- ప్రస్తుతం ఉన్నది ఒక్కటే ఇజం… అది టూరిజం
- పర్యాటకరంగ అభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేస్తాం
- 20శాతం వృద్ధిరేటు సాధించడమే ప్రభుత్వ లక్ష్యం
- టూరిజం ప్రాజెక్టులకు సులువుగా అనుమతులు, ప్రోత్సాహకాలు
- భవిష్యత్లో కుంభమేళా తరహా ఆద్యాత్మిక కార్యక్రమాలు
- ఇకపై దసరా అంటే విజయవాడ కూడా గుర్తుకురావాలి
- ప్రపంచ పర్యాటక దినోత్సవంలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన
- ‘రిషికొండ’ ఖర్చు టూరిజంపై పెడితే లక్షల ఉద్యోగాలు వచ్చేవని వ్యాఖ్య
విజయవాడ (చైతన్య రథం): రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి పర్యాటక రంగానికి ఉందని, టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పర్యాటక రంగానికి పరిశ్రమ హెూదా ఇచ్చామని గుర్తుచేస్తూ.. పర్యాటక రంగ అభివృద్ధితోపాటు, టూరిస్టులను ఆకర్షించేందుకు మెరుగైన పాలసీ తెచ్చి.. ప్రత్యేక ప్యాకేజీలు, రాయితీలు ఇస్తున్నామన్నారు. ప్రపంచంలో ఎక్కువమంది పర్యాటకులు మన దేశీయులేనని, మన దేశంలో ఉన్నన్ని పర్యాటక కేంద్రాలు ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. పర్యాటకులను ఆకర్షించగలిగితే భారీగా ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. టూరిజం పాలసీ ఆపరేషనల్ గైడ్లైన్స్ విడుదల చేశారు. ఏపీ టూరిజం హెంస్టే పోర్టల్ను ప్రారంభించారు. బాపట్లలోని గోల్డెన్ సాండ్ రిసార్ట్ను వర్చువల్గా ప్రారంభించారు. హెూం స్టే ప్రాజెక్టులకు సంబధించి పలు జిల్లాల్లోని గిరిజనులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు.
ఒకప్పుడు దేవాలయాలకు వెళ్లడమే పర్యాటకం
తమ చిన్నతంలో గుడికి వెళ్లి రావడమే పర్యాటకమని, అదే గొప్ప అనుభూతినిచ్చేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నేడు ఎన్నో మార్పులు వచ్చాయని… పలు దేశాల ఆర్థిక వ్యవస్థలను టూరిజం శాసిస్తోందన్నారు. మకావ్, మాల్దీవులు, హాంగ్ కాంగ్ వంటి దేశాలు ప్రపంచ టూరిస్టులను ఆకర్షిస్తున్నాయన్నారు. ఆ దేశాల జీడీపీలో అత్యధిక షేర్ పర్యాటక రంగానిదేనని వివరించారు. అమెరికా జీడీపీలో పర్యాటక రంగం వాటా 2.36 ట్రిలియన్ డాలర్లు ఉంటే… మన దేశ జీడీపీలో కేవలం 231 బిలియన్ డాలర్లు మాత్రమేనని తెలిపారు. నేటి టెక్నాలజీ యుగంలో ఉద్యోగాలు తగ్గిపోతాయని కొందరు భయపడుతున్నారని… టెక్నాలజీని అభివృద్ధి చేస్తూనే టూరిజంపై దృష్టి పెడితే భారీగా ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పర్యాటకరంగంలో ప్రతీ రూ. లక్ష పెట్టుబడికి 10 ఉద్యోగాలు సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు సూచించారు.
