- దేశానికే గర్వకారణం
- నీరజ్ చోప్రాకు సీఎం చంద్రబాబు అభినందనలు
అమరావతి (చైతన్యరథం): జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాను సీఎం చంద్రబాబు అభినందించారు. 90 మీటర్లకు పైగా జావెలిన్ విసిరి చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడని ప్రశంసించారు. నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్‌లో జావెలిన్ 90.23 మీటర్లు విసిరి సరికొత్త రికార్డు సృష్టించి, ఈ పోటీల్లో రెండో స్థానంలో నిలిచాడు. తొలిసారి కెరీర్‌లో 90 మీటర్ల మార్క్ ను అధిగమించాడు. జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్ 91.06 మీటర్లుతో ప్రథమ స్థానంలో నిలిచాడు. కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన నీరజ్ చోప్రాను ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందించారు. నీరజ్ ఈ మైలురాయిని అధిగమించడం ద్వారా భారత క్రీడా ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాడన్నారు. అతడి ప్రదర్శన దేశానికే గర్వకారణమన్నారు. అతడి కఠోరశ్రమ, అంకిత భావం, క్రమశిక్షణకు తగిన ఫలితం దక్కిందన్నారు.