- చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం నిర్ణయం
- రూ.8821.44 కోట్లతో చేపట్టేందుకు అనుమతులు
- ఈ నెలాఖరు నాటికి టెండర్లు పిలిచి ఖరారు చేస్తాం
- పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి పొంగూరు నారాయణ
అమరావతి(చైతన్యరథం): రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు అమోదముద్ర వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 42వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడిరచారు. రూ.8,821 .44 కోట్లతో రాజధానిలో పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం లభించిందని తెలిపారు. ట్రంక్ రోడ్లు, ఎల్‌పీఎస్ లేఅవుట్ రోడ్లు, మంత్రులు, జడ్జిల బంగ్లాల నిర్మాణం తదితర 20 సివిల్ పనులు చేపట్టేందుకు వీలుగా అనుమతి లభించినట్టు తెలిపారు. ప్రధాన ట్రంక్ రోడ్లకు రూ.4,521 కోట్లు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో ఇచ్చిన భూముల్లో రోడ్లకు రూ.3807 కోట్లు, జడ్జిలు, మంత్రుల బంగ్లాలకు రూ.492 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతులు మంజూరైనట్లు చెప్పారు. 2014-19తో పోలిస్తే రహదారుల నిర్మాణానికి 25 నుంచి 28 శాతం మేర ధరలు పెరిగాయని మంత్రి వెల్లడిరచారు. భవనాల నిర్మాణం కోసం 35.55 శాతం నుంచి 55 శాతం మేర అంచనా వ్యయం పెరిగిందని వివరించారు. అదనంగా జీఎస్టీ కూడా 6 శాతం మేర పెరిగిందని తెలిపారు. 2014-19 మధ్య రూ.41 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ.5 వేల కోట్ల మేర పనులు పూర్తి చేశామని చెప్పారు.
అప్పుడే పనులు పూర్తి చేసి ఉంటే చాలా ఖర్చు తగ్గేదని చెప్పిన ఆయన ఆలస్యం అవ్వడం వల్ల అంచనా వ్యయం పెరిగిందని చెప్పుకొచ్చారు. అప్పుడే అమరావతిని కొనసాగించి ఉంటే 45 శాతం ధర పెరిగి ఉండేది కాదని చెప్పారు. గత అథారిటీ సమావేశంలో రూ.11,471 కోట్ల పనులకు అమోదం లభించగా రెండు సమావేశాల్లో కలిపి మొత్తం రూ.20,292.46 కోట్లతో పనులకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. నేలపాడు, రాయపూడి, అనంతరవరం, దొండపాడు వంటి గ్రామాల్లో 236 కిలోమీటర్లు రోడ్లు, లేఅవుట్‌లకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ట్రంక్ రోడ్లు 360 కిలోమీటర్లు ఉండగా అందులో 97.5 కిలోమీటర్లకు అనుమతి ఇచ్చినట్లు వివరించారు. ఈ నెల 15 నాటికి టెండర్లు పిలిచి అన్నింటిని ఈ నెలాఖరుకు ఖరారు చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సింగపూర్ వాళ్లపై కేసులు పెట్టారు..ఇప్పుడు వారిని తిరిగి తీసుకురావాలంటే సీఎం చంద్రబాబుతో చర్చించి ముందుకు వెళతామని చెప్పారు.