న్యూఢిల్లీ: తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ, అగ్రనటుడు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ పురస్కారం పొందారు. ప్రదానోత్సవ కార్యక్రమానికి బాలయ్య తెలుగుదనం ఉట్టి పడేలా పంచె కట్టుతో హాజరయ్యారు. సినీ రంగానికి బాలకృష్ణ సేవలను గుర్తించి కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
తెలుగు జాతికి, భాషకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో వందకు పైగా చిత్రాలలో నటించారు. ఇప్పటికీ యువ కథానాయకులకు దీటుగా వరుస సినిమాల్లో నటిస్తూ తన క్రమశిక్షణను, కళామతల్లిపట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుకుంటున్నారు. మాస్, యాక్షన్ చిత్రాలతో పాటు, పౌరాణిక, చారిత్రక, సాంఘిక.. ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక అగ్ర నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మది దోచుకున్నారు. గతంలో కూడా అనేక ఫిలింఫేర్, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు. పరోపక్క క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. హిందూపూర్ నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు.
తెలుగుదనం ఉట్టిపడేలా..
తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు బాలకృష్ణ. ఢల్లీిలోని మాన్సింగ్ రోడ్డు నుంచి రాష్ట్రపతి భవన్‌కు కుటుంబంతో కలిసి ఆయన బయలుదేరారు.