భవిష్యత్ పర్యాటక చిత్ర పటంలో ఏపీ కొత్త రంగులతో సీఎం చంద్రబాబు సారథ్యంలో కొత్త శోభ సంతరించుకోనున్నది. బుద్ధుడు కాలచక్రాన్ని ప్రబోధించిన సీమ అమరావతి చేరువలో అదే పేరుతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని విశ్వనగరంగా అభివృద్ధి చెందబోతోంది. అందుకే బౌద్ధ పర్యాటకం ఆంధ్రప్రదేశ్ ప్రగతిపై అనేక ఆశలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అనేక బృహత్తర కార్యాచరణ ప్రణాళికలు అమలుచేస్తూ.. పర్యాటక రంగాన్ని శరవేగంతో అభివృద్ధి చేయడానికి కంకణబద్ధులయ్యారు. దేశ, విదేశీ పర్యాటకులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు, భారీఎత్తున పెట్టుబడులు సమీకరించేందుకు అవిశ్రాంత కృషి చేస్తున్నారు. వృద్ధి రేటులో పర్యాటకాన్ని ముఖ్యమైన వనరుగా మార్చి, రెండంకెల వృద్ధి రేటును సాధించేందుకు, అందివచ్చే అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకోవడానికి పాటుపడుతున్నారు. పర్యాటకానికి ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యంవల్ల రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని స్టార్ హోటళ్లు రానున్నాయి. పర్యాటక అవసరాలకు తగినట్టుగా హోటల్ గదులు పెద్దసంఖ్యలో పెరగబోతున్నాయి.
హాస్పిటాలిటీని ముఖ్య ఆదాయ వనరుగా మార్చుకోవాలని, శ్రీలంక తరహా ఆతిథ్య సేవలు రాష్ట్రానికి పరిచయం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పర్యాటకరంగానికి పారిశ్రామిక హోదానిస్తూ టూరిజం పాలసీ తెచ్చింది ప్రభుత్వం. దీని ద్వారా పెట్టుబడులు, ఉద్యోగాలు, స్థిరమైన ప్రమోషన్ మొదలైన అవకాశాలు పెరగనున్నాయి. టూరిజం పాలసీ 2024-29 ప్రకారం రూ.25,000 కోట్ల పెట్టుబడులు, 50,000 హోటల్ గదుల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకొన్నది కూటమి ప్రభుత్వం. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి -ముఖ్యమైన టూరిజం హబ్‌లుగా గుర్తించబడి, సదుపాయాల అభివృద్ధి -ఆకర్షణ కేంద్రాలుగా అభివృద్ధి చేయబోతున్నారు. కోనసీమ, పాపికొండలు, పట్టిసీమ, రుషికొండ, కైలాసగిరి, దిండి, మారేడుమిల్లి, లేపాక్షి, అరకు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సువంటి అనేక ప్రాంతాలు వున్నాయి. అనేక పుణ్యక్షేత్రాలతో ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక పర్యాటక ధామంగా మారనున్నది.
అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు రూ.94.44 కోట్లు, రైల్వే బ్రిడ్జ్ రివాంప్‌తో పుష్కర్ ఘాట్ ఏర్పాటు చెయ్యడం ద్వారా 2027నాటికి పూర్తిచేసి 10 నుంచి 35 లక్షలమంది పర్యాటకులను ఆకర్షించడం, స్వదేశ్ దర్శన్ (ఎస్‌ఏసీఐ, సీబీడీడీ) నిధుల ద్వారా గండికోట, గోదావరి కారిడార్, పురాతన గుహల అభివృద్ధి, ఆలయ మరియు నదుల కారిడార్లు రూపొందించబడనున్నాయి. అమరావతిలో రూ.145 కోట్లు పెట్టి ఫోర్ స్టార్ హోటల్, పోలవరం సమీపంలో రూ.255 కోట్లు పెట్టి ఫైవ్ స్టార్ రిసార్ట్ ఆమోదం, రాష్ట్రవ్యాప్తంగా 500 హోమ్‌స్టేలను గుర్తించి ఆగస్టు 2025నాటికి అప్ గ్రేడ్ చేయాలని ప్రణాళిక. తిరుపతి సమీపంలోని 600 హోమ్‌స్టేలకు హాస్పిటాలిటీ శిక్షణ అందజేయనున్నారు. విశాఖలో బోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం డిసెంబర్ 2025లో పూర్తి కానున్నది. రూ.469 కోట్లు మొత్తం టూరిజం, యువత, సంస్కృతి విభాగాలకు కేటాయింపులు. ఇందులో ట్రావెల్, ఇన్ఫ్రా, హాస్పిటాలిటీ, సంస్కృతి పరిరక్షణ 2025-26లో 37 టూరిజం ఈవెంట్లు, 2 అంతర్జాతీయ, 12 మెగా ఈవెంట్లు ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కోసం రోడ్ మ్యాప్ రూపకల్పన జరిగింది. పర్యాటక రంగంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా టూరిజం కాన్‌క్లేవ్ నిర్వహించారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదాను కల్పించడం జరిగింది. ఈ కాన్‌క్లేవ్ వేదికగా జీఎఫ్‌ఎస్టీ టూరిజం కాన్‌క్లేవ్‌లో భాగంగా వివిధ పర్యాటక 82 ప్రాజెక్టులకు సంబంధించి రూ.10,329 కోట్ల విలువైన ప్రాజెక్టులను పర్యాటక