పర్యాటకానికి కొత్త శోభ
కూటమి ప్రభుత్వంలో పర్యాటకానికి కొత్త శోభవచ్చిందని చంద్రబాబు అన్నారు. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాక అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హెూదా కల్పించామని చెప్పారు. హెూటళ్లకు కూడా ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నామని సీఎం గుర్తు చేశారు. దీని ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని… భవిష్యత్తులో కుంభమేళా తరహాలో పర్యాటక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహించాలని ప్రణాళిక రూపోందిస్తున్నా మని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ రోజుల్లో హెూమ్ స్టే నిర్వహణ అనేది స్మార్ట్ వర్కులో విధానంగా ఉంటుందనేది తన భావనగా చెప్పారు. విశాఖలో గిరిజన ప్రాంతాల్లో ఒక మహిళ టూరిజం ద్వారా నెలకు రూ.50 వేలు సంపాదిస్తోందని… కోనసీమలో ఓ వ్యక్తి తన తండ్రికట్టిన 80 ఏళ్లనాటి ఇంటి ప్రాముఖ్యతను పర్యాటకులకు వివరిస్తూ ఉపాధి పొందుతున్నాడని సీఎం వివరించారు. ప్రపంచంలోనే అందమైన పర్యాటక ప్రదేశాలు మన రాష్ట్రంలో ఉన్నాయని… పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఏపీ టూరిజం పాలసీ 2024-29 తీసుకు వచ్చామని చెప్పారు. స్టాంప్ డ్యూటీ మినహాయింపు… కేపిటల్ సబ్సిడీ, ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, విద్యుత్ రాయితీ లతో పాలసీని ఆకర్షణీయంగా రూపొందించడమే కాకుండా పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు సృష్టించామని ముఖ్యమంత్రి తెలిపారు.
103 ఎంవోయూలు – రూ.10,644 కోట్ల పెట్టుబడులు
కూటమి ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో పర్యాటక రంగంలో 103 ప్రాజెక్టులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని, దీనివల్ల రాష్ట్రానికి రూ.10,644 కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాజ్, ఒబెరాయ్, ఐటీసీ సహా అనేక సంస్థలు తమ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయని వెల్లడించారు. రాబోయే నాలుగేళ్ల కాలంలో 50 వేల గదుల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇప్పటికే విశాఖ, అరకు, కోనసీమ, తిరుపతి, రాజమండ్రిలో 10,000కు పైగా హెూమ్ స్టేలు ఉన్నాయని… వాటిని టూరిజం అభివృద్ధికి వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజంవంటి వాటికి వినియోగించుకోవాలన్నారు. తిరుపతికి రోజుకు సుమారు లక్ష మంది వరకూ భక్తులు వస్తున్నారని… తిరుపతిలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే భక్తులు మూడు రోజుల వరకూ స్టే చేసే అవకాశం ఉంటుందని సీఎం చెప్పారు. టెంపుల్ టూరిజంతోపాటు 40 బౌద్ధ స్థలాలతో అంతర్జాతీయ బౌద్ధ టూరిజంను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. కుంభమేళా తరహాలో 100 ఆలయాల్లో టెంట్ సిటీస్కు కార్యాచరణ చేపట్టామని… యాంకర్ హబ్లుగా విశాఖ, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి… వారసత్వ ప్రాంతాలుగా కొండపల్లి, కూచిపూడి, ఏటికొప్పాక, మంగళగిరి, ధర్మవరం వంటి ప్రాంతాలను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
దసరా ఉత్సవాలంటే విజయవాడ గుర్తు రావాలి
