- గోదావరి వరదలను నియంత్రించేందుకు అవకాశం
- వరదలతో ఏపీకి ఏటా రూ.2,000 వేల కోట్ల నష్టం
- ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు అతలాకుతలం
- ఏటా 3 వేల టీఎంసీ వరద జలాలు సముద్రం పాలు
- గోదావరి వృధా జలాల వినియోగానికి ఏపీ సర్కారు కసరత్తు
- 200 టీఎంసీ నీటిని సీమకు తరలించేలా బనకచర్ల ప్రాజెక్ట్
- ఈ ప్రాజెక్టుతో చివరి నేలలకూ సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు
- వరద జలాల్లో వాటా కావాలంటూ తెలంగాణ పొంతనలేని వాదన
- వరద జలాలతో ఏటా నష్టపోతున్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే
గోదావరి- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మార్చి.. సంపద సృష్టించి.. ప్రజల తలసరి ఆదాయాన్ని గణనీయంగా పెంచే ‘గేమ్ ఛేంజర్’. ఏటా సగటున 2,989 టీఎంసీ గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయి. వాటిలో 200 టీఎంసీ జలాలను ఈ ప్రాజెక్టుకు సద్వినియోగించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ప్రాజెక్ట్ పూర్తయితే ప్రతి ఎకరాకూ నీళ్లివ్వొచ్చు. వరదలను నియంత్రించవచ్చు. తాగునీటి అవసరాలకు, పరిశ్రమలకు పుష్కలంగా నీరు లభిస్తుంది. రూ.80,112 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును కేంద్రం సహకారంతో, ప్రైవేటు భాగస్వామ్యంతో ‘హైబ్రిడ్ యాన్యుటీ’ విధానంలో చేపడతారు. గోదావరి -బనకచర్ల అనుసంధానం పూర్తయితే బనకచర్ల… రాయలసీమకు గేట్ వే అవుతుంది. సీమ ఉద్యాన పంటల హబ్‌గా మారుతుంది. బొల్లాపల్లిలో 150 టీఎంసీ నీటిని నిల్వ చేసుకుంటే, రాయలసీమ, కృష్ణా డెల్టా ప్రాంతాలలో ఎక్కడికైనా తరలించవచ్చు. బనకచర్ల ద్వారా 80 లక్షల జనాభాకు తాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 22.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, పరిశ్రమలకు 200 టీఎంసీ జలాలు అందించవచ్చు. ప్రాజెక్టు పూర్తయితే జీఎస్టీ, ఇతర రూపాల్లో ప్రభుత్వానికి మొదటి ఏడాది నుంచే ఆదాయం వస్తుంది. యాన్యుటీ చెల్లించడం ఇబ్బంది కాబోదు. 20-25 ఏళ్లలో మొత్తం చెల్లించేలా నిబంధనలు రూపొందిస్తోంది కూటమి ప్రభుత్వం.
గోదావరి నీటి తరలింపు ఇలా:
పోలవరం కుడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 17,500 నుంచి 28 వేల క్యూసెక్కులకు పెంచుతారు. దానికి సమాంతరంగా తాడిపూడి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని ఇప్పుడున్న 1,400 క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచుతారు. ఈ రెండు కాలువల ద్వారా వరద ప్రవాహముండే 100 రోజుల్లో రోజుకు 2 టీఎంసీ జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించడం లక్ష్యం. ప్రకాశం బ్యారేజీకి ఎగువున వైకుంఠపురం వద్ద నిర్మించే లిఫ్ట్ లేదా అక్విడక్ట్ ద్వారా నీటిని నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువలోకి మళ్లించి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. ఈ రిజర్వాయర్‌ను మొదట 170 టీఎంసీ సామర్థ్యంతో నిర్మిస్తే, భవిష్యత్తులో 200-400 టీఎంసీ వరకు పెంచుకోవచ్చు. బొల్లాపల్లి నుంచి పలుచోట్ల లిఫ్ట్లులు, రెండు సొరంగాలు నిర్మిస్తారు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు ఈ జలాలను తరలిస్తారు.
