- ఏపీ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరింది
- ఏడు రోజుల్లో విస్తృత భేటీలు
- ఎన్నో కొత్త ఆలోచనలు పంచుకున్నాం
- ఎక్స్ లో మంత్రి నారా లోకేష్
అమరావతి (చైతన్యరథం): ఆస్ట్రేలియాలో ఏడు రోజుల పర్యటనతో.. ఆంధ్రప్రదేశ్ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరిందని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సాగింది. ఏడు రోజుల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన లోకేష్.. వివిధ సంస్థలు, యూనివర్సిటీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించారు. ఆస్ట్రేలియా పర్యటన ముగిసిన సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శనివారం మంత్రి లోకేష్ స్పందించారు. ఆస్ట్రేలియా పర్యటనపై పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
ఆస్ట్రేలియాలో ఏడు రోజుల పర్యటన ముగిసింది. ఏపీ ప్రగతి దిశగా కొత్త భాగస్వామ్యాలపై నమ్మకం కుదిరింది. నాలుగు నగరాల పర్యటనలో విశ్వవిద్యాలయాల సందర్శన, పారిశ్రామికవేత్తలతో భేటీలు.. ఇండియా-ఆస్ట్రేలియా కౌన్సిళ్లు, సముద్ర ఆహార వాణిజ్య సంస్థలు, క్రీడా సముదాయాల ప్రతినిధులతో సమావేశాలు.. ఈ పర్యటనను మరింత సార్ధకంగా, అవగాహనాత్మకంగా మార్చాయి. మనం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు సాగుతున్న దశలో మన శ్రామిక శక్తి మరింత బలోపేతం చేయడానికి ఉన్న అవకాశాలు పరిశీలించాను. పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాను. క్రీడలను కూడా ఆర్థిక వృద్ధి కార్యకలాపాలకు శక్తివంతమైన రంగంగా అభివృద్ధి చేసే అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. ఈ పర్యటన నుంచి ఎన్నో కొత్త అనుభవాలు, ఆలోచనలు తీసుకువెళ్తున్నాను.ఈ పర్యటన ఫలాలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనకరమైన భాగస్వామ్యాలుగా మారతాయని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.










