- జనవరి 10 నుంచి 19 వరకు ఉత్తరద్వార దర్శనం
- వీఐపీ బ్రేక్ (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు
- అధికారులతో అడిషనల్ ఈవో సమీక్ష
తిరుమల (చైతన్యరథం): తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు టీటీడీ సమాయత్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండటంతో, 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ కల్పించనుంది. ఇందుకు నలభై రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులను అడిషనల్ ఈఓ ఆదేశించారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోటా, ఇతర అంశాలపై మరో రెండు వారాల్లో మరో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశికి అవసరమైన పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు.
ఆ పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు (ప్రోటోకాల్ వీఐపీలు మినహా), చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయాలని నిర్ణయించారు. జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు, 11న చక్ర స్నానం ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్య నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.