అభివృద్ధి సంస్థతో ఆయా సంస్థలు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 974 కిలోమీటర్ల పొడవునా నవ్యాంధ్ర వెండి పరికిణీ అంచులా మెరిసే ఆంధ్రా సముద్ర తీరం- దేశంలో గుజరాత్ తర్వాత అతి పెద్దది. ఆ సుందర సముద్ర తీరమే పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ సుస్ధిర ప్రగతికి రేపటి విడిది కానున్నది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి జిఎస్టిపిటి 7 శాతం మాత్రమే వున్న పర్యాటక రంగం అభివృద్ధిని 20శాతానికి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుంది. పెట్టుబడుల సహకారంతో మౌలిక సదుపాయాలను కల్పించి టూరిజం హబ్‌గా రాష్ట్రాన్ని నిలపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు, సర్వీస్ టాక్స్ మినహాయింపువంటి ఆకర్షణలెన్నో టూరిజం కొత్త పాలసీలో వున్నాయి. పర్యాటకం పేరెత్తితే మలబారు తీరాల కేరళ అనో, పడమటి కనుమల స్వర్గధామం గోవా అనో అనేస్తారు. కానీ, మన ఆంధ్రప్రదేశ్ ఆ రెండిటి మేలు కలయిక. కేరళలోవున్న బ్యాక్ వాటర్, గ్రీనరీ మనకీ వున్నాయి. గోవాలోవున్న బీచ్ అందాలు మనకూ వున్నాయి. గత ఐదేళ్లలో ఈ రంగం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురయ్యింది. మరో 20 ఏళ్లలో ప్రపంచ పర్యాటక విడిదిగా ఆంధ్రప్రదేశ్ నిలవనున్నది. ప్రభుత్వం రూ.10,329 కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకోవడం చారిత్రాత్మకం. ఇది టూరిస్టు ప్రమోషనో, ఇండస్ట్రీస్ ప్రమోషనో అర్థం కానంత అద్భుతంగా ఇవాళ ఎంవోయూలు జరిగాయి.
గతంలో కమ్యూనిజం, సోషలిజం, క్యాపిటలిజం కంటే టూరిజానికే భవిష్యత్తు ఉందని చంద్రబాబు చెప్పిన మాట నేడు నిజం కానున్నది. ఇక భవిష్యత్తు అంతా పర్యాటక రంగానిదే. ఈ రంగం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఐటీ ఉత్పత్తి పరిశ్రమలు, వ్యవసాయంకంటే పర్యాటక రంగం ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది. పర్యాటక ప్రాజెక్టులకు విద్యుత్ సబ్సిడీలు, ఇతర ప్రోత్సాహకాలు అందించనున్నది ప్రభుత్వం. హెలీ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. టూరిజంలో ఏపీ దేశానికి మోడల్‌గా నిలవనుంది. ఐటీ తర్వాత దీన్ని పర్యాటక రంగాన్ని ప్రాధాన్యరంగంగా తీసుకున్నారు సీఎం చంద్రబాబు. 2047నాటికి బెస్ట్ డెస్టినేషన్ స్టేట్‌గా తయారు కావాలన్నదే ఆయన లక్ష్యం. సర్వీస్ సెక్టారులోనే మ్యాగ్జిమమ్ ఎకానమీ, మ్యాగ్జిమమ్ ఎంప్లాయిమెంట్, మ్యాగ్జిమమ్ వెల్త్ వస్తాయి.
అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజంలో ఏపీని అగ్రగామిగా నిలపాలని, గ్రీన్ అండ్ ల్యాండ్ స్కేపింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు. బెస్టు ఆర్కిటెక్ట్స్ ఎక్కడున్నా తీసుకొచ్చి మన నగరాల్ని, ఊళ్లని స్మార్ట్ ఊళ్లుగా మార్చనున్నారు. సుందరమైన లంకభూములు వున్నాయి. సముద్ర తీరంలాంటి సుందరమైన ప్రదేశం ఎక్కడా లేదు. సుదీర్ఘమైన కోస్తాతీరం మనకే సొంతం. ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని ఇష్టపడతారు. ఈస్ట్ ఆసియాకు ఇది ముఖద్వారం. డీప్ వాటర్ -మనకు అదనపు ఆకర్షణ. పర్యాటక రంగం ఆర్థికాభివృద్ధికి ఇరుసు. పర్యాటక రంగం రాష్ట్రానికి ఒక విజన్‌గా మారుతుంది. పర్యాటకరంగం వల్ల ఎన్నో సానుకూల అంశాలున్నాయి. టూరిజం రంగంలో లక్షలమందికి ఉద్యోగాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యవతకు నైపుణ్యం కల్పించాలని నిర్ణయించారు. విశాఖ, తిరుపతి, అమరావతి, రాజమండ్రి, అనంతపురంలో టూరిజం హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. యోగాతో ప్రజల్ని ప్రభావితం చేసినట్టే ఏపీ పర్యాటకాన్ని, ఏపీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాను సలహాదారుగా నియమించారు. ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యంత ప్రాధ్యాన్యత ఇస్తూ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతుంది. ఐదేళ్లలో ఏపీ.. దేశంలోనే ప్రధాన పర్యాటక హబ్‌గా రూపాంతరం చెందబోతుంది.
`నీరుకొండ ప్రసాద్