- ‘అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు – 2025 ప్రదానం
- హెరిటేజ్ సంస్థకు ఇండియన్ డెయిరీ అసోసియేషన్ అవార్డు ప్రకటన
- పాడి రైతుల సాధికారత, డెయిరీ ఎకో సిస్టం అభివృద్ధిపై భువనేశ్వరి కృషికి గుర్తింపు
- రైతుల సహకారం,హెరిటేజ్ బృందం కృషితోనే అవార్డు: హెరిటేజ్ వీసీ, ఎండీ భువనేశ్వరి
కోజికోడ్/కేరళ (చైతన్యరథం): డెయిరీ రంగంలో విశేష కృషి చేసినందుకు, పాడి రైతుల సాధికారత కోసం పని చేసినందుకు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. నారా భువనేశ్వరికి అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు -2025ను ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ప్రదానం చేసింది. సమాజంలోని పలు వర్గాలకు వివిధ సేవలు అందిస్తున్నందుకు యూకేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ గత ఏడాది డిస్టింగ్విష్డ్ ఫెలో షిప్-2025 అవార్డుతో భువనేశ్వరిని సత్కరించింది. అలాగే ఆమె నేతృత్వంలో నడిచే హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు దక్కింది. ఇప్పుడు దేశంలోనే పేరు గాంచిన ఇండియన్ డెయిరీ అసోసియేషన్కు చెందిన సౌత్ జోన్ విభాగం.. అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు – 2025 అవార్డును ప్రకటించింది. డెయిరీ పరిశ్రమ అభివృద్ధిలో ఆమె నాయకత్వం, రైతుల సాధికారతకు చేసిన విశేష కృషి, డెయిరీ ఎకోసిస్టం కల్పించడాన్ని గుర్తిస్తూ ఈ అవార్డు అందజేశారు. కేరళలోని కోజికోడ్లో కాలికట్ ట్రేడ్ సెంటర్, డాక్టర్ వర్గీస్ కురియన్ నగర్ లో నిర్వహించిన సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్ క్లేవ్ -2026 ప్రారంభ సమావేశంలో ఈ అవార్డు ప్రదానం చేశారు. నారా భువనేశ్వరి తరపున హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ సీఈఓ కేశవన్ ఈ అవార్డును స్వీకరించారు. కేరళ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి జే చించు రాణి అవార్డును అందజేశారు. నారా భువనేశ్వరి నాయకత్వంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ స్థిరమైన డెయిరీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి, రైతు వ్యవస్థలను బలోపేతం చేస్తూ, నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తూ పరిశ్రమలో విశిష్ట స్థానాన్ని సంపాదించిందని జ్యూరీ ప్రశంసించింది.
మా సంకల్పానికి మరింత ప్రొత్సాహం: నారా భువనేశ్వరి
సదరన్ డెయిరీ అండ్ ఫుడ్ కాన్ క్లేవ్ ‘అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ –2025′ అందుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన నిరంతర కృషికి, రైతులు, ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపు అన్నారు. కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ, స్థిరమైన విధానాలను అమలు చేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలనే మా సంకల్పానికి ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. ఈ గౌరవం హెరిటేజ్ ఫుడ్స్ బ్రాండ్ ప్రతిష్ఠను మరింత పెంచడమే కాకుండా, ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందిస్తూ, డెయిరీ, ఎఫ్ఎంసీజీ రంగాల్లో హెరిటేజ్ ఫుడ్స్ అగ్రగామిగా కొనసాగుతున్నదనేందుకు నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు. సుస్థిర పద్ధతులు, డెయిరీ ఎకోసిస్టమ్ బలోపేతానికి కట్టుబడి ఉండే నిబద్ధతను ఈ అవార్డు మరింత పెంచుతుందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి తెలిపారు. కేరళలోని కోజికోడ్ లో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి కేరళ, తమిళనాడు డైరీ అభివృద్ధి శాఖ మంత్రులు సహా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, తదితరులు హాజరయ్యారు.

















