అమరావతి (చైతన్యరథం): తనకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ అగ్ర కథానాయకుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గానూ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఆయన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. నా తండ్రి దివంగత మహానటుడు ఎన్టీఆర్ వారసుడిగా నా సుదీర్ఘ ప్రయాణంలో పాలుపంచుకున్న తోటి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, పంపిణీదారులకు ఎగ్జిబిటర్లకు, కుటుంబ సభ్యులకు, యావత్ చలనచిత్ర రంగానికి నా ధన్యవాదాలు. నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న నా అభిమానులకు, నాపై విశేష ఆదరాభిమానాలు కురిపిస్తున్న ప్రేక్షకులకు సదా రుణపడి ఉంటానని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ఆయన అభినందనలు తెలియచేశారు. ఇలా ఉంటే బాలకృష్ణకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించడంపై సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.