అమరావతి: సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఉత్తరాంధ్ర ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు ఊపిరిగా నిలిచిన నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవిని అలంకరించడం సంతోషంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆయ్యన్న పాత్రుడు స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం అసెంబ్లీలో సత్యకుమార్ మాట్లాడుతూ తొలిసారి సభకు ఎన్నికైన తనలాంటి వారికి స్పీకర్గా మార్గదర్శకత్వం చేయాలని కోరారు. సభాపతిగా ఆయన పేరును నామినేట్ చేసే అవకాశం కలగడం తన అదృష్టమని చెప్పారు. మొదటిసారి సభలో అడుగుపెట్టిన తనకు ప్రసంగించే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పారు. అయ్యన్న పాత్రుడు రాజకీయ జీవితంలో ప్రజల పక్షాన నిలబడి ఎన్నో అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించి అడ్డుకున్నారని కొనియాడారు. మరీ ముఖ్యంగా గత ఐదేళ్ల అరాచక పాలనలో అయ్యన్న పాత్రుడు ఎన్నో ఇబ్బందులను, అరాచకాలను ఎదుర్కొంటూ ప్రజల పక్షాన పోరాడారని గుర్తుచేశారు. ప్రజల గొంతుకై ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటిన అయ్యన్న పాత్రుడికు సభాముఖంగా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజల వాణిని తనదైన బాణిలో వినిపించారని, రాజ్యాంగబద్ధ పదవి కారణంగా అటువంటి వాడి,వేడిని ఇక చూడలేకపోవడం కొంత లోటుగానే భావిస్తున్నట్లు చెప్పారు.
అభివృద్ధికి చిరునామాగా ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ పాలనలో అవినీతికి చిరునామాగా మారిందని సత్యకుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టడానికి, ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నడుం బిగించారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వారిద్దరూ అభివృద్ధి బాటలో నడిపిస్తారనే నమ్మకం తనకుందన్నారు. రాష్ట్ర ప్రగతికి తీసుకొచ్చే బిల్లులపై సభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందని, దీనికి అయ్యన్న పాత్రుడి రాజకీయ అనుభవం ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.