పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుచేసి, ఆయా స్టాల్స్‌లో అరకు కాఫీతోపాటు వివిధ అటవీ ఉత్పత్తులను ప్రదర్శించి అరకు కాఫీకి ఈ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అభినందనీయం. పార్లమెంట్‌లో స్టాల్స్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషే కారణం. గిరిజనులు పండిరచే భౌగోళిక ప్రత్యేక గుర్తింపువున్న అరకు కాఫీ బ్రాండ్‌ను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం తీసుకొన్న చొరవకు అన్ని వైపులనుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అరకు కాఫీని అత్యంత ప్రాధాన్య ఉత్పత్తిగా సీఎం చంద్రబాబు చేపట్టిన విస్తృత కార్యక్రమాలవల్ల ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. అంతర్జాతీయ వేదికలపై సీఎం చంద్రబాబు అరకు కాఫీ అద్భుత రుచిని గుర్తుచేస్తూ కాఫీ ప్రతిష్ఠను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో అరకు కాఫీ రుచిగురించి మాట్లాడటం విశేషం. విశాఖ మన్యంలో వందల ఎకరాల్లో మొదలైన కాఫీ సాగు నేడు లక్షల ఎకరాల్లో గిరిజనులు కాఫీ తోటలను సాగు చేస్తున్నారు. అటవీశాఖ పరిధిలో మరో పదివేల ఎకరాలకు పైగా పంటసాగు అవుతుంది. దీనిద్వారా ప్రతి ఏడాది 10,500 టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిని గిరిజన సహకార సంస్థతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మన్యంలో పండుతున్న అరకు కాఫీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణం. ఆ మధ్య ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ప్రిక్స్ ఎపిక్యూర్ -2018 బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది అరకు కాఫీ. మార్కెట్‌లో కాఫీ ప్రసిద్ధ బ్రాండ్లుగా పేరొందిన సుమత్రా, కొలంబో రకాలతో పోటీపడి బంగారు పతకం సాధించిన తొలి భారతీయ కాఫీ మిశ్రమంగా సత్తా చాటింది అరకు కాఫీ.
భారతదేశంలో కాఫీ పంట దిగుబడి అత్యధికంగా కర్ణాటక తరువాత తమిళనాడులో దిగుమతి అవుతుంది. అయితే ఆ రాష్ట్రాలను అధిగమించి దేశంలోనే రికార్డును సృష్టించాలని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విశాఖలో నిర్వహించిన బ్రిక్స్ సదస్సు, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూవంటి ముఖ్య కార్యక్రమాల్లో సైతం దేశ, విదేశీయులు సైతం ఇక్కడి కాఫీ రుచి చూశారు. దీంతో ప్రపంచ దేశాల్లో విశాఖ కాఫీకి విశేష ఆదరణ పెరిగింది. ఈవిధంగా దేశంలో పలు రాష్ట్రాల్లో పెద్దపెద్ద మాల్స్, కార్పొరేట్ సంస్థల ద్వారాను కాఫీ గింజల అమ్మకాలు సాగించగలుగుతున్న జీసీసీ ఇకపై మరింతగా వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించింది. విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, అరకు ప్రాంతాల్లో కాఫీ పంటకు మంచి అనుకూల వాతావరణం వుంది. కర్ణాటక, కేరళ రాష్ట్రాలతో పోలిస్తే ఉత్పత్తి తక్కువే అయినా నాణ్యత ఎక్కువ ఉండటంతో మన్యం కాఫీకి డిమాండ్ వుంది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల్లో పండిరచే కాఫీని అరకు కాఫీ అంటారు. ప్రస్తుతం మన్యంలో పార్చిమెంట్ అంబికా చెర్రీ, రోబస్టా రకాలు పండుతున్నాయి. అరబికా రకానికి ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంది. విదేశాల్లో గిరాకీవున్న సేంద్రీయ కాఫీ సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. జీసీసీ, ఐటీడీఏ, కాఫీబోర్డులు గిరిజనుల్లో చైతన్యం నింపి సేంద్రీయ పద్ధతులను ఆచరించేలా సహకరిస్తున్నాయి. విశాఖ మన్యం నాంది ఫౌండేషన్ మొదటిసారిగా సేంద్రియసాగును అమలులోకి తెచ్చి ఆ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంలో చొరవ చూపింది.
