- చెవిరెడ్డి, అయన తనయుడే సూత్రధారులు
- చంద్రగిరి, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట హింసకు కారకులు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే
- అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి
- సీఈఓకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు
అమరావతి(చైతన్యరథం): మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేట, తాడిపత్రి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులపైనా, వారి ఆస్తులపైనా వైసీపీ గూండాలు వరుస దాడులకు పాల్పడుతున్నారని, వీటిని అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ ఘటనలకు ఆయా నియోజకవర్గాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులే సూత్రధారులన్నారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రధాన అధికారి(సీఈఓ)కి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. తాజాగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తిరుపతిలోని మహిళా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు వస్తుండగా వైసీపీ గూండాలు రాడ్లు, సుత్తులతో దాడికి పాల్పడ్డార న్నారు. ఈ దాడిలో పులివర్తి నానితోపాటు, అతని సిబ్బందికి గాయాలయ్యాయి. పట్టపగలే పులివర్తి నానిపై జరిగిన దాడి శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం. హతమార్చే ఉద్దేశంతోనే నానిపై వైసీపీ మూకలు దాడి చేశారు.
వైసీపీ మూకల దాడిని ఖండిస్తూ నిరసన చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై, వార్తల సేకరణకు వచ్చిన మీడియా సిబ్బంది పైనా పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గం. ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ కొంతమంది మీడియా ప్రతినిధులపై కావాలని టార్గెట్ చేసి దాడి చేశాడు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు, ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డిలే ఈ దాడికి పురికొల్పారు. పులివర్తి నానిపై దాడికి పాల్పడిన వారు వీడియోలలో చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. మోహిత్ రెడ్డి కొన్ని గ్రామాల్లో సైతం టీడీపీ వారిపై దాడికి ప్రోత్సహించి కొట్టినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కై పులివర్తి నాని స్ట్రాంగ్ రూమ్ కి వస్తున్న సమయాన్ని వారికి చేరవేశారు. పులివర్తి నాని గన్మెన్ గాలిలోకి కాల్పులు జరపకుండా ఉండివుంటే పట్టపగలే ఆయన హత్యకు గురయ్యేవాడు. అయినా ఇప్పటికీ ఈ ఘటనపై పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు.
తాడిపత్రిలో వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రైవేటు సైన్యం.. సూర్యముని అనే టీడీపీ నాయకుడి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అంతేకాకుండా కేతిరెడ్డి గూండాలు రామకృష్ణ అనే అదనపు ఎస్పీపై కూడా దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లపై మరిన్ని దాడులు చేసేందుకు వైసీపీ నేతలు పథకం వేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ అదనపు బలగాలను మోహరించాలి.
మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కారంపూడి గ్రామంలో టీపీపీ ఆఫీసును, నాయకులు, కార్యకర్తల ఇళ్లను ధ్వంసం చేశారు. వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నందున వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని అరెస్టు చేయండి. మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి నియోజకవర్గాల్లో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఈ నియోజకవర్గాల్లో అదనపు కేంద్ర బలగాలను ఏర్పాటు చేయండి. దాడులకు ప్రేరేపించిన వైసీపీ నాయకులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈఓను వర్ల రామయ్య డిమాండ్ చేశారు.