- పన్ను రేట్లు తగ్గినా పెరిగిన వసూళ్లు
- రాష్ట్ర ఆర్థిక ప్రగతికి శుభపరిణామం
అమరావతి (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వరుసగా ఏడో నెలలోనూ తన సత్తాను ప్రదర్శించింది. అక్టోబర్ 2025లో రాష్ట్ర నికర జీఎస్టీ వసూళ్లు రూ.3,021 కోట్లకు చేరి, గత ఏడాదితో (అక్టోబర్ 2024) పోలిస్తే 8.77 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2017లో జీఎస్టీ విధానం అమలులోకి వచ్చిన తర్వాత అక్టోబర్ నెలలో నమోదైన వసూళ్లలో ఇది రెండో అత్యధిక రికార్డు కావడం విశేషం.
ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చిన ‘జీఎస్టీ 2.0 సంస్కరణలు’ కారణంగా పలు వస్తువులు, నిత్యావసరాలపై పన్ను రేట్లు తగ్గినప్పటికీ రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లలో గణనీయమైన వృద్ధి కనిపించటం విశేషం. నిత్యావసరాలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఔషధాలు (ఫార్మా), సిమెంట్ వంటి ప్రధాన వస్తువులపై పన్ను రేట్లు తగ్గించారు. లైఫ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్‌లపై జీఎస్టీని పూర్తిగా ఉపసంహరించారు.
పన్ను రేట్లు తగ్గినప్పటికీ వసూళ్లు తగ్గకపోగా, గణనీయంగా పెరగడం రాష్ట్ర ఆర్థిక వృద్ధి స్థిరత్వానికి అద్దం పడుతోంది. పన్ను తగ్గింపుల వల్ల పెరిగిన వినియోగం, పటిష్టమైన పన్నుల పాలనా వ్యవస్థ వల్లే ఈ అసాధారణ ఫలితం సాధ్యమైందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేవలం వినియోగం పెరగడం మాత్రమే కాదు, పన్ను ఎగవేతలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న పకడ్బందీ చర్యలు కూడా అక్టోబర్ వసూళ్లలో కీలక పాత్ర పోషించాయి. అధునాతన డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను ఉపయోగించి పన్ను ఎగవేత, ఇన్‌పుట్ టాక్స్ క్లెయిమ్‌లలోని అక్రమాలను గుర్తించారు. గతంలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటర్నులు దాఖలు చేయని డిఫాల్టర్లపై ప్రత్యేక నిఘా ఉంచి, వారి ఆస్తులు, బ్యాంక్ ఖాతాలను గుర్తించి వేగవంతంగా రికవరీ చర్యలు చేపట్టారు.
2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి వరుసగా ఏడు నెలలు (ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు) నికర జీఎస్టీ వసూళ్లు, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోని ఆయా నెలల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఇది రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు, వినియోగం స్థిరంగా, ఆరోగ్యకరంగా పెరుగుతున్నట్లు స్పష్టంగా సూచిస్తోంది. జీఎస్టీ మాత్రమే కాక, అన్ని రంగాల ఆదాయాలను (పెట్రోలియం, మద్యంపై వ్యాట్, ప్రొఫెషనల్ ట్యాక్స్ సహా) కలిపి చూస్తే, అక్టోబర్ 2025లో మొత్తం వసూళ్లు రూ.4,458 కోట్లకు చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 8.03 శాతం వృద్ధి. పన్ను రేట్లు తగ్గినా, వసూళ్లలో వృద్ధి కొనసాగడం అనేది ప్రభుత్వ సమర్థవంతమైన పన్నుల నిర్వహణ, వినియోగదారుల కొనుగోలు శక్తి మెరుగుపడటాన్ని సూచిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఇదొక శుభపరిణామం.