బనకచర్ల ప్రాజెక్ట్‌తో కలిగే ప్రయోజనాలు
గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఏపీ సశ్యశ్యామలం అవుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగమే కాకుండా పారిశ్రామిక రంగం, వలసల నివారణ, ఉపాధి అవకాశాలు కల్పించడం, తాగునీటి ఎద్దడి నివారణకు ఊతమిచ్చేలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు రూపకల్పన చేశారు. సుమారు 30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. 80 లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చవచ్చు. పరిశ్రమలకు కావాల్సిన నీటిని అందించే అవకాశముంటుంది. ఏపీలో కరవు అనేది లేకుండా చేయొచ్చు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం ఉండదు: సీఎం చంద్రబాబు
సముద్రంలోకి వృధాగా పోతున్న వరద నీటిని వినియోగించుకుంటామంటే అడ్డుచెప్పడంపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గోదావరిలో నీళ్లను ఇరు రాష్ట్రాలు వాడుకుంటున్నాయి. పోలవరం తప్ప మిగతావన్నీ అనుమతిరాని ప్రాజెక్టులే ఉన్నాయి. కృష్ణాలో తక్కువ నీటిపై గొడవ పడితే లాభం లేదని, కొత్త ట్రైబ్యునల్ వచ్చాక కేటాయింపుల మేరకు ముందుకెళ్లాలని ఆయన సూచించారు. గోదావరిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ నిర్మించుకోమని చెప్తున్నాం. వాళ్లు ప్రాజెక్టులు నిర్మించుకుంటే ఏపీ అడ్డుచెప్పదని స్పష్టం చేశాం. ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాలూ అభివృద్ధి కావాలనేది టీడీపీ లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణలో అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి టీడీపీ శ్రీకారం
ఉమ్మడి రాష్ట్రంలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వమే నిర్మించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను టీడీపీ పాలనలో (1983 -1989)లోనే ఆధునీకరించి విస్తరణ పురోగతి సాధించింది. సింగూర్ డ్యామ్ కాల్వల ఆధునీకరణతో హైదరాబాద్‌కు మంజీరా నదీజలాలు తాగునీరుగా అందుతున్నాయంటే.. అది అప్పటి సీఎం చంద్రబాబు కృషి ఫలితమే. అలాగే నాగార్జునసాగర్ నుండి హైదరాబాద్‌కు నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడానికి పైప్‌లైన్‌లు, పంపింగ్ స్టేషన్లు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల ఆధునీకరణ చేసిందీ టీడీపీ ప్రభుత్వమే. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చే క్రమంలో నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం కోసం నాగార్జునసాగర్ నీటిని సమర్థవంతంగా వినియోగించడంపై ఆనాడే సీఎం చంద్రబాబు దృష్టి సారించి, చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో విపరీతమైన ఫ్లోరైడ్ సమస్యవుంటే ఆ జిల్లా కోసం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. ఏఎంఆర్ విజయవంతం కాగానే దేవాదుల చేపట్టింది. అటు మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా బాబ్రీ ప్రాజెక్ట్ నిర్మిస్తుంటే అడ్డుకుంది, ఆందోళనకు దిగిందీ టీడీపీనే. ఇలా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన టీడీపీ.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటుందంటూ విమర్శలకు దిగడం హాస్యాస్పదం.
గోదావరి వరదలతో ఏటా రూ.2000 కోట్లు నష్టం
గోదావరి వరదల కారణంగా దిగువనున్న ఆంధ్రప్రదేశ్ ఏటా రూ.2000 కోట్లు నష్టపోతోంది. 2020లో భారీ వరదల కారణంగా రూ.8 వేల కోట్లకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం వాటిల్లింది. ఏటా 3 వేల టీఎంసీ వరద జలాలు వృధాగా గోదావరి నుంచి సముద్రంలో కలుస్తున్నాయి. వృధా జలాల నుంచి 200 టీఎంసీ నీటిని రాయలసీమకు బనకచర్ల ద్వారా తరలిస్తే కరవు ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు, సాగు విస్తరణా సాధ్యమవుతుంది. ఇలా దూరదృష్టితో తెలుగుతల్లికి జలహారతి పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ను ఎగువనున్న తెలంగాణ వ్యతిరేస్తోంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ప్రాజెక్ట్‌కు తెలంగాణ రాజకీయ పార్టీలు మొకాలడ్డుతున్నాయి. వృథాగా పోతున్న వరద జలాలను వినియోగించుకోవడంవల్ల ఎగువనున్న తెలంగాణకు ఎటువంటి నష్టం ఉండదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలున్న నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు పీబీ లింక్ ప్రాజెక్ట్‌ను బూచిగా చూపించి విమర్శలు చేస్తూ… తీవ్ర రాద్ధాంతం చేస్తున్నాయి. గోదావరి బెసిన్‌లో 1486 టీఎంసీలో 968 టీఎంసీ తమవని తెలంగాణ వాదిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు 518 టీఎంసీ జలాలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకునేలా అవకాశాలున్నా.. తెలంగాణలో ఏటా 800 టీఎంసీ దాకా నీటి వినియోగం జరుగుతుంది. కానీ ఏపీలో 300 టీఎంసీ నీటిని కూడా వినియోగించుకునే పరిస్థితులు లేవు. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా 194 టీఎంసీ వినియోగం మనకు అవకాశాలున్నాయి. కానీ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పోలవరం పనుల్లో ఎలాంటి పురోగతి లేక ఐదేళ్లపాటు ప్రాజెక్ట్ నిర్వీర్యమైంది. ఇప్పుడు ఈ జలాలు వినియోగించుకునే వీలు కూడా మనకు లేదు.