నిన్నటి వరకూ దసరా అంటే గుర్తొచ్చేది కలకత్తా, మైసూర్ నగరాలని… ఇకపై విజయవాడ గుర్తుకు వచ్చేలా ‘విజయవాడ ఉత్సవ్’ను ఘనంగా నిర్వహిస్తున్నారన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే 8 మెగా ఈవెంట్స్ నిర్వహించామని… గండికోట ఇన్వెస్టర్స్ మీట్, బారువా-మసులా బీచ్ ఫెస్టివల్స్, అరకు చలి ఉత్సవం, ఫ్లెమింగో ఫెస్టివల్, నారీ శక్తి విజయోత్సవ్కు మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. సీమలో టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే…. ఉపాధి పెరుగుతుందన్నారు. శ్రీశైలంలో శక్తి పీఠాలున్నాయని… అక్టోబర్ 16న ప్రధాని శ్రీశైలం వచ్చి పూజలు నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు. గండికోటలాంటి సుందరమైన ప్రాంతం దేశంలో మరెక్కడా లేదని… ప్రపంచంలో 8వ అందమైన ప్రదేశం గండికోట అని చెప్పారు. కచ్పింటి కరువు ప్రాంతాన్ని టూరిజం హబ్గా తయారు చేశారని… ఆ స్ఫూర్తితో మరింత ముందుకెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ స్కీంలకింద రాష్ట్రంలో 8 టూరిజం ప్రాజెక్టులను రూ.428 కోట్లతో చేపట్టడం రాష్ట్ర పర్యాటకానికి ఊతమిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
టూరిజం అభివృద్ధికి ఎంతైనా ఖర్చు చేస్తాం
పర్యాటక రంగ అభివృద్ధికి ఎంత డబ్బు అయినా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాజమండ్రిని టూరిజం హబ్ తయారు చేస్తామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం సమీపంలోని గోదావరి పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నా మన్నారు. హేవలాక్ బ్రిడ్జిని ఆధునికీకరిస్తూ అందం గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విశాఖలో 2 డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటుచేసి 11 ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేందుకు అందుబాటులోకి తీసుకొచ్చామని సీఎం చెప్పారు. విశాఖలో క్రూయిజ్ కూడా ప్రారంభించామన్న చంద్రబాబు… గత ప్రభుత్వంలో అన్ని రంగాలతోపాటు పర్యాటక రంగం కూడా దెబ్బతిందని గుర్తు చేశారు. రిషికొండపై రూ.451 కోట్లతో ప్యాలెస్ కట్టారని… అదే డబ్బు టూరిజంపై ఖర్చుపెట్టి ఉంటే లక్షలమందికి ఉద్యోగాలు వచ్చేవని సీఎం చంద్రబాబు అన్నారు.
అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు
పర్యాటక రంగంలో మార్కెటింగ్ ఎంతో ముఖ్యమైనదని సీఎం చంద్రబాబు తెలిపారు. మనగురించి మనం చెప్పుకుంటే తప్పు లేదన్నారు. మన వివిధ వంటలు, అద్భుతమైన ఆహారం ఎక్కడా దొరకదన్నారు. అలాగే ఆలయాలు, నదీ తీర ప్రాంతాలు, అడవులు, కొండలు… ఇలా ఏపీలో అన్నీ ఉన్నా యన్నారు. ఆయా ప్రాంతాలను ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రమోట్ చేయాలని సీఎం సూచించారు. అరకు కాఫీ అనుభూతిని ప్రపంచానికి చెప్పగలిగేలా ప్రధానితో అరకు కాఫీ తాగించామని సీఎం చెప్పారు. కోనసీమ లో వాడపల్లి దేవాలయానికి ఇప్పుడు భక్తులు పోటెత్తు తున్నారని చెప్పారు. ఆదాయం పెరిగేలా పర్యాటకుల ను ఆకర్షించాలన్నా, వారు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నా ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలూ ముఖ్యమేనని సీఎం చంద్రబాబు అన్నారు.
పర్యాటకంలో 20శాతం వృద్ధిరేటు లక్ష్యం
8 శాతం గ్రోత్ ఉన్న పర్యాటకాన్ని 20 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర- 2047నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశంలో అగ్రభాగాన నిలపాలని… దీనిలో పర్యాటక రంగం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పారు.
మన కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలకు మంచి మార్కెట్ లభిస్తుందని వివరించారు. మన చేనేత ఉత్పత్తులు, మన కలంకారీ వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని… దీనివల్ల ఆయావర్గాల ప్రజల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో మంత్రి దుర్గేష్, ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, టూరిజం శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.