- వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చర్యలు తీసుకోండి
- అధికారులకు మంత్రి పార్థసారథి ఆదేశం
నూజివీడు (చైతన్యరథం): అకాల వర్షాలు కురుస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో అకాల వర్షం కారంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా, మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, మెడికల్, అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, అన్ని శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేసి నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం, తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు, నూజివీడు నియోజకవర్గంలో ఉద్యాన, మామిడి పంట నష్ట వివరాలపై పూర్తి నివేదిక సమర్పించాలన్నారు. అవసరం మేరకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయలన్నారు. రహదారులపై ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులను మంత్రి పార్థసారథి ఆదేశించారు.