ఇలా పారిస్‌లోనూ అరకు కాఫీ షాపు ఏర్పాటైంది. విదేశాల్లో అరకు పేరుతో ప్రత్యేకంగా ఒక కాఫీ షాపు తెరిచారు. ప్రిక్స్ పెపిక్యూర్ పోటీల్లో బంగారు పతకం సాధించడం ద్వారా ఈ కాఫీ షాపు మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఏర్పడిరదని చెప్పుకోవాలి. నాంది ఫౌండేషన్ సహకారంతో గిరిజన ఉత్పత్తి అయిన అరకు కాఫీ విస్తరిస్తున్న తీరు సంతోషాన్ని కలిగిస్తుందని పారిస్ కేఫ్‌ల్లోని ఎలక్ట్రానిక్ స్క్రీన్‌లపై అరకు గిరిజనుల జీవన శైలికి సంబంధించిన చిత్రాలు, వీడియోలు ప్రదర్శిత మవుతున్నాయి. చంద్రబాబు ఆలోచనలు అద్భుతంగా వుంటాయని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రశంసించారు. పారిస్‌లో మా అరకు కాఫీ రెండో స్టాల్ ఇది అని రానున్న రోజుల్లో మరిన్ని రాబోతున్నాయని, ప్రపంచమంతా అరకు కాఫీతో మెల్కోంటుంది అని సీయం చంద్రబాబు స్పందించారు. అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపురావడం స్పూర్తిదాయకం అన్నారు చంద్రబాబు. గిరిజన అరకు కాఫీని దేశీయంగా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కృషి చేస్తున్నది. ఇప్పటికే విశాఖపట్నం విమానాశ్రయంలో కాఫీ షాపు ఏర్పాటు చేశారు. పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేసారు. రేణిగుంట, విజయవాడ, శంషాబాద్, చెన్నై విమానాశ్రయాల్లోనూ కాఫీ స్టాల్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుంది. ఢల్లీిలో సుప్రీంకోర్టు ఆవరణలోను హైకోర్టు ఆవరణలోనూ జీసీసీ ఔట్‌లెట్ ఏర్పాటుకు సంబంధించి అధికారులతో సంప్రదింపులు జరపాలి. రైతుబజార్లు,
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాల్లో జీసీసీ కాఫీషాపులు, ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరగాలి.
రాష్ట్రంలో అధిక దిగుబడి వచ్చే అరకు, పాడేరు, చింతపల్లి, డుంబ్రిగుడ మండలాలకు సంబంధించి లక్షఎకరాల్లో కాఫీని రైతులతో పండిరచేందుకు 2018లో రెండువేల టన్నుల కాఫీ గింజల సేకరణ లక్ష్యంగా పెట్టుకోగా 1400 టన్నులకు పైగా గింజలను సేకరించగలిగింది. దీనిద్వారా 12 కోట్ల రూపాయల మేర గిరిజన రైతులకు ప్రయోజనం కలిగింది. దీనివల్ల ఈ పంట ద్వారా లబ్ధి పొందుతూ రైతులకు తీరని అన్యాయం చేస్తున్న దళారీ వ్యవస్థను నిర్మూలించినట్టు అయ్యింది. పదేళ్ల క్రితం సీఎం చంద్రబాబు రూ.500 కోట్లతో సమగ్ర కాఫీ తోటల అభివృద్ధి ప్రాజెక్టు మంజూరు చేసి ఐటిడీఏ, జీసీసీ విభాగాల ద్వారా తోడ్పాటు అందించారు. 2016లోనే అరకు కాఫీని ప్రాచుర్యంలోకి తెచ్చి కాఫీ రైతులను ప్రోత్సహించారు. సాగు విస్తీర్ణం పెంచారు. రైతులకు మంచి ధర దక్కేలా చేశారు. ఇప్పుడిక ఐటీడీఏ, జీసీసీ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు వీలుగా కాఫీ పంట సాగు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాఫీ ప్రాజెక్టులో భాగంగా కాఫీ గింజలు సేకరణ ఏవిధంగా చేపట్టాలి? గిరిజన రైతులను ప్రోత్సహించడమెలా? ఇతర దేశాలకు ఏవిధంగా ఎగుమతి చేయాలి? జీఎస్టీతో ఎదురయ్యే సమస్యలేమిటి? కాఫీ పంట ఎగుమతిలో దళారులను నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటి? కాఫీ గింజల సేకరణ కోసం సిబ్బందికి ఏవిధంగా శిక్షణ ఇవ్వాలి? అనే అంశాలపైనే జీసీసీ యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించాలి. కాఫీ పంట ద్వారా గిరిజన రైతులకు ప్రయోజనం కల్పించాలి. ఇందుకోసం తొలుత దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి. గిరిజన రైతులను ప్రోత్సహిస్తూనే దళారీ వ్యవస్థను నిర్మూలించి జీసీసీ సేకరించిన కాఫీ గింజలను దేశ, విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా ఏపీ కాఫీ ప్రతిష్ఠను మరింతగా పెంచాలి. కాఫీ గింజల సేకరణ కోసం అధికారులు, సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలి. గిరిజన రైతులనుంచి నేరుగా కొనుగోలు చేయడం, వీరికి గిట్టుబాటు ధర కల్పించి ఆ మొత్తాలను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి. ఏది ఏమైనా అరకు కాఫీ అంతర్జాతీయ ఖ్యాతి పొందడం, పార్లమెంట్ ప్రాంగణంలో స్టాళ్లను ఏర్పాటు చేసే ఘనతను సాధించడం, కాఫీ సాగు మన్యం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడం గర్వకారణం.
`నీరుకొండ ప్రసాద్