- 16 నెలల్లోనే 117 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
- భారీ పెట్టుబడులకు గేట్ వేగా విశాఖ
- 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా వేగంగా అడుగులు
- జనవరి నుంచి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ సేవలు
- ఆస్ట్రేడ్ ఎగ్జిక్యూటివ్‌ల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
మెల్‌బోర్న్/ఆస్ట్రేలియా (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి గ్లోబల్ ఎకనమిక్ పవర్ హౌస్‌గా మార్చడమే మా లక్ష్యం.. సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరమైన సమగ్రాభివృద్ధి ద్వారా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించడమే తమ సంకల్పమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఆరో రోజు శుక్రవారం మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ (Aబర్‌తీaసవ) ఎగ్జిక్యూటివ్ లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆస్ట్రేడ్ అంతర్జాతీయ విద్య, వాణిజ్య సేవా నైపుణ్యం, డిజిటల్ డెలివరీ విభాగాధిపతి ఎలోడీ జర్నెట్ అధ్యక్షత వహించగా, లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా శరవేగంగా దూసుకుపోతోందన్నారు. గత 16 నెలల్లోనే 117 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాం. సుదీర్ఘమైన పాలనానుభవం, సమర్థవంతమైన దార్శనిక నాయకుడి వల్లే ఇది సాధ్యమైంది. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, డీప్‌టెక్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, లాజిస్టిక్స్, పోర్టులు, ఫార్మా, బయోటెక్నాలజీ, టూరిజం వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో విశేష పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని మంత్రి లోకేష్ వివరించారు.
తూర్పు తీర సముద్ర రవాణాకు కీలకం
బలమైన విధాన వ్యవస్థ, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, మూడు ఆర్థిక కారిడార్లు, భవిష్యత్‌కు తగిన శ్రామిక శక్తి, క్వాంటం కంప్యూటింగ్, డీప్‌టెక్, గ్రీన్ ఎనర్జీ వ్యాలీ వంటివి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మూలస్తంభాలుగా ఉన్నాయి. అధునాతన సాంకేతికత, ఏఐ ఆధారిత గవర్నెన్స్ వేగవంతమైన అభివృద్ధికి దన్నుగా నిలుస్తున్నాయి. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0తో పాటు 24 థీమెటిక్ పాలసీలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏఐ వంటి అధునాతన సాంకేతిక రంగంతోపాటు డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లపై ప్రత్యేకంగా దృష్టిసారించాం. 1053 కి.మీ.ల సువిశాల తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 6 ఆపరేషనల్ పోర్టుల ద్వారా ఏటా 193 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా అవుతోంది. వచ్చే ఏడాదికల్లా 350 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మరో 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు ప్రారంభం కానున్నాయి. తూర్పు తీర సముద్ర కార్గో రవాణాలో 40శాతం ఏపీ నుంచే సాగుతోంది. ప్రస్తుతం 20 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులను 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.
2.4 ట్రిలియన్ డాలర్లకు ఏపీ ఆర్థిక వ్యవస్థ
విశాఖపట్నం ఐటీ, ఇన్నోవేషన్, డేటా హబ్‌గా తయారవుతోంది. విశాఖలో గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ హబ్ నిర్మించబోతోంది. అదేవిధంగా ఆర్సెలర్ మిట్టల్ సంస్థ రూ.1.35లక్షల కోట్లతో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. భారీ పెట్టుబడులకు విశాఖపట్నం గేట్ వేగా మారింది. విశాఖ మహానగరం 2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి సాధిస్తుంది. ఏపీ రాజధాని అమరావతిలో వచ్చే జనవరి నుంచి దక్షిణాసియాలోనే తొలి 156-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ సేవలు ప్రారంభించబోతున్నాం. ఇది భారత సాంకేతికరంగంలో గేమ్ ఛేంజర్ కాబోతుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో స్టట్ డేటా లేక్, అవేర్ హబ్, ఇంటెలిజెన్స్ లేయర్, డిజిటల్ గవర్నెన్స్ వంటివి అంతర్భాగాలుగా ఉంటాయి. ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ… 2047నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా ముందుకు సాగుతోంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో తాము ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న పార్టనర్ షిప్ సమ్మిట్ ` 2025కు ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలు హాజరై ఏపీలో పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.










