- పక్క రాష్ట్రాలకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలుంటే ఏపీకి చంద్రబాబు ఉన్నారు
- ఆయన పేరే రాష్ట్రానికి అడ్వాంటేజ్
- యువగళం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నా
- విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు ఖాయం
- ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరం
- వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు
- జగన్ రెడ్డి వైసీపీ మాత్రమే నాయకుడు, చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం
- ఇండియా టుడే కాంక్లేవ్ లో మంత్రి నారా లోకేష్
న్యూఢల్లీి (చైతన్యరథం): కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే.. ఏపీకి చంద్రబాబు పెద్ద అడ్వాంటేజ్ అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఢల్లీిలో ఇండియా టుడే గ్రూప్ ఆధ్వర్యంలో జరిగిన కాంక్లేవ్‌లో శనివారం మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. యువగళం పాదయాత్ర ద్వారా చాలా నేర్చుకున్నాను. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిపూర్ణత సాధించాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నా బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తున్నాను. స్టాన్‌ఫోర్ట్ ఎంబీయే బిజినెస్‌కు మంచిది. రాజకీయాలకు పాదయాత్ర చాలా ముఖ్యం. పాదయాత్ర రాజకీయాల్లో ఎంబీయే వంటిది. పాదయాత్ర ద్వారా సమస్యలను మరింత బాగా అర్థం చేసుకోగలగుతున్నాను. నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు ప్రజలతో మమేకం అవుతున్నానని మంత్రి లోకేష్ చెప్పారు.
విశాఖపట్నంలో డేటా సెంటర్
విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటుచేస్తాం. ఇందులో మరో ఆలోచనకు తావులేదు. వైటూకే విప్లవంలో హైదరాబాద్, దేశం లబ్ధి పొందాయి. ఇప్పుడు ఏపీ వంతు. రాష్ట్రంలో నైపుణ్యం గలిగిన మానవ వనరులు ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకువెళ్తున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కేజీ నుంచి పీజీ వరకు కరిక్యులమ్‌లో మార్పులు తీసుకువస్తున్నాం. వాట్సప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలనే ఆలోచన పాదయాత్రలో వచ్చింది. ఈ నెలాఖరునాటికి 350 సేవలను మనమిత్ర ద్వారా ప్రజలకు అందించనున్నాం. కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్లు, ఇతర పత్రాలు, ల్యాండ్ రికార్డులను సులభంగా వాట్సాప్ సేవలో పొందవచ్చు. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్‌లో మరిన్ని సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగానికి అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రి లోకేష్ అన్నారు.
సవాల్‌గా నైపుణ్య గణన
కర్టాటకకు బెంగుళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ నగరాలు ఉన్నాయి. కానీ ఏపీకి మాత్రం చంద్రబాబునాయుడు ఉన్నారు. ఆయనే మాకు అడ్వాంటేజ్. ఈ శుక్రవారం టాటా పవర్‌తో 7 గిగా వాట్ల ఒప్పందం జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. నైపుణ్యగణన కంటే కులగణన చాలా సులభం. రాష్ట్రంలో నైపుణ్య గణనను ఛాలెంజ్‌గా తీసుకుని పనిచేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం
త్రిభాషా విధానంతో మాతృభాషకు అన్యాయం జరుగుతుందని భావించడం లేదు. భారతదేశంలోని భాషా వైవిధ్యమే దానిని అడ్డుకుంటుంది. ఏపీలో తెలుగుభాషను ప్రమోట్ చేస్తున్నాం. స్థానిక భాష తెలుగు. మాతృభాషల బలోపేతానికి ఎన్డీయే ప్రభుత్వం కృషిచేస్తోంది. హిందీని బలవంతంగా రుద్దుతారని భావించడం లేదు. నర్సులు, హోం కేర్ ల కోసం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో పలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఆ భాషలను సైతం నేర్చుకోవాలి. ఆధునిక ప్రపంచంలో బహుళ భాషలు నేర్చుకోవడం అవసరం. ఎన్డీయేకు మేం బేషరతుగా మద్దతు ఇస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాపై అక్రమంగా 23 కేసులు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. వైసీపీ హయాంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవు. వైసీపీ హయాంలో నిరసన తెలిపేందుకు కూడా అవకాశం లేదు. మా ఇంటి గేట్లకు తాళ్లు కట్టారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్తున్నారు. నేడు డిప్యూటీ సీఎం కంటే జగన్‌కు భద్రత ఎక్కువ ఉంది. వైసీపీ పాలనలో మద్యంలో అవినీతి, ఇసుక అక్రమ మైనింగ్ జరిగింది. సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.
సంఖ్యా బలం లేకుండా ప్రతిపక్ష హోదా రాదు
90ల్లో అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు జరిగేవి. నేడు అలాంటి చర్చలు లేకపోవడం బాధాకరం. జగన్ రెడ్డి వైసీపీకి మాత్రమే నాయకుడు. శాసనసభలో ప్రతిపక్ష హోదా ఉండాలంటే మొత్తం సభ సంఖ్యాబలంలో పదిశాతం ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వలేం. మేం చట్టాలను గౌరవిస్తాం. పార్లమెంట్, శాసనసభలో ఉండే నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తామని మంత్రి లోకేష్ ప్రశ్నించారు.
భారీ మెజార్టీతో గెలుపొందా
1985 నుంచి తెలుగుదేశం పార్టీ గెలుపొందని మంగళగిరి నుంచి పోటీచేసి 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూశాను. 2024 ఎన్నికల్లో పోరాడి 91వేల భారీ మెజార్టీతో గెలిచాను. ఏపీలో ఇది మూడో అత్యధిక మెజార్టీ. గెలిచిన తరువాత సవాళ్లతో కూడిన హెచ్‌ఆర్డీ శాఖను ఎంచుకున్నానన్నారు.
మహిళలనుంచి ఎంతో నేర్చుకోవాలి
మహిళల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మహిళా దినోత్సవం పేరుతో ఒక్క రోజు కాదు. సంవత్సరంలో అన్ని రోజులూ జరుపుకోవాలి. నా భార్య బ్రాహ్మణి విషయానికి వస్తే అన్ని విషయాలూ ఎంతో సమర్థవంతంగా చేస్తుంది. 1990 దశకంలో నా తండ్రి చంద్రబాబు ప్రారంభించిన హెరిటేజ్ కంపెనీని ఆమె చూసుకుంటున్నారు. నా కుమారుడిని, నన్ను కూడా జాగ్రత్తగా చూసుకునేది ఆమే. నా క్రెడిట్ కార్డు బిల్లు కూడా నా భార్య బ్రాహ్మణి చెల్లిస్తుంది.మహిళల పట్ల మన దృక్పథం మారాలనే ఉద్దేశ్యంతో మానవ వనరుల శాఖ మంత్రిగా పాఠ్యాంశాలను కూడా మారుస్తున్నాను. మహిళా దినోత్సవం ఒక్క రోజు మాత్రమే కాదు …ప్రతిరోజూ జరుపుకోవాలని మంత్రి లోకేష్ అన్నారు.