- మార్పు ఇంటినుంచే మొదలవ్వాలి
- నూతన ఉపాధ్యాయుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు
అమరావతి (చైతన్యరథం): యువతకు ఇచ్చిన మాట ప్రకారం అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరతామని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మహిళలను గౌరవించటం అనేది ఇంటినుంచే మొదలుకావాలన్నారు. అప్పుడే సమాజంలోనూ మార్పు వస్తుందన్నారు. అమరావతితో గురువారం జరిగిన మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ బదులిచ్చారు.
1) సుమన్ నలుకుర్తి, గుంటూరు
నేను స్కూల్ అసిస్టెంట్ విభాగంగా జిల్లా 2వర్యాంకు సాధించాను. ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మీరు హామీ ఇచ్చారు. దీన్ని సాధించడానికి మీ వద్ద ఎటువంటి రోడ్ మ్యాప్ ఉంది?
నారా లోకేష్: యువగళం యాత్రలో జీడీ నెల్లూరు
నియోజకవర్గంలో ఒక గ్రామానికి వెళ్లాను. మోహన అనే తల్లి అక్కడ బోండాలు వేస్తోంది. ఆ తల్లిని మేం వచ్చాక ప్రభుత్వం నుంచి ఏమి ఆశిస్తున్నారని అడిగాను. భర్త మద్యానికి బానిసై చనిపోయాడు. 30ఏళ్లు కష్టపడి పిల్లలను చదివించా. వారికి ఉద్యోగాలు ఇవ్వండి చాలు అని కోరింది. ఆరోజే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించా. అందుకే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20లక్షలు కల్పిస్తానని హామీ ఇచ్చాను. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనవద్ద ఉన్న ఒకే ఒక ఆయుధం విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు. 2 వది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. దీనివల్లే దక్షిణ భారతంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తొలి ఏడాదిలోనే రూ.10లక్షల కోట్లు పెట్టుబడులు సాధించాం. కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆకలి, కసి, పట్టుదలతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలందరం కలసికట్టుగా పనిచేస్తున్నాం.అహర్నిశలు కష్టపడి ఇచ్చిన మాట ప్రకారం అయిదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం.
2) బోకం అనిత, విశాఖపట్నం.
మీరు డీఎస్సీ ప్రకటించడం వల్ల నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను. మీరు తరచుగా జెండర్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుతున్నారు. జెండర్ సెన్సిటివిటీని పాఠ్యాంశాల్లో చేర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? మీ నాయకత్వంలో లింగ సమానత్వం అమలుకు చేపడుతున్న చర్యలు ఏమిటి?
నారా లోకేష్: బ్రహ్మణికి, నాకు చిన్నవయసులో
పెండ్లి అయింది. ఇప్పుడే ఆమె హెరిటేజ్ ఎండి అయింది. సమాజంలో మార్పురావాలంటే ముందు మన ఇంట్లో మార్పురావాలని నేను బలంగా నమ్ముతాను. మా తాత నుంచి చంద్రబాబు వరకు చూస్తూ ఇంట్లో మహిళలను గౌరవించడం నేర్చుకున్నా. నేను ఎన్నో దేశాలు, రాష్ట్రాలు తిరిగా. మహిళలకు గౌరవం కేవలం చట్టాలు చేయడంతోనే రాదు, ప్రతిఒక్కరూ వారిని గౌరవించాలి. నేను విద్యామంత్రి అయ్యాక పాఠ్యాంశాల ఫోటోల్లో మార్పులు చేశా. కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సివిటీ క్లాసులు తేవాలి. అమ్మాయిలా ఏడవద్దు, చీరకట్టుకున్నావా అనే పదాలు వాడకూడదు. ప్రజాప్రతినిధులు మహిళలను గౌరవించాలి. అప్పుడే సమాజంలో మార్పు వస్తుంది. రాబోయే నాలుగేళ్లలో కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు నిర్వహిస్తాం. సినిమాలు, టీవీ షోల్లో మహిళలను అగౌరవపర్చే డైలాగులు ఉండకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా..