- బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలని చాలెంజ్
- ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి
- వారి హయాంలో విద్యాశాఖను ఏటీఎమ్‌గా వాడారని ధ్వజం
అమరావతి(చైతన్యరథం): కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా వీసీల నియామకం చేపట్టామని, బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సవాల్ చేశారు. వీసీల రాజీనామా అంశంలో వైసీపీ సభ్యుల ఆరోపణలపై శాసనమండలిలో మంత్రి సమాధానం ఇచ్చారు. 15 మంది వీసీలను బలవంతంగా రాజీ నామా చేయించారన్న అంశంపై విచారణ జరిపించాలని మండలి వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ సభ్యులు కోరగా దీనిపై లోకేష్ స్పందించారు. వైసీపీ సభ్యుల ఆరోపణలను తిప్పి కొట్టారు. మొత్తం 17 మంది రాజీనామా చేస్తే 10 మంది పర్సనల్, నో రీజన్స్‌తో రాజీనామా చేశారు. అందుకు సంబంధించిన లేఖలు తన వద్ద ఉన్నాయని సమాధానమిచ్చారు. ఇద్దరు ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని రాజీనామా చేసినట్లు ఇచ్చారు. ఐదుగురు ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చాయి..అందుకే రాజీనామా చేశామని చెప్పా రు. బెదిరించారు..పలానా వ్యక్తులు ఫోన్ చేశారు.. నిరసనగా బయటకు వెళ్లమన్నారు.. అందుకే రాజీనామా చేశారని ఎవరూ చెప్పలేదని తెలిపారు.
వైసీపీ ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ప్రివిలేజ్ కమిటీకి పంపాలి
గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్జీయూకేలో రామచంద్రరాజు ఈ విధంగానే రాజీనామా చేశారు. రాయలసీమ యూనివర్సిటీకి సంబంధించిన ప్రసాద రావు, కృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించి రెహ్మతుల్లా, ద్రవిడ యూనివర్సిటీకి సంబంధించి సుధాకర్, వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించి రాజేంద్రప్రసాద్ కూడా ఈ విధంగానే రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా సమర్పిస్తాను. 21-07-2019న ద్రవిడయన్ యూనివర్సిటీ వీసీ విషయంలో వైసీపీ నేతలు ఏ విధంగా వ్యవహరించారో మనం చూశాం. ఇలా చాలా ఆధారాలు ఉన్నాయి. దీనిపై ప్రివిలేజ్ మోషన్ పాస్ చేయాలనుకున్నాం. దీనిని సీరియస్‌గా తీసుకోవాలని కోరుతున్నామని తెలిపారు.
బెదిరించారనే పదం ఎక్కడుందో చూపించాలి
బెదిరించాం..భయపెట్టించాం..అందుకే రాజీనామాలు చేశారని వైసీపీ సభ్యులు మాట్లాడారు. వారిచ్చిన రాజీనామా లేఖలో ఎక్కడా బెదిరించారని, భయపెట్టారని లేదు. కొత్త టీంకు అవకాశమివ్వాలని ఒకరిద్దరు కోరారు. ప్రసాద్‌రెడ్డికి ఏ అర్హతతో ఇచ్చారు. యూనివర్సిటీలో సీఎం పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారా? కూటమి ప్రభుత్వంలో వీసీ నియామకాలను పారదర్శకంగా చేశాం. కేజీ నుంచి పీజీ వరకు సంస్కరణలు తీసుకు వస్తున్నాం. వైసీపీ హయాంలో 117 జీవో తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలల నుంచి 12 లక్షల మంది విద్యార్థులను దూరం చేశారు. చిక్కీ టెండర్లలో 36 శాతం రేట్లు తగ్గించాం. స్కూల్ కిట్స్‌లో 10 శాతం, గుడ్ల ధరలు తగ్గించాం. వీటన్నింటిపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
వైసీపీ హయాంలో విద్యాశాఖను ఏటీఎంగా వాడారు
గతంలో విద్యాశాఖను ఏ విధంగా ఏటీఎంగా వాడారో చర్చిద్దాం. దయజేసి దీనిపై చర్చకు అనుమతించి రికార్డులు తెప్పించాలి. బెదిరించాం అనే పదం వాడారు. ఆ లేఖ ల్లో ఎక్కడా బెదిరించారని లేదు. ప్రివిలేజ్ మోషన్‌కు అనుమతించాలని కోరారు. గవర్నర్ రాజీనామాలను ఆమోదిస్తే ఆయననే ప్రశ్నిస్తున్నారు. వైసీపీ హయాంలో ఇంగ్లీషు రాని వారిని వీసీలుగా నియమించారు. రాజారెడ్డి చెల్లెలి కోడలిని వీసీగా నియమించారు. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం లేదని లోకేష్ ఘాటుగా సమాధానమిచ్చారు.