- 20 నుండి రీ సర్వే తిరిగి ప్రారంభం
- ఈ సారి పకడ్బందీగా నిర్వహణ
- దొంగ పాసు పుస్తకాల స్కాంలో నిందితులైన ఎమ్మార్వోలపై చర్యలు
- సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
- ప్రాంతీయ రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని సత్యప్రసాద్
మంగళగిరి (చైతన్యరథం): పేదలకు మేలు చేసేలా 22 ఏ భూములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏ జిల్లాలో ఎన్నెన్ని భూములు 22 ఏ కింద ఉన్నాయో, అవి ఏ కేటగిరీల కింద ఉన్నాయో మూడు రోజుల్లో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గత ప్రభుత్వంలో భూ యజమానులను ఇబ్బంది పెట్టి వారి భూములు లాక్కునేందుకు అక్రమంగా ఆ భూములను 22 ఏ కిందకు మార్చారని, వాటన్నింటినీ నిషేద జాబితా నుండి తొలగించాలని ప్రజా ప్రతినిధుల నుండి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నాడు జోన్ 2, జోన్ 3కి సంబంధించిన 11 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆ జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రెవెన్యూ అంశాలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా, సీసీఎల్ఏ జయలక్ష్మి, అడిషనల్ సీసీఎల్ఏ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమీక్ష అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 22ఏ అనేది ప్రధాన సమస్యగా మారిందని, గత ప్రభుత్వం 22ఏను దుర్వినియోగం చేసిందన్నారు. అక్రమంగా కొందరి భూములను 22ఏలో చేర్చారని తెలిపారు. వీటన్నింటకీ పరిష్కారంగా 22ఏ లో ఉన్న భూములపై నిషేధాన్ని త్వరలోనే తొలగిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో 22 ఏ జాబితాలో ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా నాలుగున్నర లక్షల ఎకరాలను నిషేధం నుండి తప్పించారని, వాటిల్లో ఏడు వేల ఎకరాలను అక్రమంగా రిజిస్టర్ చేశారని చెప్పారు. ఈ రిజిస్ట్రేషన్నింటీనీ రద్దు చేస్తామని చెప్పారు. వీటిల్లో అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు కూడా తీసుకుంటామన్నారు. కొందరు ఎమ్మార్వోలు అవినీతికి పాల్పడి దొంగ పాస్ పుస్తకాలు పుట్టించి బ్యాంక్ లోన్ కుంభకోణానికి కారణమయ్యారని, వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పకడ్బందీగా రీ సర్వే
ఈనెల 20 తేదీ వరకు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని మంత్రి అనగాని చెప్పారు. అప్పటి నుండి 45 రోజుల లోపు ఈ సదస్సుల్లో వచ్చిన వినతులను పరిష్కరిస్తామని తెలిపారు. ఈనెల 20 తేదీ నుండి రీ సర్వేను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఈసారి చాలా పకడ్బందీగా రీ సర్వే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతి మండలంలో గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని రీసర్వే చేస్తామని, ఇందులో అధికారులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొంటారని చెప్పారు. ఎలాంటి హడావిడి లేకుండా ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా రోజుకు 20 ఎకరాలు మాత్రమే ఒక టీమ్ రీ సర్వే చేస్తుందని చెప్పారు. రీ సర్వే జరిపిన గ్రామాల్లో సభలు నిర్వహిస్తే లక్షా 80 వేల ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నంటినీ కూడా పరిష్కరించి వారికి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తామని చెప్పారు. మిగిలిన వారికి సంక్రాంతి పండుగ తర్వాత కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ పాస్ పుస్తకంపై రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్ ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
ప్రాంతీయ సదస్సుకు మంత్రులు కొలుసు పార్థసారధి, గొట్టిపాటి రవికుమార్ కూడా హాజరయ్యారు. వీరితో తోపాటు హాజరైన ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ 22 ఏ జాబితాలో అక్రమంగా ప్రజల భూములను చేర్చారని, వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అలాగే ఈనామ్, ఎస్టేట్ బూములను సెటిల్ చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఫారెస్ట్, రెవెన్యూ భూముల మద్య స్పష్టమైన సరిహద్దులను నిర్ణయించాలని కోరారు. పట్టణాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న సామన్యులకు త్వరితగతిన రెగ్యులరైజ్ చేయాలని కోరారు. జగన్న కాలనీల్లో అవినీతిని వెలికి తీసి నిజమైన లబ్ధిదారులకు త్వరగా ఇళ్ల పట్టాలను మంజూరు చేయాలని కోరారు.