- రూ. 150 కోట్ల పెట్టుబడికి ఆర్వెన్సిస్ గ్రూప్ ఆసక్తి
- ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటితో సంస్థ ప్రతినిధుల బృందం భేటీ
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఆర్వెన్సిస్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ మేరకు తాడేపల్లిలో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఆ సంస్థ ప్రతినిధులు గురువారం భేటీ అయ్యి చర్చించారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న విస్తృత అవకాశాలను ఆర్వెన్సిస్ గ్రూప్ సంస్థ ప్రతినిధులకు మంత్రి గొట్టిపాటి వివరించారు. ప్రభుత్వం వైపు నుంచి పెట్టుబడిదారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆర్వెన్సిస్ ప్రతినిధులు రాష్ట్రంలో తొలుత ఒక సీబీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు. 12 ` 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్లాంట్‌ను సుమారు రూ. 150 కోట్ల పెట్టుబడితో నెలకొల్పుతామని మంత్రికి వివరించారు.
పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. ఆర్వెన్సిస్ సీబీజీ ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఆర్వెన్సిస్ గ్రూప్ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి అభినందించారు.