- ఉచిత వైద్యంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
- యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదం
- ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యం
- 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా వర్తింపు
- కొత్తగా 10 వైద్య కళాశాలలకు గ్రీన్ సిగ్నల్
- ఎస్ఐపీబీ ప్రతిపాదన మేరకు పలు సంస్థలకు భూకేటాయింపులు
- మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్కు ఓకే
- ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం
- 40 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్న మంత్రిమండలి
అమరావతి (చైతన్య రథం): ఆయుష్మాన్ భారత్-ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోదముద్ర వేసింది. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా అందేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 29వ ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రిమండలి నిర్ణణాలు, ఆమోదాలను రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ మంత్రి కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. మంత్రిమండలి ఆమోదం మేరకు యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగంగా.. 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్యసేవ హైబ్రిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 3,257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనున్నారు. కేవలం ఆరు గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్మెంట్ చేయనున్నారు. రూ.2.5 లక్షలలోపు వైద్య చికిత్సల క్లెయిమ్లు ఇన్స్యూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం రూపొందించారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ భరించనుంది. 1.43 కోట్ల పేద కుటుంబాలు, 20 లక్షలమంది ఇతర కుటుంబాలకూ వర్తించేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నారు.
కొత్తగా 10 వైద్య కళాశాలలకు ఆమోదం
మరోవైపు కొత్త వైద్యశాలల విషయంలోనూ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్పీ జారీకి మంత్రివర్గం అనుమతినిచ్చిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965, ఏపీసీఆర్డీఏ యాక్ట్ 2014, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2016లను సవరించడంతోపాటు డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ జారీ ద్వారా యూఎల్బీ, యూడీఏ, ఏపీసీఆర్డీఏ రాజధాని ప్రాంతం వినా అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భవనాలకు ఫీనలైజేషన్ చేస్తూ రెగ్యులరైజేషన్కు మంత్రిమండలి ఆమోదించినట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఆగస్టు 28న నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా మదర్ డెయిరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రూ.427 కోట్ల పెట్టుబడితో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేయనున్నారని, తద్వారా 180మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్టు పార్థసారథి చెప్పారు. అలాగే, రూ. 786 కోట్ల పెట్టుబడితో ఏస్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తున్నారని, దీని ద్వారా ప్రత్యక్షంగా 1000 మందికి, పరోక్షంగా 1500 మందికి ఉద్యోగావకాశాలు ఉంటాయన్నారు. రాజధాని నగరం అమరావతిలో భూమిని కేటాయించిన విద్యా మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు రీయింబర్స్మెంట్ ప్రాతిపదికన స్టాంప్ డ్యూటీ చెల్లింపునుండి మినహాయింపునిచ్చే ప్రతిపాదనను ఆమోదించింది. ఈ నిర్ణయం వల్ల పేరున్న విద్యా, వైద్య సంస్థలు అమరావతి ప్రాంతంలో ఏర్పాటుకు ముందుకొచ్చే అవకాశం ఉందని మంత్రి పార్థసారథి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి, అవసరమైన భూముల కేటాయింపును సక్రమంగా ఆమోదించడానికి మరియు సంబంధిత విధానాల ప్రకారం విద్యుత్, రోడ్డు, పారిశ్రామిక నీరు మొదలైన కొన్ని ఇన్పుట్ల నిబంధనలకు సౌకర్యాలను కల్పించడానికి ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడు, ప్రాజెక్టులు గ్రౌండింగ్ అయ్యేలా చూసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పేస్ సిటీ, వాటికి సంబంధించిన తదుపరి నాలుగు ప్రధాన తయారీ ప్రతిపాదనలకు భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎర్తు స్టోరబుల్ ఇంజన్ టెస్టు ఫెసిలిటీ, క్రయోజనిక్ ఇంజన్ టెస్టు ఫెసిలిటీ, క్రయోజనిక్ ఇంజన్ టెస్టు ఫెసిలిటీ-2 సదుపాయాలను ఈ స్పేస్ సిటీలో కల్పించనున్నారు.అలాగే, ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, అధాని విల్మర్ లిమిటెడ్, థైరోమర్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, రామ్ సై బయో ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సర్వరాయ షుగర్స్ లిమిటెడ్, పట్టాడి ఆగ్రోఫుడ్లకు ఎర్లీ బర్డ్ ప్రోత్సాహం అందజేయడంపై చర్చించి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి అపోలో టైర్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.1110 కోట్లుతో ఏర్పాటు చేసే కంపెనీ ద్వారా 500 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసే ఈ కంపెనీ నిర్మాణ పనులు 2027 డిశంబరు నాటికి పూర్తి కానున్నాయని మంత్రి పార్థసారథి వెల్లడించారు.
ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా అపోలో టైర్స్ లిమిటెడ్ సంస్థ గ్రౌండింగ్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ నిర్ణయాల్లో భాగంగా వరాహ ఆక్వా ఫామ్స్, అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రపెన్యూర్స్ ఆఫ్ ఇండియా, జె కుమార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రతిపాదనల ద్వారా పీపీపీ పార్క్ పాలసీని అనుసరించి ప్రైవేటు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ నిర్ణయాల్లో భాగంగా పీపీపీ పార్క్ పాలసీని అనుసరించి ప్రైవేట్ మెగా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్కు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు. హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ పెట్టుబడుల ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పింది. అనంతపురం జిల్లా మడకసిరలో రూ.1197 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుతో 870మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని మంత్రి కొలుసు వివరించారు.
