- శాంతి,భద్రతలను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం
- విశాఖ సెంట్రల్ జైల్లో ఘటనలపై విచారణ
- బాధ్యులపై కఠినచర్యలు
- హోం మంత్రి అనిత స్పష్టీకరణ
విశాఖపట్నం (చైతన్యరథం): గత ప్రభుత్వ నిర్వాకం వల్లనే జైళ్లలో పరిస్థితులు దారుణంగా మారాయని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. గత వైసీపీ పాలనలో శాంతి,భద్రతలను గాలికొదిలేశారని మండిపడ్డారు. విశాఖ సెంట్రల్ జైలులో ఖైదీల వద్ద సెల్‌ఫోన్ కనిపించిందన్న ఆరోపణలు రావటంతో ఆమె ఆదివారం సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తున్నామన్నారు. ఈ జైలు లోపల చోటుచేసుకున్న వివాదాస్పద ఘటనలపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఇప్పటికే కొంతమందిని విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇతర జైళ్లకు బదిలీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్లే జైళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు. పది రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇటీవలే జైలులో సెల్ ఫోన్లు బయటపడ్డాయి. అవి బయటపడిన చోట కూడా పరిశీలించాం. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఫోన్‌లో ఎవరు ఎవరితో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అనిత తెలిపారు.
జైల్‌లో గంజాయి మొక్క
జైల్‌లో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉద్యోగులను బదిలీలు చేస్తామని, ఇప్పటి వరకు ఎవ్వరినీ సస్పెండ్ చేయలేదని ఆమె తెలిపారు. యూనిఫాం సర్వీసులో ఉన్నవారు ధర్నాలో, బందులో పాల్గొనకూడదన్నారు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్‌ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటామని, సెంటర్ జైల్లో పదిరోజులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖ సెట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్‌కు తరలిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాల్లో ప్రజా ప్రతినిధులెవరూ సెంట్రల్ జైల్‌ను సందర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు.
కాగా విశాఖ సెంట్రల్ జైలు భద్రత, కదలికలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లోని బ్యారెక్స్‌ల్లో జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు ఆధ్వర్యంలో జైల్లోని అన్ని బ్లాక్‌ల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి జరిపిన తనిఖీల్లో మూడు సెల్ ఫోన్లు, ఒక సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుళ్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడిరచారు. విశాఖ మాజీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్ కుమార్ సెల్‌లో నాలుగు రోజుల క్రితం రెండు సెల్ ఫోన్లు, బ్యాటరీ, రెండు డేటా కేబుళ్ళు దొరికాయి. శనివారం నర్మదా బ్లాక్ లో జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అనిత తాజాగా విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు.