- ఇన్వెస్టర్లను ఆహ్వానించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
- ఇన్వెస్టర్లకు పూర్తి భరోసా కల్పిస్తామని హామీ
- జాతీయ, అంతార్జాతీయ హోటల్స్, ట్రావెల్స్ ప్రతినిధులతో భేటీ
- దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్‌షాప్‌కు హాజరు
అమరావతి (చైతన్య రథం): ఆతిథ్యరంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ముంబయి పర్యటనకు వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్ బృందం బుధవారం దాదాపు 20కిపైగా ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముంబయిలోని ది వెస్టిన్ ముంబయి పోవై లేక్‌లో ఏప్రిల్ 8నుంచి 10 వరకు జరుగుతున్న దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్‌లో భాగంగా మారియట్, ఐహెచ్‌జీ, ఐహెచ్‌సీఎల్, అకార్, చాలెట్, ఇమాజికా వరల్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్, హమా, బీఎన్‌కే గ్రూప్, వెంటివ్ హాస్పిటాలిటీ, పార్క్ హోటల్స్, లెమన్ ట్రీ, వెస్టిన్, బ్లాక్‌స్టోన్, హిల్టన్, సుబా హోటల్స్, ది బీచ్ ఎహెచ్‌ఎస్, అంబుజా నోటియా, ఎస్‌ఆర్‌టీ హోటల్స్, రాయల్ ఆర్కిడ్‌వంటి జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలతో భేటీ అయ్యారు. అదేవిధంగా ఆతిథ్య రంగంలోని కీలక వాటాదారులు, పరిశ్రమ నాయకులు, హోటల్ పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఆపరేటర్లు మరియు దక్షిణాసియా అంతటా ఉన్న ఇతర నిపుణులను కలిశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోందని, కేంద్ర ప్రభుత్వ సహకారం తమకు మెండుగా ఉందని తెలుపుతూ పర్యాటకులకు గమ్యస్థానాలుగా ఉన్న విశాఖపట్నం, తిరుపతి,అమరావతి, రాజమండ్రివంటి ప్రధాన నగరాల్లో లగ్జరీ రిసార్ట్స్, హోటల్స్ నెలకొల్పాలని ఆహ్వానించారు. ఈక్రమంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన వేదిక అని, పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ వారికి వెల్లడిరచారు. ప్రభుత్వం తరపున కల్పించే మెరుగైన రాయితీలను వివరించారు. పరిశ్రమలకు ఇచ్చే అన్ని రాయితీలను పర్యాటకరంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కల్పిస్తామని స్పష్టంగా వివరించారు. భేటీ అనంతరం పలువురు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ఆసక్తిని కనబరిచారు. మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట, ఏపీ టూరిజం అథారిటీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ నోడల్ ఆఫీసర్ సత్యప్రభ తదితరులు పాల్గొన్నారు.