మంత్రాలయంలో శ్రీ వెంకటేశ్వర లాడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్, అమరావతిలో మంజీర హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎస్కీం వైజాగ్ హెూటల్ ప్రైవేట్ లిమిటెడు ఆతిధ్య వసతుల అభివృద్ధికై
ప్రోత్సాహకాలు అందించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ప్రత్యక్షంగా 775మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని మంత్రి వివరించారు. సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. 2024 ఆగస్టు మరియు సెప్టెంబర్ లో వరదల కారణంగా సంభవించిన నష్టాలకు గన్నవరం, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామ, విజయవాడ సెంట్రల్, పెనమలూరు, జగ్గంపేట, పిఠాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, గోపాలపురం, తణుకు అసెంబ్లీ నియోజకవర్గాలలో రూ.5714.58 లక్షల రూపాయలతో 392 ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరద నష్ట మరమ్మతు, పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వాటర్ యూజర్స్ అసోసియేషన్లకు గుర్రపుడెక్క, కలుపు
తొలగింపు పనుల అప్పగింతనకు రూ.5లక్షల నుండి రూ.10 లక్షలకు ద్రవ్య పరిమితిని పెంచేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలు తెచ్చేందుకు కేబినెట్ ఓకె చెప్పింది. ఎస్ఐపీబీ సమావేశం నిర్ణయాల్లో భాగంగా వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించి.. నిర్ణణాలు తీసుకుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. కుప్పంలో దాదాపు రూ.586 కోట్ల పెట్టుబడితో హిందాల్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 613మందికి ఉద్యోగావకాశాలను ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. ఇది ఆపిల్ సహా ప్రపంచ సాంకేతిక ప్రముఖులకు అధిక నాణ్యత అల్యూమినియం ఉత్పత్తులను చేపట్టనుంది. ఇది ప్రపంచ ఎలక్ట్రానిక్స్ సరఫరా చైన్లో ఏపీ స్థానాన్ని పెంచుతుందన్న అంచనాలు ఉన్నాయి. అదనంగా, ఈ పెట్టుబడి కొత్త వ్యాపారాలను సృష్టించడం ద్వారా స్థానిక ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. అవకాశాలు మరియు పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ అభివృద్ధి రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వృద్ధిని
వేగవంతం చేయడానికి, భవిష్యత్తులో దేశీయ మరియు విదేశీ పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయడానికి ఉపకరిస్తుంది. అధునాతన తయారీ కేంద్రంగా ఏపీ పాత్రను బలోపేతం చేయనుందని మంత్రి పార్థసారథి వివరించారు. వాహన పన్ను చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తాగునీటి సరఫరా పథకాల ఆపరేషన్, మెయింటెనెన్స్ (గ్రామీణ) విధానం ఆమోదం, నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఓకే చెప్పింది. ఈ విధానం వలన
రాష్ట్రవాప్తంగా నీటి వనరుల స్థిరమైన నిర్వహణ, బాధ్యతాయుత వినియోగం, కమ్యూనిటీ-మేనేజ్డ్వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని గ్రామీణ కమ్యూనిటీలకు సురక్షితమైన తాగునీటిని న్యాయమైన, స్థిరమైన అందుబాటును కల్పిస్తుందని మంత్రి పార్థసారథి వివరించారు. “కృష్ణా నది యొక్క వివిధ రీచ్ వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరంనుండి ఇసుకను డీసిల్టింగ్ చేయడం” అనే పనుల నామకరణాన్ని “కృష్ణా నది యొక్క వివిధ రీచ్ వద్ద ప్రకాశం బ్యారేజీ ముందు తీరాన్ని డీసిల్టింగ్ చేయడం” పేరిట సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే, “మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూల్స్ 2025” ఆమోదం, రాజధాని ప్రాంతంలో రత్నాలు మరియు ఆభరణాల పార్క్ ఏర్పాటు చేసేందుకై గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 78.01 ఎకరాల విస్తీర్ణంలో “మంగళగిరి గోల్డ్ క్లస్టర్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్” ప్రారంభించి అమలు చేయడానికి ఏపీసీఆర్డీఏ కమిషనరు అధికారం బదలాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
దేశ పౌరులకు ప్రయోజనం చేకూర్చేలా జిఎస్టీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రిమండలి అభినందలు తెలిపింది. జీఎస్టీ స్లాబ్లను మారుస్తూ తీసుకువచ్చిన సంస్కరణల్ని స్వాగతించింది. విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలిపింది. నిత్యావసరాలు, విద్యా, ఆరోగ్యరంగం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన పన్నులు గణనీయంగా తగ్గుతాయని కేబినెట్ అభిప్రాయపడింది. కేంద్ర నిర్ణయం పేదలకు వరం, అభివృద్ధి కారకం. సమాజంలోని వేర్వేరు వర్గాలకు ప్రత్యేకించి రైతులనుంచి వ్యాపారుల వరకూ ప్రయోజనం కలుగుతుంది. పౌరులకు ఉపకరించేలా తీసుకున్న ఈ నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు పన్నుల వ్యవస్థను వ్యూహాత్మకంగా మార్చడంతోపాటు ప్రతీ భారతీయుడి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయనే అభిప్రాయాన్ని మంత్రిమండలి వ్యక్తం చేసిందని మంత్రి పార్ధసారథి వెల్లడించారు.