అమరావతి (చైతన్యరథం): ఏపీ మెగా డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో వెల్లడిరచారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్‌లోకి వెళ్లి స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు.
స్కోర్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
అభ్యర్థులు తొలుత క్యాండిడేట్ లాగిన్ లోకి వెళ్లాలి. అక్కడ తమ హాల్ టికెట్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తే.. ‘సర్వీసెస్’ అని వస్తుంది. అక్కడ ఏపీ డీఎస్సీ ఫలితాలను సెలక్ట్ చేసుకుంటే స్కోరు కార్డు అందుబాటులోకి వస్తుంది. అందులో అభ్యర్థులు రాసిన మొత్తం పేపర్లు, సాధించిన మార్కులు, టెట్ మార్కులను పేర్కొంటూ క్వాలిఫైడ్/నాన్ క్వాలిఫైడ్ అనే వివరాలు ఉంటాయి.
అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సవరించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొందించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తుది ఫలితాలు, స్కోర్ కార్డులను పొందొచ్చు. టెట్ వివరాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అధికారిక వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తామే టెట్ వివరాలు సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఈ అవకాశం రెండు రోజులు (ఆగస్టు 13వరకు) మాత్రమే అందుబాటులో ఉంటుందని కృష్ణారెడ్డి తెలిపారు.
కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నియామకానికి మెగా డీఎస్సీ నిర్వహించింది. మొత్తంగా 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జులై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు సెషన్లలో ఈ పరీక్షలను విజయవంతంగా ముగించారు. మెగా డీఎస్సీ పరీక్షలకు 92.90 శాతం మంది హాజరయ్యారు.