వరద జలాల వినియోగంతో నష్ట నివారణకు చర్యలు
గోదావరి వరదలవల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏటా భారీ నష్టం వాటిల్లుతోంది. వ్యవసాయ రంగంలో పంటలు ధ్వంసమవుతున్నాయి. వేల ఎకరాల ఉద్యానవన పంటలు దెబ్బతింటున్నాయి. వరదల వల్ల భూమి సారవంతం తగ్గి, రైతుల ఆదాయం కోల్పోతున్నారు. మౌలిక సదుపాయాలైన రహరులు, వంతెనలు దెబ్బతింటున్నాయి. విద్యుత్ వ్యవస్థ, భవనాలువంటివి దెబ్బతింటున్నాయి. అనారోగ్యాలు, పశు పోషణ ఇబ్బందులు ఇలా అన్ని రంగాల్లో వందల కోట్లు ఏటా ఏపీ ప్రభుత్వం నష్టాన్ని చవిచూస్తుంది. 2024లో రూ. 6,882 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. ఇలా వృథాగా పోతున్న గోదావరి వరద జలాలను బనకచర్లకు తరలించడం ద్వారా వరద తీవ్రతను కొంతలో కొంతైనా నియంత్రించవచ్చు.
వరద జలాలను వాడుకునే హక్కు ఏపీకి ఉంది
తెలంగాణ ప్రభుత్వం వారి ప్రాజెక్టులపైకంటే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టుంది. వారి ప్రాజెక్టులను వదిలేసి ఏపీ ప్రాజెక్టులపై డిటైల్డ్ ప్రజెంటేషన్లు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీటి పారుదల ప్రాజెక్టులపై ఎవరెంత రాజకీయం చేసినా రాజ్యాంగబద్ధంగా… వ్యవరించాల్సిన ప్రభుత్వాలు చివరికి నదీ జల వివాదాలపై ట్రిబ్యునల్ తీర్పులను ఖచ్చితంగా పాటించవలసిందే. కేవలం 200 టీఎంసీ నీటివినియోగంతో ఏపీ ప్రతిపాదించిన ప్రాజెక్టుపై గగ్గోలుపెట్టే బదులు ఈ క్రింది వాటిపై దృష్టి పెట్టండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 1,486 టీఎంసీ గోదావరి నికర జలాలను ఇరు తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలి. బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో క్లాజ్`4, క్లాజ్-7 ప్రకారం గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకు లోబడి ఎక్కడికైనా తరలించి వాడుకోవడానికి ఏపీకి హక్కుంది. అలాగే గోదావరి నదికి చిట్ట చివర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్.. గోదావరి వరద లేదా మిగులు జలాలను వినియోగించుకునే వెసులుబాటును బచావత్ ట్రిబ్యునల్ కల్పించింది. ఏటా సగటున 3 వేల టీఎంసీ గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని.. గోదావరి నదీ ప్రవాహనికి సంబంధించిన నివేదికలు చెబుతోంది. గత 50 ఏళ్ల గోదావరి వరద రికార్డులను చూస్తే ఏటా 3,100 టీఎంసీ నీరు సముద్రంలో వృథాగా కలిసినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
కేంద్రానికి ఫీజిబిలిటీ నివేదిక
పోలవరం- బనకచర్ల అనుసంధానానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి అన్ని కోణాల్లో అసరమైన చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల కోసం అవసరమైన టర్మ్ ఆఫ్ రిఫరెన్సులను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు చెందిన పర్వేష్ వెబ్‌సైట్‌లో నమోదు చేసింది. అలాగే కేంద్ర జలసంఘానికి ప్రీ ఫీజిబిలిటీ నివేదికను సమర్పించింది. ప్రీ ఫీజిబిలిటీ నివేదికను ఆమోదించిన తర్వాత ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక, నీటిపారుదల శాఖ అధికారులు కేంద్రానికి వివరించారు. పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
నదుల అనుసంధానంలో భాగమే బనకచర్ల ప్రాజెక్ట్
గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్‌లో నదుల అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తుంది. సీఎం చంద్రబాబు రూపొందించిన విజన్ 2047లో నదుల అనుసంధానంతో రాష్ట్రంలో జరగబోయే అభివృద్ధి, భవిష్యత్ తరాలకు ఉపయోగాలను క్లుప్తంగా వివరించారు. అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు రచించారు. ఈ ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్‌ను కరవురహిత రాష్ట్రంగా మార్చడానికి వీలవుతుంది.
ప్రవీణ్ బోయ
(అనలిస్ట్, టీడీపీ నాలెడ్జ్ సెంటర్ )