. గగ్గోలు పాలిటిక్స్. 64 లక్షలమందికి ప్రతినెలా రూ.2720 కోట్లు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం దేశంలో మరేదైనా ఉందా? ప్రస్తుత నెలతో కలిపి దగ్గర దగ్గర రూ.40 వేల కోట్లు కేవలం పింఛన్లపై ఖర్చు చేశాం. ఇది కాదా సంక్షేమం? తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ఆర్థికసాయం అందిస్తున్నాం. దీనికి దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశాం. నాకు డబ్బులు పడలేదని ఎవరూ చెప్పే పరిస్థితి లేకుండా చేశాం. దీన్ని ఏమంటారు? 204 అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నాం. ఇప్పటికి 4 కోట్లమందికి పైగా భోజనాలు అందించాం.
అంటే జగన్ భాషలో పేదల కడుపునింపడం సంక్షేమం కాదా? 47 లక్షలమంది అన్నదాతల ఖాతాల్లో దాదాపు రూ.3200 కోట్లు జమ చేశాం. ఇది రైతు సంక్షేమం కాదా? ఆగస్టు 15నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్నాం. జగన్ కళ్లు మూసుకుని.. సంక్షేమం జరగడం లేదని పదేపదే గోల పెట్టి… అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. పోలీస్ రిక్రూట్‌మెంట్ చేపడుతున్నాం. పెట్టుబడుల తెచ్చి మళ్లీ పారిశ్రామిక రంగంలో ఊపుతెచ్చాం. ఇవన్నీ జగన్‌కు కనిపించడంలేదా? ఉచిత ఇసుక తెచ్చి నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాలి. ప్రభుత్వాలను పశ్నించాలి. ప్రజల కోసం పనిచేయాలి. కానీ జగన్‌కు తన సొంత ఉనికి, ప్రయోజనాలు తప్ప మరేమీ పట్టకపోవడం దురదృష్టకరం. వైసీపీలాంటి దుర్మార్గ రాజకీయ పార్టీలు చరిత్రలో మనుగడ సాగించలేదు. జగన్ యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్‌గా చరిత్రలో నిలిచిపోతారు. ఐదేళ్లు అధికారమిచ్చిన ప్రజలను నిలువునా దగా చేసిన చరిత్ర ఎన్నటికీ చెరిగిపోదు. జగన్‌లాంటి దుర్మార్గ రాజకీయులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొలుసు పార్థసారథి పిలుపునిచ్చారు.